– ఎన్సీటీఈ స్పష్టీకరణ : ఎమ్మెల్సీ నర్సిరెడ్డికి ఉత్తర్వుల కాపీని అందించిన సభ్య కార్యదర్శి
నవతెలంగాణ బ్యూరో – న్యూఢిల్లీ / హైదరాబాద్
ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల పదోన్నతికి ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఉత్తీర్ణత నిబంధన వర్తించబోదని జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (ఎన్సీటీఈ) సభ్య కార్యదర్శి కెషాంగ్ వై శర్పా స్పష్టం చేశారు. శుక్రవారం ఢిల్లీలోని ఎన్సీటీఈ కార్యాలయంలో సభ్య కార్యదర్శి కెషాంగ్ వై శర్పా, ఇతర అధికారులతో ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, యూఎస్పీసీ, జాక్టో ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణలో టెట్ సంక్షోభం, రాత పరీక్ష కరిక్యులమ్, సిలబస్ మార్పు వంటి అంశాలపై గంటకుపైగా సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా పీఎస్, హైస్కూల్ ప్రధానోపాధ్యాయుల పదోన్నతికి టెట్ అవసరం లేదంటూ రాతపూర్వకంగా ఇచ్చిన వివరణ ఉత్తర్వుల కాపీని ఎమ్మెల్సీ నర్సిరెడ్డికి కెషాంగ్ వై శర్పా అందజేశారు. దీంతో ఉపాధ్యాయులకు కొంత ఉపశమనం కలిగింది. 2010, ఆగస్టు 23కి ముందే నియామకమైన ఉపాధ్యాయులు అదే స్థాయిలో పదోన్నతి పొందటానికి టెట్ అవసరం లేదంటూ యూఎస్పీసీ, జాక్టో నాయకులు ప్రస్తావించగా తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఆ విషయమై వివరణ అడగలేదని ఆమె సమాధానమిచ్చారు. శుక్రవారం జరిగిన చర్చ మేరకు త్వరలోనే వివరణ ఉత్తర్వులు ఇస్తామన్నారు. స్థాయి మారే సందర్భంలో కూడా టెట్‌కు మినహాయింపు ఇవ్వాలని కోరగా నిబంధనలు, కోర్టు ఆదేశాల ప్రకారం వీలుపడదన్నారు. ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ నిర్వహించాలని నాయకులు కోరగా సానుకూలంగా పరిశీలిస్తామన్నారు.టెట్ కరిక్యులమ్, సిలబస్ మార్చాలనీ, సబ్జెక్టు వెయిటేజ్ పెంచాలనీ, అర్హతా మార్కులను తగ్గించాలని నాయకులు కోరారు. టెట్‌పై సమీక్షా కమిటీ వేస్తున్నామనీ, ఈ ప్రాతినిధ్యంలోని అంశాలను కూడా కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కెషాంగ్ వై శర్పా అన్నారు. అన్ని విషయాలపై ఓపికగా చర్చించి, సందేహాలపై వివరణ ఇచ్చారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, యూఎస్పీసీ నాయకులు కె జంగయ్య, చావ రవి, వై అశోక్ కుమార్, పి నాగిరెడ్డి, టి లింగారెడ్డి, యు పోచయ్య, జాక్టో నాయకులు జి సదానందంగౌడ్, ఎం పర్వత్‌రెడ్డి, ఎం రాధాకృష్ణ, కె కృష్ణుడు, ఎన్సీటీఈ సదరన్ రీజియన్ సభ్యులు ప్రొఫెసర్ శంకర్, నేషనల్ మిషన్ ఫర్ మెంటరింగ్ (ఎన్ఎంఎం) కన్వీనర్ అభిమన్యు యాదవ్ తదితర అధికారులు పాల్గొన్నారు. అంతకు ముందు ఎన్సీటీఈ చైర్మెన్, ఢిల్లీ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ యోగేష్ సింగ్‌ను కలిసి టెట్ వివాదంపై ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, యూఎస్పీసీ, జాక్టో నాయకులు చర్చించారు.