ఎన్ని ట్రిక్కులు చేసినా.. బీఆర్‌ఎస్‌దే హ్యాట్రిక్‌

No matter how many tricks you do..
BRS is a hat trick– దళిత నేతలను దగా చేసింది
– దళితులపై కాంగ్రెస్‌ ముసలి కన్నీరు : మంత్రి హరీశ్‌రావు
– బీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్‌నేత అభిలాష్‌రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
‘రాష్ట్రంలో ఏమూలకు పోయినా, ఎవ్వరిని అడిగినా మళ్లా వచ్చేది బీఆర్‌ఎస్‌ సర్కారు అంటున్నారు. ఇందులో ఎవ్వరికి అనుమానం లేదు. ఎవరు ఎన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్‌ కొట్టేది బీఆర్‌ఎస్సే. కానే కాదన్న తెలంగాణను సాధించి చూపెట్టింది కేసీఆర్‌. రైతు బంధు, రైతు బీమా ఇలా అనేక కార్యక్రమాలు అమలు చేసింది కేసీఆర్‌. ప్రతి ఇంటికి నల్లా పెట్టి నీళ్లు ఇచ్చి చూపింది కేసీఆర్‌. చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకున్నారు’ అని మంత్రి హరీష్‌రావు అన్నారు. తెలంగాణ భవన్‌లో మంత్రి హరీశ్‌రావు సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అభిలాష్‌రావు, ఇతర నాయకులు బీఆర్‌ఎస్‌లో ఆదివారం చేరారు. వారికి పార్టీ కండువాకప్పి హరీశ్‌రావు ఆహ్వానించారు. ఈ సందర్బంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ కల్వకుర్తి ప్రాజెక్టుకు కాంగ్రెస్‌ వాళ్లు కొబ్బరి కాయలు కొడితే తెలుగు దేశం వాళ్లు మొక్కలు నాటారని, తెలుగుదేశం వాళ్లు కొబ్బరికాయలు కొడితే ఆ శిలాఫలకాల దగ్గర కాంగ్రెస్‌ వాళ్లు మొక్కలు నాటారని, కానీ నీళ్లు మాత్రం రాలేదని విమర్శించారు. ప్రాజెక్టును పూర్తి చేసి మూడున్నర లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చింది మాత్రం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని అన్నారు.
‘కాంగ్రెస్‌ వాళ్లవన్నీ ఉత్తుత్తి డిక్లరేషన్‌, ఎందుకు పనికిరాని డిక్లరేషన్‌ కర్ణాటకలో గెలిచి అక్కడ ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు. ఎలాగో అధికారంలోకి రామనే నమ్మకంతో ఇష్టం వచ్చినట్లు వాగ్ధానాలు ఇస్తున్నారు. 2009 ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినవి ఒక్కటి అమలు చేయలేదు కాంగ్రెస్‌. కొల్లాపూర్‌ అభివృద్ధి బీఆర్‌ఎస్‌ పార్టీ వల్లనే సాద్యం. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని త్వరలో ప్రారంభించబోతున్నాం. నాగర్‌ కర్నూల్‌ జిల్లా సస్యశామలం అవుతుంది. బాబుజగజ్జీవన్‌ను ప్రధాని కాకుండా అడ్డుకున్న కాంగ్రెస్‌ ముసలి కన్నీరు కారుస్తున్నది. ఆనాడు ఉచిత కరెంట్‌ అని ఉత్త కరెంట్‌ చేశారు. రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నప్పుడు కరెంట్‌ కష్టాలు. ఎట్ల సాధ్యమైతది నిరంతర కరెంట్‌ అన్నరు. చేసి చూపింది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం. మహబూబ్‌నగర్‌లో 14కు 14 గెలిచి చూపిద్దాం. వలసల జిల్లా నాడు, ఇప్పుడు వలసలు వాపస్‌ అయ్యాయి’ అన్నారు.
ఖర్గేనే అవమానించిన రేవంత్‌కు దళితుల గురించి మాట్లాడే హక్కులేదు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌
సాక్షాత్తు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేనే అవమానించిన రేవంత్‌కు దళితగిరిజనుల గురించి మాట్లాడే హక్కులేదని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ విమర్శించారు. ‘సీడబ్ల్యూసీ మెంబర్‌ దామోదర్‌ రాజ నరసింహాకు గాంధీభవన్‌లో కనీసం సన్మానం చేయకుండా రేవంత్‌ అవమానించారు. సీఎల్పీ నేత భట్టివిక్రమార్క పాదయాత్రను పొంగులేటి పాలపొంగుతో పరేషాన్‌ చేసి అవమానించిన రేవంత్‌కు దళితగిరిజనుల గూర్చి మాట్లాడే హక్కు లేదు. కేంద్ర మంత్రిగా పని చేసి తెలంగాణ కోసం పార్లమెంటులో కొట్లాడిన సర్వే సత్యనారాయణను కుంటిసాకులతో తీసేశారు. కురువద్ధ మహిళా నేత గీతారెడ్డి 50 ఏండ్లుగా గాంధీ సిద్ధాంతాలతో, క్రమశిక్షణ గల నేతగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, సీఎల్పీ నేతగా, మహిళ కాంగ్రెస్‌ చీఫ్‌గా, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా పని చేస్తే చివరకు ఆమెకు వ్యతిరేకంగా జహీరాబాద్‌ టికెట్‌ కోసం ప్రత్యర్థులను రెచ్చగొట్టి ఆమెను అనారోగ్యానికి గురి చేశారు. దామోదరం సంజీవయ్యను దగా చేసిన కాంగ్రెస్‌కు దళితగిరిజనుల గురించి మాట్లాడే హక్కు లేదు. దళిత అగ్రనేతలకు అడ్రస్‌లేదు. పేద దళితులను డిక్లరేషన్‌తో దగా చేస్తారా?’ అని విమర్శించారు.
ఆ ప్రచారం అవాస్తవం : శంభీపూర్‌ రాజు
మల్కాజ్‌గిరి నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా తాను పోటీచేస్తున్నట్టు కొన్ని మీడియా, సోషల్‌ మీడియా సంస్థలు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని ప్రభుత్వ విప్‌ శంబీపూర్‌రాజు తెలిపారు. తాను కుత్బుల్లాపూర్‌ నియోజక వర్గ పనుల మీదనే మంత్రి హరీష్‌రావును కలిశానని చెప్పారు. మంత్రితో భేటీ సందర్భంగా వేరే విషయాలు ఏవీ చర్చకు రాలేదన్నారు. మీడియా తక్షణమే దుష్రచారాన్ని ఆపాలని కోరారు.