– మొదటి జాబితాలోనే అభ్యర్థి ఖరారు
– బూర నర్సయ్యగౌడ్‌కు మొండి చేయ్యి
– సీనియర్ నాయకులను పక్కన పెట్టిన అధిష్టానం
నవతెలంగాణ-రంగారెడ్డిప్రతినిధి
అధికార బీఆర్‌ఎస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత స్థానాన్ని బీజేపీ దక్కించుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో 52 మంది అభ్యర్థులను పట్టించి అధికార బీఆర్‌ఎస్‌కు సవాల్ విసిరింది. మొదటి జాబితాలో రంగారెడ్డి జిల్లాలోని మూడు నియోజకవర్గాల అభ్యర్థులను పట్టించింది. అందులో కల్వకుర్తి అభ్యర్థిగా తల్లోజు ఆచారి, మహేశ్వరం అభ్యర్థిగా అందెల శ్రీరాములు ప్రకటించగా, ఇబ్రహీంపట్నం బీజేపీ అభ్యర్థిగా నోముల దయానంద్‌గౌడ్‌ను ప్రకటించింది. ఇబ్రహీంపట్నం ప్రకటించడంతో ఆ పార్టీ శ్రేణులు ఏ మేరకు కలిసి పని చేస్తారన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే అభ్యర్థిగా తమకు అవకాశం కల్పించాలని సుమారు 30మంది నాయకులు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. వీరిలో ప్రధానంగా భువనగిరి మాజీ పార్లమెంటు సభ్యులు బూర నర్సయ్య గౌడ్ పేరు ప్రముఖంగా వినిపించింది. ఆయనకే టికెట్ దక్కుతుందని అందరూ భావించారు. ఆయన బీజేపీ పార్టీలో చేరినప్పటి నుండి ఇబ్రహీంపట్నం నియోజక వర్గంలో విస్తృతంగా పర్యటించారు. ఆయనకు ఈ ప్రాంత సీనియర్ నాయకులు సహకరించలేదన్న విమర్శలు ఉన్నాయి. ఆయన పార్టీ కార్యక్రమాలకు వస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న సీనియర్లు ఆ సమావేశాలకు సైతం దూరంగా ఉంటూ వచ్చారు. స్థానికేతరునికి టికెట్ ఎలా ఇస్తారన్న ఒత్తిడిని సైతం అధిష్టానం ముందుంచినట్టు తెలుస్తోంది. ఇక బీసీ నినాదమే పని చేస్తే 2018ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన కొత్త అశోక్ గౌడ్ సైతం తమకు అవకాశం కల్పించాలని కోరారు. మరోవైపు బీజేపీ సీనియర్ నాయకులు పోరెడ్డి అర్జున్‌రెడ్డి, పోరెడ్డి నరసింహారెడ్డి, పోరెడ్డి సుమతిరెడ్డి సైతం టికెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాష, యాచారం మండలానికి చెందిన అంజయ్య యాదవ్ సైతం ఆశించారు. వీరితో పాటు కొంతమంది టిక్కెట్లు ఆశపడ్డప్పటికీ బీజేపీ అధిష్టానం మాత్రం నోముల దయానందగౌడ్ వైపే మొగ్గు చూపింది. మొదటి విడతలోనే ఇబ్రహీంపట్నం తమ అభ్యర్థులను ప్రకటించడంతో ఎన్నికల యుద్ధరంగం ప్రారంభమైంది. ఇప్పటివరకు అధికార బీఆర్‌ఎస్ తమ పార్టీ అభ్యర్థిని ప్రశ్నించగా బీజేపీ సైతం తమ అభ్యర్థులు ప్రకటించిన జాబితాలో రెండవ స్థానంలో నిలిచింది. ఇక కాంగ్రెస్ తమ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. ఈ సీటును తనే పోటీ చేస్తుందా లేక వామపక్షాలకు వదిలిపెడుతుందా అనేది తేలాల్సి ఉంది.