ట్రెజరీ జీతాల్లేవు హెల్త్‌ కార్డులు రాలేదు

No treasury salaries Health cards did not come– హామీలిచ్చి మరిచిన బీఆర్‌ఎస్‌
– జీవో నెంబర్‌ 317 వర్తింపు ఎప్పటికో..
– పదోన్నతుల కోసం ఎదురుచూపులే
– వైద్య విధాన పరిషత్‌లోని ఉద్యోగుల దుస్థితి ఇది
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
హామీలిచ్చిన పార్టీ రెండు సార్లు అధికారంలోకి వచ్చింది. వాటిని ప్రభుత్వం అమలు చేస్తుందని ఉద్యోగులు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈలోగా పదేండ్లు గడిచిపోయాయి. ఈ లోపు పొరుగు రాష్ట్రం అదే పని చేస్తున్న వారి డిమాండ్లను పరిష్కరించింది. ఇక్కడి ఉద్యోగులు మాత్రం ఇప్పటికీ ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధుల చుట్టూ రాత్రింబవళ్లు తిరుగుతూనే ఉన్నారు. డాక్టర్లు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది… ఆ విభాగంలో పని చేస్తున్న వారందరి పరిస్థితి ఇదే. గతంలో ఎవరికి వారుగా కేడర్ల వారిగా డిమాండ్ల సాధన కోసం ప్రయత్నించినా వారంతా జేఏసీగా ఏర్పడి పోరాడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో టీఆర్‌ఎస్‌ (నేడు బీఆర్‌ఎస్‌) ఇచ్చిన హామీల అమలు కోసం తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లోని ఉద్యోగులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ట్రెజరీ జీతాలు రాక, హెల్త్‌ కార్డులు లేక, జీవో నెంబర్‌ 317 వర్తించక, సమయానికి పదోన్నతులు రాక ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. టీవీవీపీ కమిషనర్‌కు పదే పదే వినతిపత్రాలు సమర్పించడం, ఆ పత్రాలు స్వీకరించిన కమిషనర్‌, తాను ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపానని చెప్పడం పరిపాటిగా మారింది.
తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ పరిధిలో రాష్ట్రంలో దాదాపు 174 ఆస్పత్రులున్నాయి. ఈ విభాగంలో రెగ్యులర్‌ డాక్టర్లు, సిబ్బంది సుమారుగా ఐదు వేల మందికిపైగా పని చేస్తున్నారు. వీరితో పాటు మరో వెయ్యి మందికి పైగా వరకు కాంట్రాక్టు పద్ధతిలో, రెండు వేల మందికిపైగా పొరుగుసేవల ప్రాతిపదికన పని చేస్తున్నారు.
ఈ విభాగంలో పని చేస్తున్న వీరు ప్రభుత్వ ఉద్యోగులే అయినప్పటికీ 010 పద్దు ద్వారా ట్రెజరీ ద్వారా జీతాల్లేకపోవడంతో పాటు, వైద్యారోగ్యశాఖలో పని చేస్తున్నా… హెల్త్‌ కార్డులకు నోచుకోలేదు. దీంతో ఉద్యోగులు కానీ, వారి కుటుంబ సభ్యులు కాని అనారోగ్యం పాలై ప్రయివేటు, కార్పొరేటు ఆస్పత్రికెళితే లక్షలాది రూపాయలను వెచ్చించాల్సి వస్తుందని వాపోతున్నారు. గతంలో సాక్షాత్తు అధికార పార్టీ అనుబంధ మెడికల్‌ యూనియన్‌ నాయకుని తండ్రి విషయంలో జరిగిన విషయాన్ని ఆ నాయకుడే చెబుతూ ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
సమస్యకు పరిష్కారం లేదా?
ప్రత్యేక చట్టం ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సమయంలో వైద్యవిధాన పరిషత్‌ను ఏర్పాటు చేశారు. వైద్యారోగ్యశాఖలో మిగిలిన విభాగాల్లో పని చేసే ఉద్యోగులకు మాదిరిగా 010 పద్దు ద్వారా ట్రెజరీ జీతాలు, హెల్త్‌ కార్డులు వీరికి వర్తించడం లేదు.
2014కు ముందు తెలంగాణ ఉద్యమ సమయం నుంచే ఆ సౌకర్యాలను వర్తింపజేసేందుకు చర్యలు తీసుకుంటామని బీఆర్‌ఎస్‌ హామీ ఇచ్చింది. అయితే 2014 ఎన్నికల తర్వాత ఆ హామీని నెరవేర్చలేదు. రెండో సారి అధికారంలోకి వచ్చాక అయినా … తమ డిమాండ్లు పరిష్కరిస్తారని ఆశించిన ఉద్యోగులకు నిరాశే మిగిలింది. 1999 బ్యాచ్‌ కి చెందిన స్టాఫ్‌ నర్సులకు, ఇతర సిబ్బందికి పదోన్నతులు లేక జీవో 317 అమలు కాక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఈనెల 31 వరకే డీపీసీ( డిపార్ట్మెంటల్‌ ప్రమోషన్‌ కమిటీ) కాల పరిమితి ముగుస్తుందని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

వెంటనే పదోన్నతులు కల్పించాలి
ఉద్యోగులందరికి వెంటనే పదోన్నతులు కల్పించాలనీ, 317 జీవోను అమలు చేయాలని జేఏసీ కోర్‌ కమిటీ సభ్యులు బైరపాక శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. వివిధ జిల్లాల్లో పని చేస్తున్న జిల్లా క్యాడర్‌ పోస్టులకు పదోన్నతులు ఇచ్చి 37 జీవోను అమలు చేయాలని కోరారు. లేకపోతే పరిషత్‌లో పని చేస్తున్న ఉద్యోగులందరం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.