– మరింత ఎరుపెక్కుతుంది
– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
– పార్టీ కార్యకర్త నాగేశ్వరరావుకు నివాళి ఫకుటుంబానికి అండగా ఉంటాం
నవతెలంగాణ – బోనకల్
ఎర్రజెండాను అణచివేసే దమ్ము ఎవరికీ లేదని, ఒకవేళ ఆ విధంగా చేయాలనుకుంటే ఎర్రజెండా మరింత ఎరుపు ఎక్కుతుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం గోవిందాపురం గ్రామంలో ఈనెల 26న కాంగ్రెస్ సర్పంచ్ ఉమ్మనేని బాబు, ఆయన కుమారుడు ఉమ్మనేని రమేష్‌తోపాటు మరి కొందరు కలిసి కనకదుర్గమ్మ ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా.. మంచినీటి క్యాన్‌తో ఇంటికి పోతున్న సీపీఐ(ఎం) కార్యకర్త ఎర్రబోయిన నాగేశ్వరరావుపై గొడ్డళ్లు, గడ్డపారలతో కాంగ్రెస్ గూండాలు దాడి చేశారు. గాయపడిన అతన్ని సీపీఐ(ఎం) నాయకులు ఖమ్మంలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించగా శనివారం ఉదయం మృతిచెందారు.
శనివారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించారు. తమ్మినేని వీరభద్రం, పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, పాలడుగు భాస్కర్, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు హాజరై మృతదేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జరిగిన సంతాప సభలో తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. నాగేశ్వరరావు హత్యను తీవ్రంగా ఖండించారు.
అరాచక వాదులు..
మూర్ఖులు, అరాచక వాదులకు సర్పంచి పదవి కట్టబెడితే అభివృద్ధిని మరిచి అరాచకాలకు, దాడులకు పాల్పడ తారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శనరావు, పాలడుగు భాస్కర్ అన్నారు. సర్పంచ్ ఉమ్మనేని బాబు, అతని కుమారుడు ఉమ్మనేని రమేష్ రౌడీ షీటర్ అని, వారికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. నాగేశ్వరరావును హత్య చేయటంపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మల్లు నందిని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇసుక అక్రమ వ్యాపారం, గ్రామపంచాయతీ నిధులలో అవినీతి అక్రమాలు, దొంగతనంగా పశువులు అమ్ముకునే తండ్రీకొడుకులను కాంగ్రెస్ నాయకులు ఎందుకు ప్రోత్సహి స్తున్నారో సమాధానం చెప్పి తీరాలని డిమాండ్ చేశారు. గ్రామాన్ని అశాంతి నిలయంగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. చివర వరకు నాగేశ్వరరావుని బతికించేందుకు అనేక ప్రయత్నాలు చేశామని, కానీ ఫలితం లేకపోయిందని విచారం వ్యక్తం చేశారు. నాగేశ్వర రావు ఆశయ సాధనకు సీపీఐ(ఎం) నిరంతరం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని చెప్పారు.3