‘వద్దనండి, వద్దనండి, యుద్ధాలు వద్దనండి
శాంతి దూతలారా! దేశాధినేతలారా!
భావిభారతీయులారా! భారతమ్మ బిడ్డలారా!
వద్దనండి.!
దేవేంద్ర విరచిత గీతం సుమారు నలభై ఏండ్ల క్రితం ఆబాలగోపాలం పాడుకుంటూ, శాంతి నినాదాల ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శనల్లో పాల్గొనేది. అప్పటి అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ నూట్రన్ బాంబుతో (సంపద ను యధాతధంగా ఉంచి మనుషు లను, జీవాలను బలికొనే బాంబు ప్రపంచాన్ని బెదిరిస్తూ ఉంటే, ఆరుద్ర గారు నూట్రాను బాంబు కట్టి రీగనోడా! నీవు పేట్రేగిపోతున్నావు రీగనోడా! అనే పాటతో నినదించాడు.
ప్రస్తుతం అలానే ప్రజాఉద్యమాలతో అనుసంధానంగా ఎక్కడికక్కడ శాంతి ఉద్యమాలు నడపవలసిన ఆవశ్యకత ఏర్పడింది. ప్రజలకు యుద్ధ ప్రమాదాలను తెలుపుతూ శాంతి చైతన్యం మరల పాదుకొల్పాల్సిన స్థితి నెలకొన్నది.
యుద్ధాలకు ప్రధాన కారణం ‘సామ్రాజ్యవాద ఆర్థిక దోపిడే’ అన్న సత్యాన్ని కామ్రేడ్ లెనిన్ పదే పదే నొక్కి చెప్పేవాడు. ప్రచ్ఛన్న యుద్ధం కాదు సాక్షాత్తు ప్రత్యక్ష యుద్ధాలే నేడు పక్కలో బల్లాల్లా మనతో పాటు మనవెంట నడుస్తున్నాయి.
రష్యా – ఉక్రెయిన్ యుద్ధం గత రెండేండ్లకు పైగా కొనసాగుతూనే ఉన్నది. ఈ యుద్ధంలో దాదాపు అయిదు లక్షల మందికి పైగా ప్రజలు విగతజీవులయ్యారని అంచనా. ఎవరూ విజేత లైనా అంతిమంగా బలైపోయేది పసిపిల్లలు, చిన్నారులు, మహిళలు, అమాయకపు ప్రజానీకమే.
ఉక్రెయిన్ యుద్ధానికి అమెరికా సైన్యం పంపితే అణుయుద్ధం జరిగే ప్రమాదం ఉన్నదని రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించడంతో పరిస్థితి కొంత సత్తుమణిగింది. రష్యాతో పోరాడేందుకు తాము ఉక్రెయిన్‌కు సైన్యాన్ని పంపబోమని అమెరికా వైట్‌హౌస్ ప్రకటించవలసి వచ్చింది.
మే చివరలో రష్యా కొత్తదాడిని ప్లాన్ చేస్తునట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపిస్తున్నాడు. దక్షిణ ఉక్రెయిన్ దాడిలోని ఒడెసా పట్టణంలో రష్యా చేసిన క్షిపణులదాడిలో ఇటీవల పదహారు మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఈ ప్రాంతం రష్యా ఆధీనంలోనే ఉన్నది.
కాగా, ఇజ్రాయిల్‌పై ఇరాన్ తాజాగా చేసిన ఆయుధదాడి నుంచి తప్పించుకోవడానికి గగనతల రక్షణ చట్రాన్ని ఇజ్రాయిల్ ఏర్పాటు చేసుకున్నది. అలాం టి రక్షణ చట్రాన్ని తమకు ఎందుకు కల్పించలేదని జెలెన్‌స్కీ ఇప్పుడు అమెరికా నాటో దేశాలను ప్రశ్నిస్తున్నాడు. అసలు రష్యాపై ఉక్రెయిన్ ను ఎగదోసింది ఈ నాటో దేశాలే. మాకు అవసరమై నన్ని ఆయుధా లను సరఫరా చేయకపోతే మేమె లా రష్యాను ఎదుర్కో గలం? అంటూ వాపోతు న్నాడు జెలెన్‌స్కీ. పైగా ఇజ్రాయిల్ నాటో సభ్యదేశం కాక పోయినా, నాటోదేశాలు ఇజ్రాయిల్‌కు అండగా ఉంటున్నాయని, ఈ పక్ష పాత వైఖరి ఏమిటని ఆక్రోసి స్తున్నాడు చివరకు అమెరికా సాయం వెంటనే విడుదల చేయకపోతే తాము గెలిచే అవకాశం లేనే లేదని కుండబద్దలు కొట్టాడు.
ఇది ఇలా ఉండగా జీవాయుధ ప్రయోగశాలలు (జీవాలను చంపాలి) ఉక్రెయిన్‌లో ఉన్నట్టు, అలాంటి రసాయనాల ఆయుధాలవ్యాప్తికి అది సిద్ధమవుతున్నట్టు రష్యా పేర్కొంటున్నది. రెండేండ్ల కు పైగా సాగుతున్న ఈ యుద్దంలో ఇప్పటికి రష్యా పద్దెనిమిది శాతం ఉక్రెయిన్ భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నది.అందులో రెండు స్వతంత్ర ప్రాంతాలు కూడా ఉండటం గమనార్హం.
ఇలాంటి పరిస్థితుల్లో రష్యాను ఎదుర్కొనే సత్తా ఉక్రెయిన్‌కు లేనేలేదని, అయినా జెలెన్‌స్కీ ఇంకా పశ్చిమ దేశాల సాయం కోసం ప్రాకులాడటం ఆశ్చ ర్యం గొలుపు తున్నదని పరీశీలకులు భావిస్తున్నారు. ఏతావాతా తేలిందేమిటంటే అమెరికా, నాటో దేశాల చేతుల్లో బందీ అయిన జెలెన్‌స్కీ అనవసరంగా కాలుదువ్వుతూ యుద్ధం పేరిట అసంఖ్యాక ప్రాణన ష్టానికి కారణం అవుతున్నట్టు అర్థమవుతున్నది.
ఆర్నెల్ల క్రితం అక్టోబరు 7న ఇజ్రాయిల్‌పై హమాస్ ఆకస్మిక దాడితో ప్రారంభమైన ఇజ్రాయిల్ – పాలస్తీనా యుద్ధం ఇప్పటికి ముప్పై వేల మందికి పైగా ప్రజల ప్రాణాలను పొట్టన పెట్టుకున్నది. గాజాను సమూలంగా నేలమట్టం చేసేందుకు వెనుకాడేది లేదని ఇజ్రాయిల్ విర్రవీగు తున్నది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 1న సిరియా రాజధాని డమాస్కస్‌లోని ఇరాన్ రాయబార కార్యాల యంపై ఇజ్రాయిల్ దాడి చేసి ముఖ్య అధికారులను పన్నెండు మందిని బలితీసుకున్నది. ఇందుకు ప్రతీకారచర్యగా ఇరాన్ ఇజ్రాయిల్‌పై దండెత్తి వందల సంఖ్యలో క్షిపణులను, డ్రోన్‌లను ప్రయోగించింది. ప్రాణనష్టం పెద్దగా సంభవించన ప్పటికీ యుద్ధ మేఘాలు కారుమబ్బులా పశ్చిమాసియా అంతటా కమ్ముకున్నాయి. మరల ఇజ్రాయిల్ ఇందుకు ప్రతీకారంగా ఇరాన్‌పై, ఆదేశ అధినేత అయితుల్లా ఖొమైని 85వ పుట్టిన రోజున శుక్రవారం నాడు పెద్ద ఎత్తున క్షిపణులతో విరుచుకు పడింది. ఇలా యుద్ధ దాడులు – ప్రతి దాడులతో పరిస్థితి పూర్తిగా విషమించింది.
ఇరాన్‌కు మద్దతుగా హెజ్బులా, హైతి వంటి తీవ్రవాద సంస్థలు ఎర్ర సముద్రంలో మెరుపు దాడులు చేస్తూ నౌకా రవాణా చర్యలను స్తంభింప చేస్తున్నాయి. చమరు రవాణాకు ఆటంకం ఏర్పడి పరిస్థితులు అతలాకుతలం అవుతున్నాయి. ఈ సంస్థల దాడులు నివారించాలనే ఉద్దేశ్యంతో అమెరికా బ్రిటన్‌లు రంగంలోకి దిగుతున్నాయి.
ఇజ్రాయిల్‌తో అమెరికా బ్రిటన్‌లు ఇలా చెట్టపట్టా లేసుకుని తిరగడం పట్ల చమరు కేంద్రమైన పశ్చిమాసియా నేడు రావణకాష్టంలా మండు తున్నది. ఇలాంటి పరిస్థి తుల్లో ఇప్పటికిప్పుడు ఇరాన్‌తో ఇజ్రాయిల్‌గాని ఒకవేళ కయ్యానికి కాలుదువ్వితే తాను ఏమాత్రం రక్షించ బోనని అమెరికా పైకి మాత్రం అంటున్నది. అమెరికా పాల కులు ఎవరైనా ఇజ్రాయిల్‌ను వెనకేసుకు రావడం జగమెరిగిన సత్యం. కారణం పెట్టుబడిదారులు- ఆయుధ వ్యాపారుల మధ్యగల ‘జిగినీ’ దోస్తీ .
ఒకవేళ అమెరికా గాని ఇజ్రాయిల్‌కు మద్దతుగా దాడికి దిగితే తానూ రంగప్రవేశం చేయవలసి ఉంటుందని రష్యా ఇక్కడ కూడా ప్రకటించింది. కాబట్టి గాజా యుద్ధం ప్రపంచాన్ని చుట్టు ముడుతుందా? అన్న భయాందోళనలు ఎల్లెడలా వ్యక్తం అవుతున్నాయి. అమెరికా అండదండలు లేకుండా ఇజ్రాయిల్ చెలరేగలేదు. వర్తమాన యుద్ధోన్మాది ఇజ్రాయిల్ అధ్యక్షుడు బెంజిమన్ నెతన్యాహూకు ముకుతాడు వేయకపోతే పరిస్థితి చేయిదాటే ప్రమాదం ఉన్నది.
హమాస్, పాలస్తీనా శత్రుశేషం లేకుండా చేయాలనుకునే నెతన్యాహు పంతం ఎప్పటికీ నెరవేరదన్న సత్యం ఈ ఆర్నెల్లల్లో తేలిపోయింది. ఇజ్రాయిల్ యుద్ధమారణకాండకు స్వస్తి చెప్పి వెనక్కి మరలడమే అంతటా శ్రేయస్కరం.
కాగా ఐక్యరాజ్య సమితిలో పాలస్తీనాకు పూర్తిస్థాయి సభ్యత్వం కల్పిం చాలంటూ భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అమెరికా వ్యతిరేకిస్తూ వీటో చేసింది. దీంతో అమెరికా తన యుద్ధనైజాన్ని దాచుకోలేకపోయింది.
ఆకలి, అవిద్య, అనారోగ్యంపై యుద్ధాలు చేయవలసిన దేశాధినేతలు, వాటిపై కాకుండా ఇలా ఆధిపత్య యుద్ధాలతో ఆయుధ వర్షాలు కురిపించుతున్న ప్రతిసారీ మానవాళి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతున్నది. ఈ ప్రమాదం ముంచుకు రాకుండా ఉండాలంటే ప్రజలకు ఎప్పటి కప్పుడు యుద్ధ కారణాలు, వాస్తవాలు తెలియ చేయాలి. ప్రపంచశాంతి ఉద్యమానికి ప్రతిఒక్కర్ని సన్నద్ధం చేయాలి. ప్రజల కోసం, ప్రపంచశాంతి కోసం మరణించేవారు ఎల్లకాలం జీవించే ఉంటారన్న ఫైడెల్ కాస్ట్రో సూక్తిని ప్రతి ఒక్కరం గుర్తెరగాలి.
కె. శాంతారావు
9959745723