ఎన్ని అడ్డంకులొచ్చినా బహిరంగ సభ నిర్వహిస్తాం

No matter how many obstacles we face, we will hold an open meeting– 17న తుక్కుగూడలో 10 లక్షల మందితో సభ : టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి
నవతెలంగాణ-మహేశ్వరం
సోనియాగాంధీ భిక్షతోనే కేసీఆర్‌కు సీఎం పదవి దక్కిందని.. 17వ తేదీన ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా బహిరంగ సభ నిర్వహించి తీరుతామని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి అన్నారు. ఈనెల 16, 17వ తేదీల్లో సీడబ్ల్యూసీ సమావేశం ఉంటుందని తెలిపారు. తుక్కుగూడ బహిరంగ సభ నుంచే దేశ రాజకీయాలను ప్రభావితం చేసే చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటామన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపల్‌ పరిధి ఫ్యాబ్‌సిటీ దగ్గర ఈనెల 17న కాంగ్రెస్‌ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో శనివారం సభ ఏర్పాట్లను రేవంత్‌రెడ్డి పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 17న నిర్వహించే బహిరంగ సభ కోసం ముందుగా సికింద్రాబాద్‌ పేరేడ్‌ గ్రౌండ్‌లో అనుమతి తీసుకున్నట్టు తెలిపారు. కానీ బీజేపీ కుట్ర వల్ల కేంద్ర ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహిస్తుందనే సాకుతో అక్కడ సభకు అనుమతి ఇవ్వలేమని అధికారులు చెప్పారన్నారు. అనంతరం గచ్చిబౌలిలో బహిరంగ సభ కోసం అడిగితే రాష్ట్ర ప్రభుత్వం పర్మీషన్‌ ఇవ్వలేదన్నారు. చివరగా తుక్కుగూడలో బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో బహిరంగ సభ కోసం పర్మీషన్‌ అడిగామని.. ఇక్కడా అనుమతి ఇవ్వలేదని.. చివరకు ఫ్యాబ్‌ సిటీ సమీపంలో రైతులు ముందుకొచ్చి తమ స్థలంలో బహిరంగ సభ ఏర్పాటు చేసుకోవచ్చని ఇచ్చారన్నారు.
రైతులు స్థలం ఇవ్వడంతో ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఎన్ని కుట్రలు చేసినా ఖమ్మం సభ కన్నా పెద్దఎత్తున పది లక్షల మందితో తుక్కుగూడ సభను విజయవంతం చేస్తామన్నారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ రెండూ ఒకటేనని, కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్‌కు కాంగ్రెస్‌ పార్టీని చూస్తే వణుకు మొదలైందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో కూటమి ఏర్పాటు చేసిన తరుణంలో మోడీకి భయం పట్టుకుని దేశం పేరునే మారుస్తూ భారత్‌గా పెట్టాలని చూస్తున్నారని అన్నారు. కానీ గత సంవత్సరం రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడోయాత్ర పేరులో భారత్‌ ఉందని, మరి ఇప్పుడు ఏం చేస్తారని ప్రశ్నించారు. మోడీ ఎన్ని కుట్రలు చేసినా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అఖండ విజయం సాధించడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు.