బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి శూన్యం

– నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా
– ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటు ద్వారా గుణపాఠం చెప్పాలి
– ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు
నవతెలంగాణ-దుబ్బాక రూరల్ : ప్రజా సంక్షేమాన్ని గాలికి వది లేసిన బీఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నికల్లో గుణపాఠం తప్పదని 10 ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో పేద, మధ్య తరగతి ప్రజలకు కష్టాలు, కన్నీల్లే మిగిలాయని, రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుందని, బిజెపి తోనే రాష్ట్రం సంపూర్ణ, సమగ్ర అభివృద్ధి జరుగుతుందని, త్వరలో జరిగే శాసనసభ ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటేసి, బిజెపి ని గెలిపించాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రజలను కోరారు. శుక్రవారం మండలంలోని గంభీర్పూర్, శిలాజినగర్, వెంకటగిరి తండాలో ఆయన బిజెపి శ్రేణులతో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల ప్రజలు డప్పు చప్పులతో, బోనాలతో, బతుకమ్మలతో మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….10 ఏండ్లు మెదక్ ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్రెడ్డి దుబ్బాక నియోజకవర్గాన్ని అడుగడుగునా నిర్లక్ష్యం చేశాడని ఆరోపించారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన మూడేళ్ల కాలంలో నియోజకవర్గ సమస్యలను శాసనసభలో గళమెత్తి, వాటిని పరిష్కరించేందుకు తన వంతు కృషి చేశానన్నారు. ఉపాధ్యాయ అభ్యర్థులకు ఉచిత టెట్ కోచింగ్, నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత కానిస్టేబుల్, ఎస్సై కోచింగ్, జాబ్ మేళా ద్వారా రెండు వేల మందికి ఉద్యోగాలు, వాహనదారులకు ఉచిత డ్రైవింగ్ లైసెన్స్లను అందజేశామని గుర్తు చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నేటి వరకు పేదలకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని, దళిత బంధు, బీసీ బంధు, గృహలక్ష్మీ పథకాలు అంటూ బడుగు, బలహీనవర్గాలను సీఎం కేసీఆర్ మరోసారి మోసం చేశాడని విమర్శించారు ధరణితో ప్రభుత్వం పేదల భూములను కబ్జాదారులపాటు చేస్తుందని ఆరోపించారు. దుబ్బాక ఒక కన్ను సిద్దిపేట ఒక కన్ను అని తరచు వల్లె వేసే జిల్లా మంత్రి హరీష్ రావు ఉన్న నిధులన్ని సిద్ధిపేటకు తరలించుకుపోయాడని. అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో యువతకు ఉద్యోగ నోటిఫికేషన్లు రాక, ఉద్యోగాలు లేక, ఎంతో నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 60 లక్షల జనాభా ఉన్న ముదిరాజ్లలకు బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా ఇవ్వలేదని, కాని రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని బిజెపి ఇప్పటికే ప్రకటించిందని తెలిపారు. ఆయన వెంట భాజపా నాయకులు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అంబటి బాలేశ్ గౌడ్,మండల అధ్యక్షుడు అంబటి శివ ప్రసాద్ గౌడ్,మచ్చ శ్రీనివాస్, పుట్ట వంశీ, మట్ట మల్లారెడ్డి, తదితరులు ఉన్నారు.