– సీఐటీయూ వినతిపై స్పందించిన భట్టి
– స్కీం వర్కర్లకు ప్రతినెలా జీతాలు చెల్లిస్తామని హామీ : మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి
నవతెలంగాణ-భద్రాచలం రూరల్
భద్రాచలం ఐటీడీఏ పాలకమండలి సమావేశానికి విచ్చేసిన ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకి సీఐటీయూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇచ్చిన వినతి పత్రం పట్ల స్పందించారు. సీఐటీయూ కోరిన డిమాండ్‌లలో ప్రధానమైన అంశం అంగన్వాడీ, తదితర స్కీమ్ వర్కర్లకు ప్రతినెలా 1వతేదీన జీతాలు చెల్లించే విధంగా చర్యలు చేపడతామని భట్టి హామీ ఇచ్చారు. అలాగే, బిల్లులను ఎప్పటికప్పుడు చెల్లిస్తామని తెలిపారు. గత పదేండ్లుగా రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు అందటం లేదని, ఇందిరమ్మ రాజ్యం ఏర్పడ్డాక గతంలో హామీ ఇచ్చిన విధంగా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని,కార్యచరణను రూపొందిస్తున్నామని స్పష్టం చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళా సాధికారికతకై మొదటి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.