భావ ప్రకటనా స్వేచ్ఛను ఎవ్వరూ నాశనం చేయలేరు

భావ ప్రకటనా స్వేచ్ఛను
ఎవ్వరూ నాశనం చేయలేరు– మనిషి నియంత్రించడం సాధ్యమయ్యేది కాదు : రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ కాత్యాయని విద్మహే
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
భావ ప్రకటనా స్వేచ్ఛను ఎవ్వరూ నాశనం చేయలేరని కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ కాత్యాయని విద్మహే అన్నారు. సమూహ సభపై వరంగల్‌లో దాడి నేపథ్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ‘భావ ప్రకటనా స్వేచ్ఛను బతకనివ్వరా?’ అనే అంశంపై ఫేస్‌ బుక్‌ లైవ్‌ వెబినార్‌ను నిర్వహించారు. ఈ వెబినార్‌ను ఎస్వీకే మేనేజింగ్‌ కమిటీ కార్యదర్శి ఎస్‌.వినయకుమార్‌ సమన్వయం చేశారు. ఈ సందర్భంగా కాత్యాయని మాట్లాడుతూ మనిషిని నియంత్రించడం సాధ్యమయ్యే పనే కాదని స్పష్టం చేశారు. భావ వ్యక్తీకరణ లక్షణమే మనిషిని ప్రపంచంలోని ఇతర జీవుల నుంచి వేరుగా చూపిస్తున్నదని తెలిపారు. దాంతోనే వికాసం, అభివృద్ధి ముడిపడి ఉన్నాయని గుర్తుచేశారు. స్వేచ్ఛ కావాలనే ఆకాంక్ష ప్రతి మనిషికి ఉంటుందన్నారు. శూద్రులు, దళితులు, మహిళలు స్వేచ్ఛను కోల్పోయారని గుర్తుచేశారు. అయితే అలా కోల్పోవడాన్నే వారు తమ సహజ లక్షణంగా భావించారనీ, వారిలోనూ చైతన్యవంతులైన వారు స్వేచ్ఛను కోరుకున్నారని తెలిపారు.
ఫ్రెంచ్‌ విప్లవం తర్వాత చేసిన మానవ హక్కుల ప్రకటనలో స్వేచ్ఛ ప్రధాన అంశమైందని కాత్యాయని ఈ సందర్భంగా తెలిపారు. ఐక్యరాజ్య సమితి 1940లో ప్రకటించిన మానవ హక్కుల్లోనూ స్వేచ్ఛకు స్థానం లభించిందన్నారు. మొత్తం స్వేచ్ఛలో భావ ప్రకటనా స్వేచ్ఛ ఒక భాగమని వివరించారు. భావాల వినిమయం నాగరిక ప్రపంచ ఆవిర్భావానికి, సామూహిక సృజనశీలతకు దోహదం చేసిందని తెలిపారు. భారత రాజ్యాంగం స్వేచ్ఛను ఒక హక్కుగా ఇచ్చిందని చెప్పారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు భావ ప్రకటనా స్వేచ్ఛ చాలా అవసరమని అభిప్రాయపడ్డారు. దేశంలో భిన్నత్వాలకు అనుగుణంగా పలు భిన్నమైన అభిప్రాయాల వ్యక్తీకరణ అనివార్యంగా వస్తోందని చెప్పారు. ‘ ఎవరి రంగంలో వారు తమ తమ భావాలను ప్రకటిస్తూనే ఉంటారు. పడిన ప్రతి మనిషి మళ్లీ లేస్తాడు. సంభాషణ లేకుండా సాహిత్యం, వికాసం, అభివృద్ధి ఉండవు …’ అని ఆమె తేల్చి చెప్పారు. ఆధునిక కాలంలోనూ, అంతకు ముందు భావ ప్రకటనా స్వేచ్ఛ పరిణామక్రమాన్ని వివరించారు. చరిత్రలో భావ ప్రకటనా స్వేచ్ఛ అందించిన ఫలాలను గుర్తుచేసుకుంటూ ముందుకెళ్లాలని సూచించారు. ప్రస్తుతం తెలుగు సాహిత్యంలో అందరూ సమానత్వం, సామాజిక న్యాయం కావాలనే భావాలను వ్యక్తం చేస్తున్నారని కాత్యాయని తెలిపారు.
బుద్ధుని కంటే ముందు వైదిక సాహిత్యం మౌఖికంగా ఉండేదని చెప్పారు. సామాజిక మాధ్యమాలు… భావ ప్రకటన కన్నా దాన్ని అడ్డుకునేందుకే ఎక్కువగా ఉపయోగ పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.