ముగిసిన నామినేషన్ల ప్రక్రియ

Nominations process concluded– మహేశ్వరం బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మంత్రి సబితాఇంద్రారెడ్డి నామినేషన్‌
నవతెలంగాణ- విలేకరులు
అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. కామారెడ్డిలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి, మహేశ్వరంలో మంత్రి సబితాఇంద్రారెడ్డి, సీపీఐ(ఎం) అభ్యర్థులు తదితరులు నామినేషన్లు వేశారు.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం నామినేషన్‌ వేశారు. ఎంపీ రంజిత్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితాహరినాథ్‌రెడ్డితో కలిసి రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలను అందచేశారు. బీఆర్‌ఎస్‌ శ్రేణులు, అభిమానులు మహేశ్వరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మరోసారి తనను గెలిపించాలని సబిత కోరారు. హైదరాబాద్‌లోని గోషామహల్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నందకిషోర్‌ వ్యాస్‌ (బిలాల్‌) అబిడ్స్‌ జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో నామినేషన్‌ దాఖలు చేశారు. కాంగ్రెస్‌ సనత్‌నగర్‌ అభ్యర్థి డాక్టర్‌ కోటా నీలిమ, బీజేపీ అభ్యర్థులు కూడా పలుచోట్ల నామినేషన్లు వేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆయా నియోజకవర్గాల నుంచి మొత్తం 136 నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజు అశ్వారావుపేట నియోజకవర్గం నుంచి సీపీఐ(ఎం) అభ్యర్ధి అర్జున్‌ రావు పిట్టల తన రెండో సెట్‌ నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున మెచ్చా నాగేశ్వరరావు నాలుగో సెట్‌ దాఖలు చేశారు. కొత్తగూడెం నియోజకవర్గం నుంచి కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ నుంచి నామినేషన్‌ వేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి వనమా వెంకటేశ్వర్లు నామినేషన్‌ దాఖలు చేశారు.