బైపాస్ రోడ్డు నిర్మాణం పై రాజకీయం వద్దు..

– బాధితులందరికీ న్యాయం చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు
– రెండు సంవత్సరాలు లోపు పట్టణంలో అన్ని అభివృద్ధి పనులు పూర్తి
– సెంట్రల్ లైటింగ్ ప్రారంభోత్సవంలో మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ-నల్గొండ కలెక్టరేట్ : నల్గొండ పట్టణంలో రూ. 700 కోట్లతో చేపట్టే బైపాస్ వలన ఎవరికి నష్టం జరగకుండా పరిహారం ఇచ్చే విధంగా అన్ని చర్యలు చేపట్టినట్లు నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.  శనివారం నల్గొండ పట్టణంలోని 5, 20, 21, 43వ వార్డులలో గొల్లగూడెం నుంచి పెద్ద బండ వరకు, కలెక్టరేట్ వద్ద టి యు ఎఫ్ ఐ డి సి  నిధులతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ ను మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లతో కలిసి ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్గొండ పట్టణంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో కోట్లాది రూపాయలతో వివిధ అభివృద్ధి పనులను చేపట్టినట్లు పేర్కొన్నారు. రెండు సంవత్సరాల లోపు నల్గొండ పట్టణంలో అన్ని వార్డులలో సీసీ రోడ్లు, డ్రైనేజీ, లో వోల్టేజీ , తాగునీటి సమస్యను పూర్తిగా పరిష్కరించడం జరుగుతుందని స్పష్టం చేశారు. పెండింగ్ లో ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ఇప్పటికే ప్రారంభించడం జరిగిందని తెలిపారు. బైపాస్ నిర్మాణంపై కొందరు రాజకీయం చేస్తున్నారని అన్నారు. బైపాస్ రోడ్డు నిర్మాణ వలన ఏ ఒక్కరికి నష్టం జరగకుండా మార్కెట్ రేటు ప్రకారం మంత్రి కోమటిరెడ్డి సహకారంతో వారికి నష్టపరిహారం అందజేయడం జరుగుతుందని తెలిపారు. నల్లగొండ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు పోవడం జరుగుతుందని అన్నారు.  ఈ కార్యక్రమంలో  మున్సిపల్ కమిషనర్  సయ్యద్ ముసబ్ అహ్మద్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, కౌన్సిలర్లు గోగుల శ్రీనివాస్, ఇబ్రహీం, ఖలీల్, సమద్, పున్న గణేష్, బాబా, భాస్కర్, బోగరి ఆనంద్, పప్పు సాయి, డిసిసిబి డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, అల్లి సుభాష్ యాదవ్, నల్లగొండ అశోక్, పున్న పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.