– రూ.30 కోట్ల పెట్టుబడులు
– ఎంటిఆర్ సిఇఒ సంజరు బాసిన్ వెల్లడి
నవతెలంగాణ- హైదరాబాద్
గడిచిన మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రూ.100 కోట్ల పెట్టుబడుల వ్యయం చేశామని ప్రముఖ మాసాల ఉత్పత్తుల కంపెనీ ఎంటిఆర్ తెలిపింది. గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంటిఆర్ సిఇఒ సునరు బాసిన్ మాట్లాడుతూ.. తమ సంస్థ 100 ఏళ్ల వార్షికోత్సవం జరుపుకుంటుందని అన్నారు. గుంటూరులోని తమ ప్లాంట్‌లో ప్రస్తుతం మిర్చీ ఉత్పత్తులను తయారు చేస్తున్నామన్నారు. ఇకపై మసాల ఉత్పత్తుల తయారీని కూడా చేపట్టనున్నామన్నారు. ఇందుకోసం రూ.30 కోట్ల పెట్టుబడి వ్యయం చేయనున్నామన్నారు. తమ పోర్టుపోలియో లో 145 ఉత్పత్తులు ఉన్నాయని.. మరికొన్నిటినీ జోడించనున్నామని తెలిపారు. తమ మాతృసంస్థ ఓర్‌క్లా 42 దేశాల్లో కార్యకలాపాలు కలిగి ఉందని.. 11 ఫ్యాక్టరీలు, 3వేల పైగా ఉద్యోగులను కలిగి ఉందన్నారు. ఓర్‌క్లా కింద ఎంటిఆర్, ఈస్టర్న్, ఇంటర్నేషనల్ బిజినెస్ యూనిట్లలో 12 పోర్టుపోలియే కంపెనీలను కలిగి ఉందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో 1.5 లక్షల అవుట్‌లెట్లలో తమ ఎంటిఆర్ ఉత్పత్తులు లభ్యమవుతాయన్నారు. ప్రతీ 5వేల జనాభా పైబడిన గ్రామాల్లో విస్తరణపై దృష్టి కేంద్రీకరిస్తున్నామన్నారు.