కాంగ్రెస్‌ పాలనలో ఎవరూ సంతోషంగా లేరు

– మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌ విమర్శ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలోని హాస్టళ్లు, యూనివర్సిటీలు, గురుకులాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయనీ, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు సహా ఎవరూ కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలో సంతోషంగా లేరని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. మంగళవారంనాడిక్కడి తెలంగాణ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వంపై పోరాడేందుకు కార్యాచరణ ప్రకటించబోతున్నారని చెప్పారు. గతంలో పాడి పంటలు అనేవారనీ ఇప్పుడు పాడి, పంట వేర్వేరు అయ్యాయనీ, దీనివల్ల రైతులకు అనేక ఆర్థిక కష్టాలు ఏర్పడుతున్నాయని తెలిపారు. ప్రతిరోజూ హైదరాబాద్‌లో 30 లక్షల లీటర్ల పాలు వినియోగిస్తారని చెప్పారు. ఐదు లక్షల లీటర్లు తెలంగాణ నుంచి వస్తాయనీ, వాటికి కూడా డబ్బులు చెల్లించట్లేదన్నారు. ప్రజలకు అవసరమైన మిగిలిన 25 లక్షల లీటర్ల పాలు ఎక్కడ్నుంచి వస్తున్నాయని ప్రశ్నించారు. తెలంగాణ డైరీని బొంద పెట్టి ఆంధ్రా డైరీలను పెంచి పోషించే కుట్ర జరుగుతుందనే అనుమానాలు ఉన్నాయన్నారు. విజయ డైరీలో రూ.500 కోట్ల మేర పాల ఉత్పత్తులు నిల్వ ఉన్నాయనీ, వాటిని కనీసం యాదాద్రి లేదా తిరుమల వెంకటేశ్వర స్వామి గుడికో విక్రయిస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. గడువు దాటిపోతే ఆ రూ.500 కోట్లు వృధా అవుతాయని చెప్పారు.