– కొన్ని మండలాల్లో లోటు వర్షపాతం నమోదు
– నిండని ప్రాజెక్టులు..చెరువుల్లోకి చేరని నీరు
– ఇంకా 8మీటర్ల లోతులోనే భూగర్భజలాలు
– పరిస్థితి ఇలాగే కొనసాగితే రబీ పంటలకు కష్టం
జిల్లాలో అడపాదడప వర్షాలు కురుస్తున్నా.. అంతగా ఉపయోగం ఉండటం లేదు. పంటలకు సరిపడా వర్షం కురుస్తున్నా..భవిష్యత్తు అవసరాలకు మాత్రం సరిపడటం లేదు. వర్షాకాలం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు ఒకటి, రెండు వానలు తప్పితే..జోరుగా కురిసిన సందర్భాలు లేవు. దీంతో వేసవిలో బోసిపోయిన సాగునీటి ప్రాజెక్టులు.. చెరువుల్లోకి కొంత మేరకు కొత్త నీరు వచ్చినా..పూర్తిగా నిండే స్థాయికి రావడం లేదు. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో సాధారణ వర్షపాతం మాత్రమే నమోదవుతుండగా.. కొన్ని మండలాల్లో లోటు వర్షపాతాన్ని సూచిస్తుండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే వరి సాగుతో పాటు రానున్న రబీ పంటలకు నీరందించడం కష్టతరంగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉమ్మడి జిల్లాలో వరుసగా జోరు వానలు కురుస్తాయని వాతావరణశాఖ చెబుతున్నా ఆ స్థాయి వర్షాలు మాత్రం కనిపించకపోవడం జిల్లావాసులను నిరాశకు గురిచేస్తోంది.
నవతెలంగాణ- ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి జిల్లాలో వర్షాలు ఇంకా జోరందుకోవడం లేదు. పంటలకు అవసరమయ్యేలా అడపాదడప కురుస్తున్నా.. నీటి నిల్వకు మాత్రం ఉపయోగపడటం లేదు. వర్షాకాలం ప్రారంభమై నెలన్నర గడుస్తున్నా పూర్తిస్థాయిలో వర్షాలు కురవడం లేదు. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో సాధారణ వర్షపాతమే నమోదు కాగా.. ఇంకా కొన్ని మండలాల్లో లోటు వర్షపాతం సూచిస్తుండటం పరిస్థితి తీవ్రతకు అద్ధం పడుతోంది. జిల్లాలో ఇప్పటి వరకు 321.8మి.మి వర్షపాతం కురవాల్సి ఉండగా 357.3మి.మి కురిసింది. దీంతో సాధారణ కంటే కొంత ఎక్కువగానే ఉన్నా.. నేరడిగొండ మండలంలో మాత్రం లోటు వర్షపాతం కనిపిస్తోంది. మరోపక్క రెండు రోజులకు ఒకసారి కురుస్తున్న ఈ వర్షం పంటలను అనుకూలంగా మారగా.. భవిష్యత్తు అవసరాలకు నిల్వ ఉండటం లేదు. దీంతో పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోవు రోజుల్లో దుర్బిక్ష పరిస్థితులు తలెత్తుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రాజెక్టుల్లో జలకళ ఏదీ..?
కిందటేడాది అధిక వర్షాల కారణంగా ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులన్ని ఇప్పటికే పూర్తిగా నిండిపోయాయి. వర్షాకాలం ప్రారంభం నుంచి ఎడతెరిపి లేకుండా కురవడంతో జూన్ చివరి నాటికే అనేక ప్రాజెక్టులు నిండుకుండలా కనిపించాయి. జులైలో అధిక వర్షాల కారణంగా ప్రాజెక్టుల్లోకి వచ్చిన వరద నీటిని అధికారులు కిందకు వదిలారు. దీంతో సెప్టెంబర్‌లో వర్షాలు ఆగిపోవడంతో ప్రాజెక్టుల్లో నీటి నిల్వ తగ్గిపోయింది. కిందటేడాది రబీ పంటలకు నీళ్లందించడంతో వేసవి నాటికి ప్రాజెక్టుల్లో నీరు లేకుండా పోయింది. కడెం ప్రాజెక్టు గేట్లు పనిచేయకపోవడంతో నీరంతా కిందకు వెళ్లిపోయి రబీ పంటలకు కూడా నీరందించలేని పరిస్థితి కనిపించింది. తాజాగా ఈ ఏడాది జులై రెండో వారం ప్రారంభమైనా ప్రాజెక్టుల్లోకి నీరు చేరడం లేదు. వర్షాలు అంతగా లేని కారణంగా ప్రాజెక్టుల్లోకి వరద ప్రభావం కనిపించడం లేదు. మరోపక్క గ్రామాల్లోని చెరువులు, కుంటలు సైతం నిండటం లేదు.
రబీలో కష్టమే..!
జిల్లాలో వర్షపాతం ఇలాగే కొనసాగితే రానున్న రబీలో పంటలకు నీరందించడం కష్టతరంగా మారుతోంది. ప్రతి ఏటా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 12లక్షల హెక్టార్లలో వివిధ రకాల పంటలు పండిస్తుంటారు. ప్రాజెక్టుల్లో నీరు పుష్కలంగా ఉంటేనే వరితో పాటు వివిధ రకాల పంటలకు సాగునీరందించవచ్చు. కానీ ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో కీలకమైన కడెం, సాత్నాల, మత్తడివాగు, ఎల్లంపల్లి, స్వర్ణ తదితర ప్రాజెక్టుల్లోకి వరద నీరు అంతగా రావడం లేదు. దీంతో ఈ ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండితేనే రానున్న యాసంగిలో పంటలకు ఉపయోగం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మరోపక్క వేసవి చివరి నాటికి జిల్లాలో 10మీటర్ల లోతుకు వెళ్లిపోయిన భూగర్భజలాలు వర్షాకాలం ప్రారంభమైనా పెరగడం లేదు. జున్ నాటికి కేవలం 2మీటర్లు మాత్రమే పెరిగాయి. ఇంకా 8మీటర్ల లోతులో భూగర్భజలాలు ఉండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నాయి.