– సీబీఐ అధికారుల విస్మయం
– సెమినార్ హాల్‌కు విరిగిన డోర్ బోల్ట్‌పై పరిశీలన
– ఆ నలుగురికీ పాలిగ్రాఫ్ ?
కోల్‌కతా : అమానుష ఘటన జరిగిన ఆర్‌జికార్ ఆస్పత్రిలోని సెమినార్ హాల్‌లో ఎలాంటి అంతరాయం, అడ్డంకులు లేకుండా నేరం ఎలా జరిగిందనే విషయమై సిబిఐ ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. సెమినార్ హాల్ తలుపునకు బోల్ట్ విరిగి వుండడాన్ని గమనించింది. దీనిపై విద్యార్ధులను ప్రశ్నించగా, కొంతకాలంగా బోల్ట్ పనిచేయడం లేదని, దానిపై ఇంతకుముందు కూడా అధికారులకు ఫిర్యాదులు చేసినట్లు వారు తెలిపారు. తలుపునకు బోల్ట్ లేనపుడు లోపల బాధితురాలు చేసిన ఆక్రందనలు ఎవరికీ వినిపించలేదా అని అధికారులు ఆశ్చర్యపోతున్నారు. పైగా ఎవరూ లోపలకు రాకుండా బయట ఎవరినైనా కాపలాగా పెట్టి వుంటారా అనే కోణంలో కూడా పరిశీలిస్తున్నారు. దీన్ని నిర్ధారించుకునేందుకు వారు సిసి టివి ఫుటేజీని సమీక్షిస్తున్నారు. 9వ తేదీ రాత్రి 2 నుండి 3గంటల మధ్యలో బాధితురాలు సెమినార్ హాల్లోకి ప్రవేశించిందని ప్రాధమిక పరిశీలనలో వెల్లడైంది. సెమినార్ హాల్లో ఆమె పడుకుని వుండగా చూసినట్లు డ్యూటీలో డాక్టరు కూడా తెలిపారు. ఆ రాత్రి హాల్లో పడుకున్నా ఆమె తలుపు వేసుకోకపోవడానికి కారణం బోల్ట్ విరిగి వుండడమేనని, ఇది అందరికీ తెలిసిన విషయమేనని అక్కడి డాక్టర్లు, ఇంటర్న్‌లు, జూనియర్ డాక్టర్లు తెలిపారని సిబిఐ అధికారులు చెప్పారు. బాధితురాలితో కలిసి ముందు రోజు రాత్రి డిన్నర్ చేసిన ముగ్గురు జూనియర్ డాక్టర్లు, ఒక ఇంటర్న్‌కు కూడా పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ నేరంలో వారి పాత్ర వుందా? లేదా? అనేది నిర్ధారించుకోవడానికి ఈ చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.