‘స్వచ్ఛమైనది ఏమున్నది లోకంలో, మనసుకూ మలినమంటెను, అణువణువులో.. కన్నీళ్లనూ పరీక్షించు, కనబడుతుంది ప్లాస్టిక్ నవ్వు, ముఖం తిప్పుకున్నా నువ్వు, వదలదు సర్వాంతర్యామి అయిన కాలుష్యపు ధాతువు’ అని కవి కాలుష్యాల గురించి ఆందోళన చెందుతాడు. మరి మనం కవి హృదయాన్ని వింటున్నామా? కవిత్వమేగా అని వొదిలేస్తున్నామా! మనం వొదిలేసినా మన చుట్టూనే కాదు, మనలోకీ ప్రవేశించింది మహాకాలుష్యం. ఇందుకల దందు లేదను సందేహము వలదు, ఎందెందు వెదికినా అందందు కలదు అన్నట్టుగా మనం మన ఆవరణాన్ని కాలుష్య మయం చేసుకుంటున్నాము. నిరంతరంగా, నిరభ్యంతరంగా. వాతావరణ కాలుష్యంతో పాటే ఆధ్యాత్మిక, రాజకీయ, ఆర్థిక సామాజిక కాలుష్యాలూ దిన దినమూ పెరిగి మరింత మానవ హననానికి దారి తీస్తున్నది.
మనకేమీ కనపడదు, వినపడదు, కానీ మహాప్రమాదమై మనల్ని ముంచెత్తుతోంది. దైనందిన పనుల్లో పడి, బతుకుదెరువుల్లోపడి భవిష్యత్తును చూడ నిరాకరిస్తున్నామా! మనపిల్లల రేపటి జీవనాన్ని గురించిన చింతన చేయలేక పోతున్నామా? ఒక్కసారి మనసుపెట్టి ఆలోచించాలి. కాస్త ఓపిగ్గా పునరాలోచన చేయాలి. వ్యవస్థ నింపేస్తున్న విషతుల్య ఆవరణాన్ని తిలకించాలి. వ్యాపారమయ మార్కెట్ ప్రపంచంలో లాభాలు తప్ప మరోకోణమే పట్టని ప్రయా ణంలో ఎవరేమయితే నాకేమి అని సూత్రమే ఆధిపత్యం వహిస్తుంది. అందుకే సమూహల గురించిన చింతగానీ, సమాజాల పట్ల బాధ్యతగానీ ఎవరూ వహించరు. ప్రభుత్వాలూ వారి వెంటే పరుగులు పెడతాయి. ఇట్లాంటి సమయంలోనే ప్రజలు పౌరసమాజం అప్రమత్తమవ్వాలి. సమూహంగానే ప్రతిస్పందించాల్సిన అవసరం ఉంది. సాధారణ పరిస్థితిలో కంటే అనేక రెట్లు పెరిగిన వాయు కాలుష్యం మన దేశ ముఖ్య నగరాల్లో వెల్లువెత్తుతోందని పరిశోధకులు, శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. రోజువారీ మరణాల్లో 7.2. శాతానికి వాయు కాలుష్యమే కారణమని వెల్లడించారు. ప్లాస్టిక్ మహమ్మారి మన శరీరంలోకి, రక్తంలోకి కూడా వచ్చి చేరింది. ఆఖరికి వాయువులోకి చొర బడింది. ఈ వాతావరణ కాలుష్యం మనుషులకే కాదు. జీవకోటి నంతటినీ చుట్టుముట్టింది. ఆవరణ వ్యవస్తే జబ్బుల పాలయ్యింది.
ఇదిలా వుంటే, ఆహారమూ కాలుష్యం కాకుండా ఎలా వుంటుంది? మనం తింటున్న పదార్థాల్లో విపరీతమైన హానికారక రసాయనాలు కలుస్తున్నాయి. ఎరువులు, పురుగు మందులు, రంగులు ఇతర విషాలన్నీ ఆహారంగా సేవిస్తున్నాము. రాబోయే రోజుల్లో ప్రపంచం మొత్తంలో క్యాన్సర్ రోగులు విపరీతంగా పెరిగే అవకాశముందని సర్వేలు చెబుతున్నాయి. బెంగళూరు, తమిళనాడుల్లో ఇటీవల పానీపూరీల్లో ఎంతటి విష పదార్థాలు ఉన్నాయో పరిశీలించారు. హైదరాబాద్ నగరంలోనూ చెడిపోయిన ఆహార పదార్థాలతో హోటళ్లు నడుస్తున్నాయని కనుగొంటున్నారు. మొన్న మన మహబూబాబాద్‌లో కల్తీకల్లు తాగి ఇద్దరు యువకులూ మరణించారు. అంతకు ముందు తమిళనాడులో కల్తీ మద్యంతో 54 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇవన్నీ కొన్ని ఉదాహరణలు మాత్రమే. లాభం ముందు ఏ నైతికతా, విలువా నిలబడజాలదు అనేదానికి ఇవన్నీ మచ్చుతునకలు. ఎంతకైనా తెగించకలిగే సాహసం లాభం చేస్తుంది. అందుకు బలయ్యేది సమాజమే.సామాన్యులే.
ఆధ్యాత్మిక కాలుష్య ఫలితాన్ని మనం ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో చూశాము. బాబా పాదధూళి కాలుష్యం 121 మంది ప్రాణాలను బలితీసుకుంది. ఇది మొదటిదేమీ కాదు. ఈ ప్రవచన కాలుష్యాలు రాజకీయ కాలుష్యాలతో కలిసి జమిలిగా సామాన్యులను చుట్టు ముడుతున్నాయి. అంతేకాదు వీటికి కార్పోరేటు వ్యాపారమూ జత కలిసి ఆధ్యా త్మిక వాణిజ్య రాందేవ్ బాబాగా దర్శనమిచ్చాడు. వ్యాపార కళనూ ప్రదర్శించాడు. వీటన్నింటికీ వెన్నుదన్నుగా నిలుస్తున్న రాజకీయ కాలుష్యం అసలైన కారకురాలు. ఒక విలువ, సిద్ధాంతము, మానవీయ ఆలోచనా, నిబద్దత లేని రాజకీయాలు మనం చూస్తున్నాము. సేవ, త్యాగము, నిజాయితీ మొదలైన లక్షణాలన్నీ మరుగునపడి, స్వార్థము, వైయక్తిక ప్రయోజనాలే రాజకీయాంశాలుగా ముందుకొచ్చాయి. పార్టీలు మారుతున్న వాళ్లకు, మారిన వాళ్లకు కూడా వారి ప్రయోజనాలే ముఖ్యమైపోయి కాలుష్యం పెరిగింది. ఇందులోనూ ఆర్థిక అంశమే కీలకము. ఎందుకంటే రాజకీ యమూ వ్యాపారమయమై పోయింది. ఏది ఏమైనా వాతావరణ కాలుష్యం ఎంతహాని చేస్తుందో ఆధ్యాత్మిక రాజకీయ కాలుష్యాలూ అంతే హాని చేస్తున్నవని అవి మన ఆరోగ్యానికీ, ఆలోచనకు ప్రమాదకరంగా మారాయని గుర్తెరగాలి. అందుకే, ‘మీ ఆరోగ్యం మెరుగు పడాలంటే, చక్కెర, మతం… ఈ రెండింటినీ బాగా తగ్గించండి. రెండూ ఎక్కువగా ప్రాసెస్ చేసినవి. పైగా వ్యసనాలు’ అని నటి తారాదేశ్‌పాండే హెచ్చరించింది. అందుకని ప్రజలంతా ఈ కాలుష్యాల పట్ల అప్రమత్తమవ్వాలి.