రుణమాఫీ.. లేదు సాఫీ

Loan waiver.. No Safi– అక్షరం తేడా ఉన్నా అంతేసంగతులు..!
– లోన్‌ అకౌంట్‌ నెంబర్‌ మారినా వర్తించట్లే..!
– బంగారం తాకట్టు రుణాల ఊసేలేదు..
– రైతుల రుణమాఫీలో కొర్రీలు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రుణమాఫీ పథకం సాఫీగా సాగట్లేదు. 2018 ఎన్నికల హామీగా ఇచ్చిన ఈ రుణమాఫీపై ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామన్న హామీని ఐదేండ్ల పాటు సాగదీస్తూ వచ్చిన ప్రభుత్వం ఇప్పటికీ అదే ధోరణి ప్రదర్శిస్తోంది. సాంకేతిక కారణాల పేరుతో వీలైనంత మంది అర్హులకు ఈ మాఫీ వర్తించకుండా చేయాలనే తాపత్రయమే బ్యాంకర్లలో కనిపిస్తోంది. అందుకే నానా రకాల కొర్రీలు పెడుతూ ఇబ్బందులు పెడుతున్నారని రైతులు వాపోతున్నారు. అక్షరం తేడా ఉన్నా మాఫీ ఇవ్వట్లేదు. సేవింగ్‌ అకౌంట్‌ నంబర్లు స్థిరంగా ఉన్నా.. పాత బాకీ క్లియర్‌ చేసి కొత్తగా లోన్‌ తీసుకున్నప్పుడు బ్యాంకులు లోన్‌ అకౌంట్‌ నెంబర్లలో మార్పులు చేస్తాయి. లేదంటే లోన్‌ అకౌంట్‌ నంబర్లలో బ్యాంకు సిబ్బంది అవగాహన కోసం ఎస్టీలకు అంకెలతో పాటు ఇంగ్లీష్‌ అక్షరాలతోనూ లోన్‌నంబర్లు ఇస్తారు. ముఖ్యంగా సహకార సంఘాల్లో ఇలాంటి మార్పులు ఎక్కువగా ఉంటాయి. వీటిలో ఏది చోటుచేసుకున్నా ‘కాదేదీ కొర్రీకి అనర్హం’ అన్నట్టుగా బ్యాంకులు వ్యవహరిస్తున్నాయి. వీటిపై ప్రభుత్వం సీరియస్‌గా స్పందించకపోవడంతో ‘బ్యాంకర్లు ఆడిందే ఆట.. పాడిందే పాట’ అనే రీతిలో వ్యవహరిస్తున్నారని రైతులు వాపోతున్నారు.
సాగుతూ.. ఉన్న రుణమాఫీ
రుణమాఫీ పథకం సాగుతూ ఉంది. సెప్టెంబర్‌ 15వ తేదీ నాటికి పూర్తి కావాల్సి ఉన్నా ఇప్పటికీ సగం మందికి ఈ రుణమాఫీ అమలు కాలేదు. రూ.వెయ్యి కోట్లు విడుదల చేశామని ప్రభుత్వం ప్రకటించినా ఖజానాలో వెసులుబాట్ల కోసం అన్వేషిస్తోంది. సాంకేతిక లోపాలను కారణంగా చూపి మాఫీ అమలును నత్తనడకన కొనసాగిస్తోంది. 2018 డిసెంబర్‌ 12లోపు తీసుకున్న పంట రుణాలను మూడు నెలల్లో మాఫీ చేస్తామన్న ప్రభుత్వం 2020 మే నెలలో రూ.25వేల లోపు, 2021 డిసెంబర్‌ నాటికి రూ.50వేలు కొంతమందికి చేసింది. ఎన్నికలు సమీపిస్తుండటంతో రూ.లక్షలోపు రుణమాఫీని ప్రకటించింది. ఇప్పటికే ప్రభుత్వం పెట్టిన గడువు ముగిసినా ఇంకా సగం మందికి రూ.లక్ష రుణమాఫీ అమలుకాలేదు.
మాట మార్చిన ప్రభుత్వం.. రైతుకు బదులు కుటుంబానికి..
ఎన్నికల్లో ఒక్కో రైతుకు రూ.లక్ష లోపు రుణమాఫీ అని ప్రకటించిన ప్రభుత్వం ఆచరణకు వచ్చే సరికి కుటుంబానికి రూ.లక్షగా మార్చడంతో రైతు కుటుంబాల గుర్తింపు ప్రక్రియ ఆలస్యమవుతోంది. రుణమాఫీ 2014 ప్రక్రియను మండలస్థాయి కమిటీ క్షేత్రస్థాయిలో విచారణ చేసింది. ఈ కమిటీలో బ్యాంకర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఏవోలు ఉన్నారు. కానీ ఈసారి సాఫ్ట్‌వేర్‌ ఆధారంగా మాఫీ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. బ్యాంకులు, సహకార సంఘాల్లో పంట రుణాలు తీసుకున్న రైతుల వివరాలను 2019లోనే తీసుకున్న ప్రభుత్వం దాన్ని రుణమాఫీ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లో అప్‌లోడ్‌ చేసింది. రేషన్‌, ఆధార్‌కార్డుల అనుసంధానం పూర్తయింది. ప్రభుత్వం దగ్గర సమగ్ర కుటుంబ సర్వే డేటా ఉండటంతో వీటి ఆధారంగా రైతు కుటుంబాలను గుర్తించారు. రైతు కుటుంబాల్లో ఎక్కువ రుణం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తూ రూ.లక్ష రుణమాఫీ చేయాల్సి ఉంటుంది. కానీ కుటుంబ గుర్తింపు ఇంకా పూర్తి కాలేదు. రుణమాఫీ సైట్‌లో రైతు ఆధార్‌ నంబర్‌ను ఎంటర్‌ చేస్తే రిమార్క్‌ కాలంలో ‘నో ఫ్యామిలీ గ్రూపింగ్‌’ అని వస్తుంది. ఇలాంటివి ఒక్క కారేపల్లి మండలంలోనే 200 వరకు ఉన్నాయి.
అక్షరం మారినా ఆగినట్టే..!
ఒక రైతు రెండు బ్యాంకుల్లో రుణాలు తీసుకుంటే రెండింటిలోనూ పేరు ఒకేలా ఉండాలి. అక్షరం తేడా ఉన్నా మాఫీ నిలిచిపోతుంది. రుణమాఫీ సైట్‌ రిమార్క్‌ కాలంలో ‘సేమ్‌ ఆధార్‌కార్డు నెంబర్‌ ఫర్‌ డిఫరెంట్‌ పర్సన్స్‌’ అని చూపుతుంది. ఉదాహరణకు కారేపల్లి మండలంలో ఇమ్మడి సూరమ్మకు సొసైటీ, ఎస్‌బీఐ మాధారం బ్రాంచీల్లో లోన్‌ ఉంది. ఆమె పేరుకు సొసైటీలో ఇంగ్లీష్‌లో ఈని ఉపయోగించారు. మాధారం బ్రాంచిలో ఐ రాశారు. అంతే సూరమ్మకు మాఫీ కాలేదు. ఇలాంటివి కారేపల్లి, ముదిగొండ, కూసుమంచి మండలంలో ఎక్కువగా చోటుచేసుకున్నాయి. కారేపల్లిలోనే 750కి పైగా ఉన్నాయి. లోన్‌ అకౌంట్‌ నంబర్లలో అక్షరాలున్నా కూడా ఇదే పరిస్థితి. అంకెలతో పాటు ఇంగ్లీష్‌ అక్షరాలతో నెంబర్లు ఇచ్చినా రుణమాఫీ కావట్లేదు. రూ.25వేలు, రూ.50వేలలోపు ఎలాంటి సమస్య లేకుండా మాఫీ అయినప్పుడు ఇప్పుడు మాత్రమే ఇదేంటని బాధితులు ప్రశ్నిస్తున్నారు. పంట పెట్టుబడులకు బంగారం తాకట్టు పెట్టి రుణం తీసుకున్నా మాఫీ వర్తింపజేస్తామన్న ప్రభుత్వం ఆ ఊసే మరిచింది.
రుణమాఫీ వచ్చినా జమకాని పైకం..
కమర్షియల్‌ బ్యాంకులు ఎస్‌బీఐ, ఏపీజీవీబీ, యూనియన్‌ బ్యాంకుల్లో రైతుల రుణాలు మాఫీ అయినా పైకం వారి ఖాతాలో జమకాకుండా ఆర్‌బీఐకి వెళ్లాయి. ఓ రైతు 2018 డిసెంబర్‌ 12లోపు రుణం తీసుకుని ఐదేండ్లలో ఆ రుణం పూర్తిగా చెల్లించి మళ్లీ రుణం తీసుకుంటే లోన్‌ అకౌంట్‌ నంబర్‌ మారుతుంది. పాత లోన్‌ నంబర్‌తో వచ్చిన మాఫీ పైకం వెనక్కు వెళ్లిపోతుంది. ఇలాంటి ఖాతాలు కమర్షియల్‌ బ్యాంకుల్లో అధికంగా ఉన్నాయి. ఇలా రకరకాల కారణాలతో రుణమాఫీ మెజార్టీ రైతులకు అందకుండా పోతుంది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారుల ద్వారా విచారణ చేపించి అర్హతున్న రైతులందరికీ రుణమాఫీ అందేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. మరోవైపు ఎన్నికల నోటిఫికేషన్‌ సమయం కూడా ఆసన్నమవుతుండటంతో ఇంకా మాఫీ కాని రైతుల్లో ఆందోళన నెలకొంది.