– ఆవాజ్ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తురకకాశ, ఫకీరు, బోరేవాల, గంటేవాల, బుగ్గెవాల, గారడీ తదితర సంచార ముస్లిం తెగల వారికి మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ రుణాల్లో ప్రాధాన్యతనివ్వాలని ఆవాజ్ డిమాండ్ చేసింది. ఆ సంస్థ ఆధ్వర్యంలో తురకకాశ, ఫకీరు సంచార ముస్లిం తెగల సంక్షేమ సంఘం ప్రతినిధులు బుధవారం మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో తురకకాశ, ఫకీరు, బోరేవాల, గంటేవాల, గారడీ, బుగ్గెవాల తదితర సంచార ముస్లిం తెగలు ప్రభుత్వ సహాయం అందక ఆర్థికంగా సామాజికంగా వెనుకబడి ఉన్నాయని తెలిపారు. ఆవాజ్ అనేక సందర్భాల్లో ఈ విషయాన్ని ప్రభుత్వం దష్టికి తీసుకెళ్ళిందని గుర్తు చేశారు. ఇప్పటికైనా సంచార ముస్లిం తెగలకు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఆర్థిక సహాయం అందించాలని కోరారు. మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మెన్ ఇంతియాజ్, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎమ్‌డీ క్రాంతి తదితరులు కార్పొరేషన్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆవాజ్ నాయకులు, తురకకాశ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ ఇమామ్ పాషా, షేక్ మదార్, హుస్సేన్, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.