నీళ్లూ.. లేక.. పర్యాటకులూ… లేక..

– వెలవెలబోతున్న లక్నవరం పర్యాటక కేంద్రం
నవతెలంగాణ-గోవిందరావుపేట
ప్రస్తుతం లక్నవరం పర్యాటక కేంద్రం నీళ్లు లేక, పర్యాటకులు లేక వెలవెల బోయి బోసిగా కనిపిస్త్తోంది. పంటలు పండక నిలువ ఉన్న నీటిని చేపలు పట్టే కాంట్రాక్టర్‌ తన కాంట్రాక్టు గడువు ముగుస్తుందని చేపలు పట్టేందుకు ఉన్న నీటిని దయ్యాలవాగుకు విడుదల చేయడం జరిగింది. నిరంతరం పర్యాటకులతో కిటకిటలాడే ఈ పర్యాటక కేంద్రం ఇప్పుడు పర్యాటకులు లేక బోసి పోతోంది. కొద్దొగొప్పగా వచ్చిన పర్యాటకులు ఆ వేలాడే వంతెన పై అటు ఇటు తిరుగుతూ ఫోటోలు దిగుతూ వెళ్ళిపోతున్నారు. మరికొందరు నీరు ఎండిన మైదానంపై క్రికెట్‌ ఆడుతూ కాలక్షేపం చేస్తున్నారు. పర్యాటక కేంద్రానికి పెద్ద ఎత్తున నిధులు సమకూర్చే బోట్‌ షికార్‌ నిలిచిపోయింది. నిండుకుండలా ఉండాల్సిన లక్నవరం చెరువు ఎండిపోయి కనబడడం చూడలేకపోతున్నామని పర్యాటకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పాపం ఎవరిదంటే కచ్చితంగా పాలకులు, అధికారులదేనని రైతులు, పర్యాటకులు పేర్కొంటున్నారు. కోట్ల రూపాయలు వెచ్చించి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దిన లక్నవరంను నిరంతరం గోదావరి జలాలతో నింపి రిజర్వాయర్‌గా మార్చి నిరంతరం పర్యాటకులతో కిలకిలలాడే విధంగా రైతులకు ప్రతి సంవత్సరం రెండు పంటలు పుష్కలంగా పండే విధంగా చేస్తామని అధికార పార్టీ నాయకులు ప్రగల్భాలు పలుకుతున్నారే తప్ప కార్యరూపం దాల్చని పరిస్థితి నెలకొంది. ఉన్న అధికారులు కూడా ఎక్కడో వరంగల్‌లో ఉండి పరిపాలన చేయడం వల్ల నీటిని పొదుపు చేయలేక పోతున్నారని రైతులు చెబుతున్నారు. 13వ శతాబ్దంలో కాకతీయులు నిర్మించిన ఈ లక్నవరం చెరువు నాటి టెక్నాలజీ ముందు నేడు ఇంజనీర్లు అక్కరకు రాకుండా పోతున్నారు. ప్రతి సంవత్సరం లీకేజీల రూపంలో నీరు వధా అవుతున్న ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. కాలువల మరమ్మతులకు చెరువు లీకేజీలకు అప్పుడప్పుడు కేటాయించిన నిధులు గుత్తేదారులకు అధికారులకు ప్రజా ప్రతినిధులకు జేబు సంస్థగా మారి వారి ఆర్థిక అభివద్ధికి తోడ్పడుతుంది తప్ప చెరువుకు రైతాంగానికి పర్యాటకులకు ఒరిగింది ఏమీ లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వందల సంవత్సరాల నుంచి పేరుకుపోయిన పూడికను తీయించడంతోపాటు గోదావరి జలాలను చెరువులోకి మళ్లించి నిరంతర జలాశయంగా మార్చాలని రైతులు కోరుతున్నారు. లక్నవరం ప్రధాన కాలువలైన 3 కాలువలకు ఖరీఫ్‌ రబీ పంటలను రైతులు సాగు చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని రైతులు వేడుకుంటున్నారు.