అమ్మ ఓర్పు నాన్న కరుణ
రాలి పడ్డాను లోకంలోకీ
మద్దతు ధర లేకుండానే
పంట పండింది పేద ఇంటిలో
బాగుపడాలి అని
బడికి పంపారు పస్తులుండి
మాష్టారు కన్నా
మానేరు నేర్పింది ఎక్కువ
ఎండిన నాడు ఎవరూ రారని
శాఖ గ్రంథాలయమే
దేవాలయం నాకు ఎప్పటికీ
ఎర్ర పుస్తకాలే
గుండె నిండా విశ్వాసం నింపి
చచ్చేంత ధైర్యం దట్టించేవి
కాలేజ్ మాత్రం
ఒక కాగితం చేతిలో పెట్టింది జాలిగా
సంపాదించడం సమస్య కాదు
బానిస బతుక్కు
అలవాటు కావాలి అంతే
తోటి వారిని తోసేయడం
తెలియనట్లు తొక్కడం అలవాటు కాక
వెనకబడిపోతూనే ఉన్నా ఇప్పటికీ
స్వేచ్ఛగా సావనీయరు కదా
తోడని నీడని కొంగుముడి వేసారు
మూన్ స్టార్స్ కనబడ్డాయి
కానీ హానీ ఎప్పుడూ దొరకలే….
సంసారం సాకటం కన్నా
సముద్రము తోడటం మిన్నా
కొడుకుకు పంచింది ఎంతో
మనుమనుకి దాచినది లేదా
ముసలితనానికి మిగిలింది ఉందా
పిండం పెట్టడానికి కూడా
పక్కకు పెట్టాలనే కొత్త షరతు
జీవితం ఎక్కువే ఇచ్చింది
దాచుకునేందుకు సొంతంగా
లాకర్ లేకుండా పోయింది
అనుభవాలన్నీ నాతోనే గోతిలోకి….
– దాసరి మోహన్
9985309080