– ట్రస్మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ కోడి శ్రీనివాసులు
నవతెలంగాణ – చండూరు
లక్ష్యసాధనకు పట్టుదల తోడైతే, విజయాన్ని ఎవరు ఆపలేరని గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్, ట్రస్మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ కోడి శ్రీనివాసులు అన్నారు. గురువారం మండలం లోని బంగారుగడ్డ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ చైర్మన్, ట్రస్మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ కోడి శ్రీనివాసులు, అరుణ దంపతులు స్టడీ మెటీరియల్ ను ఉచితంగా అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ విద్యార్థులందరూ ఈ మెటీరియల్ ను ఉపయోగించుకొని క్రమశిక్షణ, పట్టుదలతో ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను మంచిగా చదివి, మార్చిలో జరగబోయే పరీక్షలను రాసి మంచి మార్కులు సాధించి మీ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, మీరు చదివిన పాఠశాలకు మంచి పేరు తెచ్చి, ఉన్నత శిఖరాలను చేరుకోవాలని అన్నారు. విద్యార్థులు ఎవరు కూడా ఇంటి వద్ద సెల్ ఫోన్లు వాడరాదని తెలిపారు. ప్రధానోపాధ్యాయులు సి.హెచ్. రామలింగయ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థులు చదువుకుంటారని, ఇటువంటి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ను ఉచితంగా అందించడం గర్వించదగిన విషయమని గాంధీజీ ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు నరసింహాచారి, టి. వెంకటేశ్వర్లు, బాబమ్మ, తులసి, యశోద, శోభారాణి మరియు విద్యార్థులు పాల్గొన్నారు.