– నియామక పదవుల కోసం కాంగ్రెస్‌లో ఎదురుచూపులు
– సంక్రాంతి తరువాత భర్తీ చేసే చాన్స్
– సిన్సియర్ నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తులు
– మేయర్, డీసీసీబీ చైర్మెన్ సీట్లపైనా దృష్టి
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
నామినేటెడ్ పదవులపై కాంగ్రెస్ నాయకులు గంపెడు ఆశలతో ఉన్నారు. ప్రజాప్రతినిధుల చేత ఎన్నికైన మేయర్, డీసీసీబీ చైర్మెన్ తదితర పోస్టుల కోసం కూడా వ్యూహాలు రచిస్తున్నారు. సంక్రాంతి తర్వాత ఈ పదవులు భర్తీ చేసే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో ఎమ్మెల్యే టికెట్లు ఆశించి భంగపడిన నేతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు అనుచరులు ఎవరికి వారే నామినేటెడ్ పదవుల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మంత్రుల దృష్టిలో పడేందుకు హైదరాబాద్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా మంత్రులను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఎన్నికలకు ముందే హామీలు ఇచ్చిన నేతలకు మాత్రం నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత లభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేల గెలుపు కోసం తీవ్రంగా శ్రమించిన నేతలకు సైతం నామినేటెడ్ పదవులు దక్కే అవకాశం ఉంది.
టికెట్ ఆశించి భంగపడిన నేతలకు ఎమ్మెల్సీ చాన్స్…
ఇప్పటికిప్పుడు కాకపోయినా టికెట్ ఆశించి భంగపడిన నేతలు రాయల నాగేశ్వరరావు, పోట్ల నాగేశ్వరరావు, విజయాబాయి వంటి నేతలకు ఎమ్మెల్సీ పదవులు దక్కే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవుల్లో కీలకమైనవి కొన్ని జిల్లాకు చెందిన నేతలకు దక్కే అవకాశం ఉంది. వీరిలో సాధు రమేష్‌రెడ్డి, ఐలూరి వెంకటేశ్వరరెడ్డి, మువ్వా విజరుబాబు, తుళ్లూరి బ్రహ్మయ్య, రామసహాయం నరేష్ రెడ్డి, మద్ది శ్రీనివాసరెడ్డి, చావా శివరామకృష్ణ, మద్దినేని బేబీ స్వర్ణకుమారి, కమర్తపు మురళి, మందడపు మనోహర్, ముస్తఫా, జావీద్, పువ్వాళ్ల దుర్గాప్రసాద్, దొబ్బల సౌజన్య, బొర్రా రాజశేఖర్ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. భద్రాద్రి రామాలయ చైర్మెన్, జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మెన్‌తో పాటు పాలకవర్గం ఎన్నిక కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మెన్ పదవిపై కూడా పలువురి దృష్టి కేంద్రీకృతమైంది.
మేయర్ పీటం..డీసీసీబీ చైర్మెన్ గిరిపైనా దృష్టి
ఖమ్మం నగర మేయర్ పీఠంపైనా పలువురు దృష్టి సారించారు. డీసీసీబీ చైర్మెన్, మార్కెట్ కమిటీ చైర్మెన్ పదవి కోసం పలువురు పోటీ పడుతున్నారు. వాస్తవంగా ఇవి నామినేటెడ్ పోస్టులు కానప్పటికీ బీఅర్‌ఎస్ ప్రజాప్రతినిధులు పలువురు కాంగ్రెస్‌లో చేరేందుకు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో సంబంధిత పదవుల కోసం అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కాంగ్రెస్ సమాయత్త మవుతోంది. ఒకవేళ అవిశ్వాస తీర్మానంలో కాంగ్రెస్ పార్టీ నెగ్గితే ఖమ్మం నగర మేయర్‌గా మందడపు లక్ష్మీ మనోహర్, చావా మాధురి నారాయణ, మిక్కిలినేని మంజుల నరేందర్‌లో ఒకరికి పదవులు దక్కే అవకాశం ఉంది. సామాజిక సమీకరణాలు, పార్టీకి చేసిన సర్వీసు, ఎన్నికల సమయంలో పార్టీ గెలుపునకు దోహదపడిన అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ పదవులను భర్తీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు ఈ నామినేటెడ్ పదవులను ఎలా బ్యాలెన్స్ చేస్తారనే అంశం కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సిన్సియర్ నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది.
పదవుల భర్తీకి సంక్రాంతి ముహూర్తం..
సంక్రాంతి ముహూర్తంగా నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తారని ఊహాగానాలు వస్తున్నాయి. జిల్లా స్థాయిలో మార్కెట్ కమిటిలు, దేవాలయ అభివృద్ధి కమిటీలు. రెండు గ్రంథాలయ అభివృద్ధి కమిటీలతో పాటు ఖమ్మం అర్బన్ డెవలప్‌మెంట్ (సుడా) పదవులున్నాయి. వీటిని మండల స్థాయి నాయకులకు ఇచ్చే అవకాశం ఉంది. బీఆర్‌ఎస్ హయాంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు భారీ స్థాయిలో నామినేటెడ్ పదవులు దక్కాయి. జిల్లాలో కాంగ్రెస్ గణనీయమైన ఫలితాలు సాధించిన నేపథ్యంలో మంత్రి పదవులు ఎలాగైతే దక్కాయో.. నామినేటెడ్ పదవుల విషయంలోనూ ప్రాధాన్యత లభిస్తుందని భావిస్తున్నారు. పారిశ్రామిక అభివృద్ధి సంస్థ చైర్మెన్, రాష్ట్ర విత్తనాభివద్ధి సంస్థ చైర్మెన్, ఓ ఎమ్మెల్సీ, మార్కెట్ వైస్ చైర్మెన్ పదవులు జిల్లాకు దక్కాయి. మరికొన్ని పదవులు కూడా జిల్లాకు దక్కే చాన్స్ ఉందని అంటున్నారు.