కులగణనపై అనవసర వాదనలు వద్దు

– ఏలేటికి మహేష్‌కుమార్‌గౌడ్‌ సూచన
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
కులగణనపై అనవసర వాదనలు తీసుకరావద్దని టీపీసీసీ అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్‌ బీజేపీపక్ష నేత మహేశ్వర్‌రెడ్డికి సూచించారు. రోజు రోజుకు ఏం మాట్లాడుతున్నారో మీకే అర్ధం కావడం లేదని ఎద్దేవా చేశారు. ఈమేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. బీసీ నేత బండి సంజరుకుమార్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటే ఆయన్ను పదవి నుంచి తొలగించారని విమర్శించారు. ఆ తర్వాత ఆ పదవిని అగ్రవర్ణాలకు కట్టబెట్టారని విమర్శించారు. పార్టీ అధ్యక్షులు, బీజేఎల్సీ నేత అగ్రవర్ణాల వారికే ఇచ్చారని తెలిపారు. రాహుల్‌ గాంధీది ఏ కులమని అడగటం కాదు…దమ్ము, ధైర్యం ఉంటే ఆ మాట మోడీని అడగాలని ఏలేటికి సవాల్‌ విసిరారు. 2025లో చేపట్టే జనగణనలో ఓబీసీ గణన అంశం కూడా చేర్చమని అడగాలని సూచించారు. అప్పుడు రాహుల్‌ గాంధీది ఏ కూలమో తెలుస్తుందని చెప్పారు. బలహీన వర్గాలకు న్యాయం చేయాలనే తపన రాహుల్‌గాంధీకి ఉందన్నారు. బీజేఎల్పీ పదవి ఎప్పుడు ఊడుతుందో తెలియక ఆయన తికమకగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా అందరూ ఒప్పుకునే నాయకుడు రాహుల్‌ గాంధీ అని గుర్తు చేశారు.