ఎమ్మెల్యే కోటాలో మండలి అభ్యర్థుల నామినేషన్‌

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు నామినేషన్లను గురువారం అసెంబ్లీలో దాఖలు చేశారు. అభ్యర్థులుగా దేశపతి శ్రీనివాస్‌, నవీన్‌ కుమార్‌, చల్లా వెంకట్రామిరెడ్డి తమ నామినేషన్‌ పత్రాలను అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులకు సమర్పించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు నామినేషన్లకు సంబంధించిన అన్ని అంశాలనూ శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి దగ్గరుండి పర్యవేక్షించారు. నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. నామినేషన్ల దాఖలు కంటే ముందు ఎమ్మెల్సీ అభ్యర్థులు గన్‌పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు.