మత్తు పదార్థాల పట్ల ఎవరూ బానిసలు కావద్దు జిల్లా కలెక్టర్

నవతెలంగాణ- తాడ్వాయి 
మత్తు పదార్థాల పట్ల ఎవరు బానిసలు కాకుండా అవగాహన కల్పించడంతో పాటు వాటిని సమూలంగా అరికట్టడం  ప్రతి ఒక్కరి బాధ్యతని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు.  గురువారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తో కలిసి  జిల్లా  స్థాయి లో ఏర్పాటు చేసిన  నార్కో సమన్వయ కమిటీ  (NCORD)   మూడవ  సమావేశంలో  మాట్లాడుతూ  ఆబ్కారీ,  పొలిసు, రవాణా, అటవీ, వ్యవసాయ, విద్య, వైద్య, మహిళా సంక్షేమం తదితర శాఖలు సమన్వయంతో పనిచేస్తూ జిల్లాలో మత్తుపదార్థాల విక్రయం, అక్రమంగా గంజాయి సాగుచేస్తున్న పంటలను గుర్తించి కేసులు నమోదు చేసి న్యాయ స్థానం ముందు నిలబెట్టాలని అన్నారు.  అక్రమ మాదకద్రవ్యాల రవాణా, విక్రయంపై ఏమైనా సమాచారం తెలిస్తే వెంటనే కమిటీ దృష్టికి తెస్తే నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు. పారిశ్రామిక ప్రాంతాల చుట్టు  ప్రక్కల, పాఠశాల, కళాశాల పరిసర ప్రాంతాలలో మత్తుపదార్థాల విక్రయం జరిగే అవకాశాలుంటాయని, ఆ ప్రాంతాలలో ప్రత్యేక నిఘా పెట్టి తనిఖీ చేయాలని సూచించారు.   వీధి బాలలు, పాఠశాల, కళాశాల విద్యార్థులు మత్తుపదార్థాలకు బానిసలు కాకుండా అటు తల్లిదండ్రులతో పాటు, ఉపాధ్యాయులు వారి నడవడిక, ప్రవర్తనను గమనిస్తుండాలన్నారు. ప్రారంభ దశలోనే గుర్తిస్తే  సైక్రియాటిస్టు ద్వారా తగు కౌన్సిలింగ్ ఇచ్చివారిలో పరివర్తన తేగలమన్నారు. జిల్లాలోని   ప్రతి పాఠశాల, కళాశాలలో వివిధ కార్యక్రమాలతో పాటు మత్తుపదార్థాల పట్ల విద్యార్థులకు అవగాహన కలిగించుటకు  కార్యక్రమాలు నిర్వహించాలని డీఈఓ,ఇంటర్మీడియేట్ అధికారులకు  సూచించారు.  ప్రిస్క్రిప్షన్ లేకుండా   మెడికల్ షాపులలో డ్రగ్స్ అమ్మకుండా చూడాలని  డ్రగ్స్ ఇన్స్పెక్టర్  కు సూచించారు.  మత్తు పదార్థాలకు బానిసలైన వారికి కంటి పరీక్షలు నిర్వహించి, ఆ వ్యసనం నుండి బయటికి వచ్చేలా చికిత్స అందించాలని వైద్యాధికారికి  సూచించారు. మత్తు పదారాలకు బానిసలైన వారిని గుర్తించి పునరావాస కేంద్రంలో వసతి కల్పిస్తూ వారిలో మార్పు తెచ్చుటకు కృషిచేయాలని మహిళా శిశు సంక్షేమాధికారికి  సూచించారు . పరిశ్రమలలో పనిచేసే   కార్మికులు మత్తుపదార్థాలకు అలవాటుపడతారని, అటువంటి అనుమానాస్పద కార్మికులు పరిశ్రమలో పనిచేస్తున్నారా అని  పారిశ్రామిక యాజమాన్యాలతో సమాచారం తీసుకొని కమిటీ దృష్టికి తేవాలని సూచించారు. సర్పంచు, పంచాయతి కార్యదర్శులను, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేస్తూ  క్షేత్ర స్థాయి నుండి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు.మంచి సమాజం నిర్మించడమే మన లక్ష్యమని అందుకు ప్రతి ఒక్కరు అంకిత  భావంతో పనిచేస్తూ సమాచారాన్ని చేరవేయాలని  కోరారు. ఈ సమావేశంలో ఆర్టీఓ వాణి ,డీఈఓ రాజు, వ్యవసాయాధికారి భాగ్యలక్ష్మి, వైద్య శాఖ డిపిఓ పద్మజ, ఫారెస్ట్ రేంజ్ అధికారి రమేష్, డిఎస్పీ శ్రీనివాసులు, సి.ఐ. లు, తదితరులు పాల్గొన్నారు