ఉండ ఇల్లు లేదు, పండ మంచం లేదు

ఉండ ఇల్లు లేదు, పండ మంచం లేదుసంసారం అంటే ఓ ఇల్లు అవసరం. సంతం ఇల్లో కిరాయి ఇల్లో లేకపోతే అసలే నడవది. పూరాగ లేనోల్ల సంగతేమోగానీ సంచార జీవనం చేసి ఊరూరికి మకాం మార్చే వాల్ల సంగతి కష్టంగా వుంటది. వాల్లను మందలిస్తే ‘ఉండ ఇల్లు లేదు, పండ మంచం లేదు’ అని మనోవేదన వ్యక్తం చేస్తారు. ఇండ్లు వుండి ఉద్యోగమో సద్యోగమో చేస్తున్నవారి బాధలు వేరే తీరు వుంటయి. ఒక్కోసారి ఎల్లని స్థితిలో వుంటే ‘వుంటే ఉగాది లేకుంటే శివరాత్రి’ అనే సామెతను వాడుతారు. కొందరి ఇండ్లండ్లకు అవసరం లేకున్నా వచ్చి ముచ్చట్లు గంటలకు గంటలు పెట్టేవాల్లు వుంటరు. ఇలాంటి వాల్లు పూర్వకాలంలోనూ వుంటరు. వచ్చి మాట్లాడేవాల్లు కాకున్నా దూరపు చుట్టాలు కొందరు రెండుమూడు రోజులయినా తిరిగి వాల్ల ఊరికి వెళ్లిపోరు. అప్పుడు ‘ఉండమనలేక పొమ్మని పొగబెడుతరు’. పొయ్యిలో పొగ ఎక్కువ చేస్తే కండ్లు మండి ఇగనన్న ఎల్లిపోతరనే అర్ధంలో ఈ సామెతను వాడుతుంటారు. కల్గి వుండడం లేకపోవడం మీద మస్తు సామెతలు వున్నాయి. ఒక్కోసారి ‘వుంటే తింటం లేకుంటే పంటం’ అంటారు. పైన చెప్పిన శివరాత్రి సామెత లాంటిదే ఈ మధ్య బాగా పాపులర్‌ అయ్యింది. అట్లనే ‘వుంటే లిక్కి లేకుంటే కొడవలి’ అనే సామెత కూడా వున్నది. లిక్కి అంటే చిన్నగా వుండే కొడవలి అన్నట్టు. వరి కోతకు మక్కజొన్న కోతకు కొడవలి లేకపోతే చిన్నగ వుండే లిక్కే ఉపయోగిస్తామని అంటుంటరు. ఇలాంటి సామెతలు జాతీయాలు తరతరాలుగా వస్తున్నాయి. వీటికి ఎవరు సృష్టికర్తలో ఇదమిద్దంగా చెప్పలేం. ఇదొక పరంపర. ఒక్కోసారి ‘ఉత్తగున్నోనికి ఊహలెక్కువ’ అని చమత్కారంగా వాడుతరు. ఏదైనా సృజనాత్మక క్రియ కల్గాలంటే శ్రమ తక్కువగా వున్న వాల్లకే సాధ్యం అవుతుందనేది దాని వివరణ. లేకుంటే అన్నీ ఈయనకెందుకురా అనే సందర్భంలో ‘ఉడుతకు ఎందుకురా ఊరు పెత్తనం’ అనే సామెతను వినియోగిస్తారు.

– అన్నవరం దేవేందర్‌, 9440763479