కవ్వాల్ అభయారణ్యంలోనీ ఇంధనపల్లి చెక్ పోస్ట్ వద్ద రాత్రివేళ స్థానికేతర వాహనాలకు అనుమతి లేదని, ఈ విషయాన్ని ప్రజలు, వాహనదారులు గమనించాలని మండలంలోని ఇందన్ పల్లి అటవీ రేంజ్ ఎఫ్ఆర్ఓ కారం శ్రీనివాస్ సూచించారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ అటవీ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అభయారణ్యంలోని ఇంధనపల్లి అటవీ చెక్ పోస్ట్ ను రాత్రి 9 నుండి తెల్లవారు జామున 6 గంటల వరకు మూసి వేయడం జరుగుతుందన్నారు. అయితే స్థానికులకు, వారి వాహనాలకు అనుమతి ఉంటుందని, స్థానికేతర వాహనాలకు అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు. స్థానికులు సాధ్యమైనంతవరకు త్వరగా వారి గమ్యస్థానాలకు చేరుకునేందుకు ప్రయత్నించాలని, ఒకవేళ ఆలస్యమైతే స్థానికులుగా గుర్తించేందుకు ఆధార్ కార్డు లాంటి పత్రాలను చూపించాల్సి ఉంటుందన్నారు. ఎమర్జెన్సీ కి సంబంధించి వారు రాకపోకలు సాగించవచ్చన్నారు. ఆర్టీసీ, అంబులెన్స్, తదితర ఎమర్జెన్సీ వాహనాలకు మినహాయింపు ఉంటుందన్నారు. స్థానిక వాహనాలకు సెజ్ చార్జి ఉండదన్నారు. అదే సమయంలో రాత్రి 9 నుండి 6 గంటల వరకు స్థానికేతర వాహనాలకు ఎట్టి పరిస్థితులోనూ అనుమతి ఉండదని ఆయన స్పష్టం చేశారు. అడవులు, వన్యప్రాణుల సంరక్షణలో భాగంగా అటవీ నిబంధనలను కఠినంగా అమలు చేయనున్నామని ఆయన వెల్లడించారు. ఈ విషయాన్ని స్థానికులు గమనించి అటవీశాఖ అధికారులకు గమనించాలన్నారు. స్థానికులకు, వాహనదారులకు ఇబ్బంది కాకుండా చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగానే నిబంధనలను పాటించడం జరుగుతుందన్నారు. కవ్వాల్ అభయారణ్య రక్షణకు అందరం కలిసి కృషి చేద్దామని, దీనికి అందరూ సహకరించాలని ప్రజలను ఇందన్పల్లి ఎఫ్ఆర్ఓ కారం శ్రీనివాస్ కోరారు.