ఇటీవల నేను(వ్యాస రచయిత) పంటి సమస్యతో నగరంలోని ఒక ప్రముఖ దంత వైద్యశాలకు వెళ్లాను. అక్కడ పనిచేసే వైద్యుల్లో అందరు యువతీ యువకులే.వీరిలో మెజార్టీ అమ్మాయిలే. అయితే విస్మయం కలిగించే విషయమే మంటే అందరు కుర్తా పైజామా డ్రెస్సులే ధరించారు. ఈమధ్య వచ్చిన ట్రెండ్‌లో భాగంగా పొట్టి పైజామాలు కొంచెం కాళ్లకి పైకి ధరించటంతో వాళ్ల మడిమ భాగంలో ఆభరణాలు చూపరులకు కనిపిస్తాయి.ఈ రోజుల్లో స్త్రీలు కాళ్లకి ఆభరణాలకు బదులు ఒక నల్లటి దారాన్ని ధరించటం ప్యాషన్ అయింది. ఈ నల్లటి దారాలను చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ధరించటం పరిపాటిగా మారింది. వీటిని ఎందుకు ధరిస్తున్నారు? అని విచారించగా దిష్టి నివారించేందుకని తెలిసింది.ఈ దిష్టినే ఆంగ్లంలో ఇవిల్ ఐ అని అంటారు. దిష్టి అనేది భారత దేశంలో అనాది కాలం నుండి ప్రచారంలో వుంది. ఇది ఒక్క హిందూమతంలోనే కాకుండా ముస్లిం, క్రిస్టియన్, యూదు మతంలో కూడా విస్తరించింది. ప్రధానంగా కొందరి చూపు మంచిది కాదని, అది వేరేవారిపై పడితే ఆరోగ్య సమస్యలు వస్తాయని, మంత్రాలూ, తంత్రాలు చేస్తారని దానికి విరుగుడుగా తాయత్తులు కట్టుకోవడం, మంత్రాలకు విరుగుడుగా పూజలు చేయటం మనం చూసివుంటాం.మరి నిజంగా దిష్టి, మంత్రాలు ఉంటాయా? మరి చదువుకొని వైద్యం చేస్తున్న డాక్టర్లు నల్లదారం ఎడమ కాలుకు కట్టుకోవడ మేంటి? దీన్నిబట్టి చూస్తే మనమెంత అంధకారంలో ఉన్నామో అర్థం చేసుకోవచ్చు.
1976లో భారత రాజ్యాంగానికి 46వ సవరణలో భాగంగా 51ఎ ఆర్టికల్ ప్రకారం పౌరుల్లో సైంటిఫిక్ టెంపర్‌ను పెంపొందించటం ప్రతిపౌరుని ఫండమెంటల్ డ్యూటీగా పేర్కొన్నారు. కానీ నేడు చదువుకున్న వారే దిష్టిదారాలు, బాబాల దగ్గరికి పరుగెత్తటం చూస్తుంటే మన విద్యావిధానంలో తేడా వున్నదనే విషయం స్పష్టమవుతున్నది. మనమందరం చదువుకొనే రోజుల్లో న్యూటన్ ద్రవ్య నిత్యత్వ నియమం గురించి హైస్కూల్ స్థాయిలోనే చదువుకున్నాము. దీని ప్రకారం సృష్టిలో పదార్దాన్ని సృష్టించలేము, నాశనం చేయలేము, కానీ ఒకరూపంలో నుండి మరో రూపంలోకి మారుతున్నదనే విషయాన్ని నేర్చుకున్నాము.మరి ఈనాడు కొందరు బాబాలు తమ దగ్గర అతీంద్రియ శక్తులు ఉన్నాయని హస్తలాఘవం చూపించటం, వాటిని నమ్మి దేవునిగా భావించటం చూస్తూనే ఉన్నాము. అయితే బాబాల బండారం బయటపడ్డప్పుడు కానీ భక్తులకు కనువిప్పు కలగదు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోవడం బాధాకరం.
ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో బోలేబాబా సత్సంగ్‌లో జరిగిన తొక్కిసలాటలో నూట ఇరవై ఒక్కమంది ప్రాణాలు కోల్పోవటం, వందలాది మంది గాయపడటం టీవీల్లో, వార్తల్లో మనం చూశాం. ఇందులో పాల్గొన్న భక్తులు మెజారిటీ నిమ్న కులాలకు చెందినవారు. ముఖ్యంగా మహిళలు వారికున్న ఆర్థిక, అనారోగ్య సమస్యలకు ఆ బాబా నడిచిన పాదదూళితో విముక్తులమవుతామనే భావనలో ఉండటంతో జరిగిన దారుణమిది.అయితే దేశ ప్రజలు మూఢనమ్మకాల్లో కొట్టుమిట్టాడటానికి ప్రచార సాధనాలతో పాటు పాలిత వర్గాల ప్రోత్సాహం ఇలాంటి దృష్టాంతాలకు కారణం.బోలేబాబాగా అవతారం ఎత్తకముందు అతని పేరు సురజ్‌పాల్. ఈయన పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేసి బాబా అవతారమెత్తాడు. గతంలో ఈయన చనిపోయిన బాలికను బతికిస్తానని శ్మశానంలో హడావుడి చేసి జైలు పాలయ్యాడు. తర్వాత కాలంలో ఈయన ప్రభ బాబాగా వెలిగిపోయింది. ఈయనకు వర్జిన్ అమ్మాయిలే సుగంధాలతో కూడిన నీటితో స్నానం చేయిస్తారట! ఇప్పటికే వందలకోట్ల రూపాయల ఆస్తులు సంపాదించాడని సమాచారం. ప్రజల సొమ్ముతో ఆయన అద్దాల మేడలో నివసిస్తాడు, కానీ భక్తి అనే అంధకారంలో మునిగిన భక్తులు ఆయన పాదదూళి కోసం పడి చచ్చిపోతారు. ఎంతటి మూర్ఖత్వమిది, ఇది మూఢనమ్మకాల పర్యవసానం కాదా?
ఇంతమంది అమాయకులు చనిపోయినా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దానికి కారణమైన బోలేబాబాపై కేసు నమోదు చేయలేదు, ఎందుకు? బాబా చేతిలో ఉన్న ఓటుబ్యాంకు వారికి ముఖ్యం. పాలకులకు కావాల్సింది అధికారం తప్ప, ప్రజా శ్రేయస్సు కాదని ఇలాంటి ఘటనలు రుజువు చేస్తున్నాయి. దారి తప్పిన విద్యావిధానం కూడా దీనికి బాధ్యత వహించక తప్పదు! ఇలాంటి మూఢ నమ్మకాలను నమ్మొద్దని ప్రచారం చేసినందుకు డాక్టర్ దబోల్కర్, పన్సారే, గౌరీ లంకేశ్ , కల్బుర్గీ లాంటి యాక్టివిస్టులను హత్య చేసిన ఘటనలు దేశంలో అనేకం. డాక్టర్లు కాళ్లకు నల్ల దిష్టి దారాలను కట్టుకోవటం, చదువుకున్నవారు కూడా బాబాల మోసాలను నమ్మడం, ఇంకా ప్రస్తుత వ్యవస్థ కూడా వీటికి బహుళ ప్రచారం కల్పించటం చూస్తుంటే సగటు మనిషికి ఈ దేశమెటుపోతోందనే ఆందోళన కలగకమానదు.
– డాక్టర్. కె.సుధాకర్‌రెడ్డి, 8985037713