దత్తన్న బిడ్డకు దక్కని సీటు

No seat for an adopted child– పెండింగ్‌లోనే వేములవాడ, మునుగోడు సీట్లు
– బీజేపీ మూడో జాబితా విడుదల
– తీవ్ర అసంతృప్తిలో పలువురు నేతలు
– జనసేనకు టికెట్లివ్వొద్దని బీజేపీ శ్రేణుల ఆందోళన
– 9 టికెట్లు ఇచ్చేందుకు జాతీయ నాయత్వం ఓకే!
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
బీజేపీ 35 మందితో మూడో జాబితాను విడుదల చేసింది. మొదటి జాబితాలో 52 మంది, రెండో జాబితాలో ఒక అభ్యర్థిని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటిదాకా బీజేపీ 88 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఈటల రాజేందర్‌, మాజీ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు తమకు కావాలంటే తమకు కావాలని పట్టుబడుతున్న వేములవాడ సీటు విషయంలోనూ ఆ పార్టీ ఎటూ తేల్చులేక పక్కనపెట్టేసింది. తుల ఉమ కోసం ఈటల ఆ సీటును అడుగుతుండగా..తన కుమారుడికే దక్కించుకునేందుకు విద్యాసాగర్‌రావు జాతీయ స్థాయిలో ఫైరవీలు చేసుకుంటున్నారు. ముషీరాబాద్‌ నియోజకవర్గం నుంచి టికెట్‌ ఆశించిన హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మికి బీజేపీ అధిష్టానం మొండిచేయి చూపింది. అక్కడ పూసరాజుకు టికెట్‌ లభించింది. ఆ స్థానం నుంచి టికెట్‌ ఆశించిన విజయలక్ష్మితో పాటు మరికొందరు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సికింద్రాబాద్‌ సీటును మాజీ మేయర్‌ బండా కార్తీక రెడ్డికి కేటాయిస్తారని అందరూ ఆశించగా…అనూహ్యంగా మేకల సారంగపాణికి ఇచ్చింది. బీఆర్‌ఎస్‌ పార్టీని వీడి బీజేపీలో చేరిన ఢిల్లీ వసంత్‌కుమార్‌కు కూడా బీజేపీ మొండిచెయ్యే చూపింది. ఆ స్థానంలో కాంగ్రెస్‌ నేత దామోదర రాజనర్సింహ్మ తమ్ముడు రాజనర్సింహ్మ రామచందర్‌కు సీటిచ్చింది. అంబర్‌ పేట స్థానం నుంచి పోటీచేసేందుకు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్‌రెడ్డి అనాసక్తి చూపగా…ఆ సీటును మాజీ మంత్రి కృష్ణయాదవ్‌కు కట్టబెట్టింది. ఆయనకు సీటు దక్కకుండా పలువురు అడ్డుపుల్లలు వేసినా జాతీయ అధిష్టానం ఆయన వైపే మొగ్గుచూపింది. బీజేపీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న బాబుమోహన్‌ను సంతృప్తి పర్చడంలో భాగంగా ఆంధోల్‌ సీటును ఆయనకు కట్టబెట్టింది. ఇప్పటికైనా ఆయన శాంతించి ఆ పార్టీలో ఉంటారా? కాంగ్రెస్‌లోకి వెళ్తారా? అనేది చూడాలి. రాజేంద్రనగర్‌, చేవెళ్ల స్థానాలను పట్టుబట్టి మరీ తాను సూచించిన తోకల శ్రీనివాస్‌రెడ్డి, కె.ఎస్‌.రత్నంకు టికెట్లు ఇప్పించుకోవడంలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సక్సెస్‌ అయ్యారు. రాజేంద్రనగర్‌లో బీసీకి టికెట్‌ ఇవ్వాలని చివరి వరకూ వాదించిన ఎంపీ లక్ష్మణ్‌ చివరి నిమిషంలో కొండా పార్టీలో ఉండాలంటే వెనక్కి తగ్గాలనే అధిష్టానం సూచనతో దాన్ని వదిలేశారని తెలిసింది. ఓ బీసీ సంఘం నేతపై ఆశలు పెట్టుకుని మునుగోడు సీటునూ పెండింగ్‌లో పెట్టింది. ఎల్‌బీనగర్‌, సికింద్రాబాద్‌, ఉప్పల్‌, ముషీరాబాద్‌, అంబర్‌పేట నియోజకవర్గాల్లో టికెట్లు ఆశించి భంగపాటుకు గురైన నేతలు తీవ్ర నైరాశ్యంలోకి కూరుకుపో యారు. పలువురు కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది.
జనంలేని జనసేనకు టికెట్లు ఇవ్వొద్దు
తెలంగాణలో జనంలేని జనసేన పార్టీకి టికెట్లు ఇవ్వొద్దని బీజేపీ శ్రేణులు రాష్ట్ర కార్యాలయం ఎదుట గురువారం ఆందోళనకు దిగారు. నాగర్‌కర్నూల్‌ సీటును జనసేనకు కేటాయిస్తున్నారనే ప్రచారంతో ఆ నియోజకవర్గానికి చెందిన బీజేపీ నేత దిలీపాచారి తన అనుచరులతో వచ్చి బీజేపీ రాష్ట్ర కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద ఆందోళనకు దిగారు. జనసేన పార్టీ తెలంగాణలో అసలు లేనేలేదనీ, ఆ పార్టీకి సీట్లు ఎలా ఇస్తారని రాష్ట్ర నాయకత్వాన్ని దిలీపాచారి ప్రశ్నించారు. నిన్నామొన్న శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి నియోజకవర్గానికి చెందిన బీజేపీ నేతలు కూడా ఇదే విషయంపై రాష్ట్ర కార్యాలయం వద్ద ఆందోళన చేసిన విషయం విదితమే. అయినా, బీజేపీ జాతీయ నాయకత్వం 9 సీట్లు ఇచ్చేందుకు అంగీకారం తెలిపినట్టు తెలిసింది. శేరిలింగంపల్లి సీటును రవియాదవ్‌కు ఇవ్వాలని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పట్టుబడుతున్నట్టు సమాచారం.
హైదరాబాద్‌లో బీజేపికి బిగ్‌ షాక్‌
ఖైరతాబాద్‌ నియోజకవర్గానికి చెందిన సీనియర్‌ నేత పల్లపు గోవర్ధన్‌ ఆ పార్టీకి రాజీనామా చేశారు. కేటీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఖైరతాబాద్‌ టికెట్‌ను ఆయన ఆశించి భంగపడ్డారు. ‘నాది ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీతో 22 ఏండ్ల అనుబంధం. పార్టీ నాయకుల తీరు నచ్చక వీడుతున్నా. ఎన్నికల్లో నాలుగైదు సీట్లు గెలిచేందుకే బీసి ముఖ్యమంత్రి నినాదంతో బలహీన వర్గాలను పార్టీ నాయకత్వం మోసం చేస్తున్నది.పార్టీకోసం సర్వం ధారపోసిన వారికి, బీసిలకు కనీస గౌరవం కూడా లేదు. ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టి ఇక బిజేపిలో ఉండడం ఆత్మహత్యతో సమానం. అగ్రకులాల చేతిలో బీజేపి బందీ అయ్యింది’ అంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేస్తూ లేఖ విడుదల చేశారు.