నవతెలంగాణ – భీంగల్
గురుకుల విద్యాసంస్థల్లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలతో అప్రమత్తమైన సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి నైట్ డ్యూటీ ఉపాధ్యాయుల సంఖ్యను రెండు నుండి నాలుగుకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసి ఉపాధ్యాయులు వంతుల వారీగా రాత్రి కాపలా కాయాలని ఉత్తర్వుల్లో పేర్కొనటాన్ని టిఎస్ యుటిఎఫ్ తీవ్రంగా ఖండిస్తున్నట్లు యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి మల్కా జనార్ధన్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గురుకుల ఉపాధ్యాయులను రాత్రి కాపలాదారు స్థాయికి దిగజార్చడం తీవ్ర అభ్యంతరకరమన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలకు వారిపై పెరిగిన మానసిక వత్తిడి కారణమని ఆ అంశాన్ని పరిగణనలోకి తీసుకోకుండా వింతైన ఉత్తర్వులు ఇవ్వటం సమంజసం కాదన్నారు. ఇంటర్, పదవ తరగతిలో ఉత్తమమైన ఫలితాల పేరిట విద్యార్థులను కార్పొరేట్ విద్యాసంస్థల తరహాలో వత్తిడికి గురిచేస్తూ మానసిక ప్రశాంతత లేకుండా చేస్తున్న కారణంగానే కార్పొరేట్ విద్యా సంస్థలకు పరిమితమైన ఆత్మహత్యలు గురుకుల విద్యాసంస్థ లో కూడా జరుగుతున్నాయన్నారు. వీటికి కారణాలను అధ్యయనం చేసి, నివారణ కోసం శాస్త్రీయమైన చర్యలు చేపట్టటానికి మానసిక నిపుణులతో కూడిన అధ్యయన కమిటీని నియమించాలని టిఎస్ యుటిఎఫ్ డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. అత్యధిక గురుకుల పాఠశాలలు అద్దె భవనాల్లో నిర్వహిస్తూ విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించటంలో వైఫల్యం ఉందన్నారు. మెస్ చార్జీలు పెంచుతామని చెప్పి రెండేళ్ళు గడిచినా జిఒ ఇవ్వలేదు.ఎండలను తట్టుకోవడానికి విద్యార్థులకు పుచ్చకాయలు, చల్లని మజ్జిగ, చల్లని నీరు, అందుబాటులో ఉండాలని ఆదేశించారు కానీ అదనపు బడ్జెట్ ఇవ్వకుండా ఎలా సాధ్యమవుతుందన్నారు. ఉపాధ్యాయులపై ఇప్పటికే బోధనేతర పనుల భారం అధికంగా ఉంది. ఇప్పుడు రాత్రి డ్యూటీలో ఉండే ఉపాధ్యాయుల సంఖ్యను పెంచడం ద్వారా వారిపై వత్తిడి మరింత పెరుగుతుందని. కనుక ఉపాధ్యాయులను నైట్ వాచ్ మన్ లు గా మార్చకుండా. విద్యార్థులపై మానసిక వత్తిడిని తగ్గించి ఆహ్లాదకర వాతావరణంలో చదువుకునే విధంగా ప్రోత్సహించాలని జనార్దన్ కోరారు.