నోటిఫికేషన్లు ఏవీ?

– సర్కారుకు బండి సంజయ్ ప్రశ్న
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి 1వ తేదీ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ఆ ఊసే ఎత్తట్లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. శనివారంనాడిక్కడి పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డీఎస్పీలు, డిప్యూటీ కలెక్టర్లు సహా 24 రకాల డిపార్ట్‌మెంట్‌ ఆఫీసర్లతో కూడిన గ్రూప్‌-2 నోటిఫికేషన్లను ఏప్రిల్‌ 1న ఇస్తామన్నారని గుర్తుచేశారు. ఫిబ్రవరి 3వ తేదీ వచ్చినా గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ పత్తాలేదనీ, నిరుద్యోగుల్ని అబద్ధాలతో నమ్మించి ఓట్లు వేయించుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ మ్యానిఫెస్టోపై ఇప్పుడు ఆపార్టీ నేతలు ఎవరూ ఎందుకు మాట్లాడట్లేదని ప్రశ్నించారు. యాసంగి నుంచి ఎకరానికి రూ. 15వేలు రైతు బంధు ఇస్తామన్నారనీ, అదీ అమల్లోకి రాలేదన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుల్ని, ప్రజల్ని నట్టేటముంచితే, మీరేం చేస్తున్నారని కాంగ్రెస్‌ నాయకత్వాన్ని ప్రశ్నించారు. ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయ మార్గాలను చూపించాల్సిన బాధ్యత కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఉందన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో విజయం కోసం బీజేపీ కార్యకర్తలు ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు ప్రతి గ్రామంలో 24 గంటలూ ప్రజలతో మమేకమై ఉంటారనీ, కొత్తగా ఓటర్లుగా నమోదైన వారితో నూతన ఓటర్ల సంపర్క్‌ అభియాన్‌ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.