– ఆతిథ్య అవకాశం కోల్పోయిన హైదరాబాద్
నవతెలంగాణ-హైదరాబాద్
ఫార్మాలా వన్ రేసు కిక్కును తెలుగు రేసింగ్ ప్రియులకు అందించిన హైదరాబాద్ ఈ ప్రీ.. మళ్లీ హైదరాబాద్‌కు తిరిగి రావటం లేదు!. 2024 ఫార్ములా-ఈ రేసు షెడ్యూల్ విడుదలైనా.. అందులో హైదరాబాద్ ఈ ప్రీకి చోటు దక్కలేదు. హైదరాబాద్ ఈ రేసు కమర్షియల్‌గా కాసుల వర్షం కురిపించినా.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగాల్సిన రేసు కష్టమేనని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. బెర్లిన్ వరుసగా పదో సీజన్‌లో ఈ రేసుకు ఆతిథ్యం ఇవ్వనుండగా.. ఫిబ్రవరి 10, 24న జరగాల్సిన రేసులపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఫార్ములా ఈ వర్గాలు తెలిపాయి.
అందుకు చాలా కారణాలు!
ప్రపంచవ్యాప్తంగా పది విశ్వ నగరాల్లో ఫార్ములా ఈ రేసు నిర్వహిస్తున్నారు. ఓవరాల్‌గా 17 రేసులు ఉంటాయి. రానున్న అక్టోబర్ 23-27న టెస్టు రన్‌తో మొదలు కానున్న ఫార్ములా-ఈ రేసు.. జనవరి 13న మెక్సికో సిటీలో తొలి రేసుతో షురూ కానుంది. సౌదీ అరేబియా జనవరి 26, 27న ఈ రేసుకు ఆతిథ్యం ఇవ్వనుండగా.. మూడో రేసుకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వాలి. కానీ తాజాగా ప్రకటించిన షెడ్యూల్‌లో హైదరాబాద్ ఈ ప్రీకి చోటు దక్కలేదు. ‘ 2024 ఫార్ములా-ఈ రేసు హైదరాబాద్‌కు రావటం లేదు. ప్రస్తుతానికి, హైదరాబాద్‌లో రేసు లేదని చెప్పవచ్చు. ఈ ఏడాది భారత్‌లో ఫార్ములా-ఈ రేసు జరిగే అవకాశాలు అత్యంత స్వల్పం. హైదరాబాద్ రేసుకు షెడ్యూల్ చోటు దక్కపోవడానికి పలు కారణాలు ఉన్నాయి. ప్రత్యేకించి ఓ కారణం చూపలేం. ట్రాక్ పరంగా ఎటువంటి లోపాలు లేవు. హైదరాబాద్ స్ట్రీట్ సర్క్యూట్ ట్రాక్ అంతర్జాతీయ ప్రమాణాలను అందుకుంది. కానీ ఫార్ములా-ఈ వంటి మెగా ఈవెంట్ నిర్వహణకు ఎంతో అనుభవం, నిపుణత అవసరం. త్వరలోనే హైదరాబాద్ తిరిగి ఆతిథ్య హక్కులు దక్కించుకుంటుందని ఆశిస్తున్నాను. తొలి రేసును హైదరాబాద్ గొప్పగా నిర్వహించింది. కానీ నిలకడగా ప్రపంచ స్థాయి రేసులు నిర్వహించటం అతి పెద్ద సవాల్’ అని భారత మోటార్ స్పోర్ట్స్ క్లబ్స్ సమాఖ్య (ఎఫ్‌ఎంఎస్‌సీఐ) ప్రతినిధి ఒకరు తెలిపారు.
హైదరాబాద్ స్ట్రీట్ సర్కూట్ రేసు గొప్ప విజయం సాధించింది. కమర్షియల్‌గా నిర్వాహకులకు లాభాల పంట పండించింది. హైదరాబాద్ ట్రాక్‌పై అత్యుత్తమ టైమింగ్ సైతం నమోదైంది. కానీ నిర్వహణ పరంగా పలు లోపాలు సుస్పష్టం. తొలి రోజు రేసు ముంగిట.. రేసింగ్ ట్రాక్‌పైకి సాధారణ వాహనాలు అనూహ్యంగా దూసుకొచ్చాయి. దీంతో ప్రాక్టీస్ రేసు ఓ గంట ఆలస్యమైంది. ప్రేక్షకులకు పార్కింగ్, ట్రాఫిక్ నిర్వహణలో పలు సమస్యలను పట్టించుకోలేదు. అంతర్జాతీయ ఈవెంట్లలో అభిమానులకు అందించే సౌకర్యాలు, సదుపాయాలకు పెద్ద పీట వేస్తారు. కానీ హైదరాబాద్ ఈ రేసులో అది లోపించింది. ఇదిలా ఉండగా, ఈ ఏడాది సైతం ఫార్ములా-ఈ రేసుకు హైదరాబాద్ ఆతిథ్యం వహిస్తుందనే ఆశాభావం రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సీఎస్ అరవింద్ కుమార్ అన్నారు. ‘ రానున్న అక్టోబర్‌లో అంతర్జాతీయ ఆటోమోబైల్ సమాఖ్య (ఎఫ్‌ఐఏ) సమావేశం కానుంది. ఆ సమావేశంలో హైదరాబాద్ ఈ రేసుపై సరైన నిర్ణయం తీసుకుంటారని’ అరవింద్ కుమార్ అన్నారు.