– వరుస వైమానిక, క్షిపణి దాడులతో దద్దరిల్లిన ‘టైర్’
– ఇజ్రాయిల్ దాడిలో ఏడుగురు మృతి, 17మందికి గాయాలు
– నగరాన్ని కమ్మేసిన పొగ, దుమ్ము ధూళి
– గాజాలో 22మంది మృతి, వందలాదిమంది అరెస్టు
– రెండు రోజుల కాల్పుల విరమణకు ఈజిప్ట్ ప్రతిపాదన
గాజా, బీరుట్ : లెబనాన్ పోర్ట్ సిటీ టైర్‌పై ఇజ్రాయిల్ బలగాలు వరుస వైమానిక దాడులతో విరుచుకుపడ్డాయి. బాంబుల హోరు, నల్లని దట్టమైన పొగ, లేచిన దుమ్ము ధూళి నగరమంతా కమ్మేసింది. ఈ దాడుల్లో ఇప్పటివరకు ఏడుగురు మరణించగా, 17మంది గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. నగరం నట్టనడిబొడ్డును లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయిల్ యుద్ధ విమానాలు క్షిపణుల వర్షం కురిపించాయి. చారిత్రక నగరాన్ని నేలమట్టం చేయాలన్నదే వారి లక్ష్యంగా కనిపిస్తోంది. నగరంలో నివాస ప్రాంతాల్లో ఐదారుసార్లు వైమానిక దాడులు జరిగాయి. మొదటి రెండు దాడుల్లో నివాస భవనాలు పేకమేడల్లా కూలిపోవడం కనిపించిందని స్థానిక మీడియా తెలిపింది. టైర్ నగరంలో పరిస్థితులు ఊహించనలవిగాని రీతిలో వున్నాయని, గత కొద్ది గంటల్లో నగరంలోని కార్నిచ్ ఏరియా చుట్టుపక్కల వరుస దాడులతో హోరెత్తిపోయింది. ఈ నేపథ్యంలో లెబనాన్‌లో తక్షణమే కాల్పుల విరమణ జరగాలని యురోపియన్ యూనియన్ పిలుపిచ్చింది.
గాజాలో 600మంది అదుపులోకి
సోమవారం ఉదయం నుండి గాజాలో జరిగిన దాడుల్లో 22మంది మరణించారు. వారిలో 13మంది ఉత్తర గాజా దాడుల్లో చనిపోయారని వైద్య వర్గాలు తెలిపాయి. గత 48గంటల్లో 96మంది మరణించారని పేర్కొన్నాయి. ఉత్తర గాజాలోని ప్రాంతాల నుండి, జాబాలియా శరణార్ధ శిబిరం నుండి దాదాపు 600మంది పాలస్తీనియన్లను అరెస్టు చేసినట్లు ఇజ్రాయిల్ ఆర్మీ రేడియో తెలిపింది. గాజా నగరంలోని సాబ్రా ఏరియాలో ఇద్దరు మరణించగా, రఫా నగరంలో రెండు మృత దేహాలను స్వాధీనం చేసుకున్నారు. సెంట్రల్ గాజాలోని బురెజి శరణార్ధ శిబిరంపై వరుసగా క్షిపణులతో, డ్రోన్‌లతో దాడులు కొనసాగుతున్నాయి. తూర్పు ప్రాంతంలోని తమ ఇళ్ళకు తిరిగివస్తున్న ఒక బృందాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. అంతకుముందు సోమవారం తెల్లవారు జామున షుజయె ప్రాంతంలో నివాస భవనాన్ని లక్ష్యంగా చేసుకుని కూడా ఇదే రీతిలో మిలటరీ దాడులు జరిపింది. ముగ్గురు మరణించారు. వారి మృతదేహాలను కొద్ది గంటలు గడిచిన తర్వాత గుర్రపు బండిపై వేసుకుని ఆస్పత్రికి ఒక వలంటీర్ తీసుకెళ్ళఢం కనిపించిందని మీడియా పేర్కొంది. ఇప్పటివరకు గాజాలో మరణించిన వారి సంఖ్య 43,020కి చేరుకోగా, గాయపడిన వారి సంఖ్య 1,01,110కి చేరుకుంది.ఉత్తర గాజాలోని కమల్ అద్వాన్ ఆస్పత్రిలో దాదాపు వందమందిని సైన్యం అదుపులోకి తీసుకుంది. వారందరూ ఆస్పత్రి సిబ్బందేనని గాజా ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి.
ఈజిప్ట్ ప్రతిపాదన
గాజాలో రెండు రోజుల పాటు కాల్పుల విరమణ జరగాలని, ఈ సమయంలో నలుగురు బందీలను విడుదల చేయాలని ప్రతిపాదించినట్లు ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫత్తా అల్ శిశి తెలిపారు. దీనిపై ఇరు పక్షాలనుండి వెంటనే ఎలాంటి స్పందన తెలియరాలేదు. అలాగే పాలస్తీనా ఖైదీలను కూడా కొంతమందిని విడుదల చేయాలని, గాజాకు మానవతా సాయాన్ని పంపాలని కూడా ప్రతిపాదన చేసినట్లు చెప్పారు. శాశ్వత కాల్పుల విరమణ కోసం చర్చలు కొనసాగాలని, అందుకోసం పరిస్థితులను కాస్తంత ముందుకు తీసుకెళ్ళాలంటే ఈ ప్రతి పాదనలు అమలు చేయాలని ఆయన సూచించారు.
ఖమేని ఖాతా సస్పెన్షన్
ఇరాన్ సుప్రీం నేత అయిన ఆయతుల్లా అలీ ఖమేని కొత్త సోషల్ మీడియా ఖాతాను ఎక్స్ సస్పెండ్ చేసింది. ఆ ఖాతాలో హీబ్రూలో పోస్టులు పెడుతూ వుంటారు. ఎక్స్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ ఖాతాను నిలుపుచేసినట్లు ఎక్స్ పేర్కొంది. అయితే ఆ ఉల్లంఘన ఏమిటన్నది వెంటనే తెలియరాలేదు.
ఇరాన్ సైనిక స్థావరాలపై దాడి దృశ్యాలు విడుదల
ఇరాన్ రాజధాని టెహరాన్‌కు ఆగేయంగా గల ఒక రహస్య సైనిక స్థావరంపై ఇజ్రాయిల్ జరిపిన దాడికి సంబంధించిన శాటిలైట్ దృశ్యాలు విడుదలయ్యాయి. ఈ దాడుల్లో ఆ స్థావరంలోని పలు భవనాలు ధ్వంసమైనట్లు కనిపిస్తోంది. సమీపంలోని ఖోజీర్ సైనిక స్థారవంలో కూడా కొన్ని భవనాలు ధ్వంసమయ్యాయి. ఈ ప్రాంతంలో భూగర్భ సొరంగ వ్యవస్థ, క్షిపణి తయారీ ప్రదేశాలు వున్నాయని, వాటిని బయటి ప్రపంచానికి తెలియకుండా ఇరాన్ దాచిపెట్టిందని ఇజ్రాయిల్ ఆరోపించింది. సైనిక స్థావరాలపై దాడి జరిగిందన్న విషయాన్ని ఇరాన్ ధ్రువీకరించలేదు. ఇజ్రాయిల్ దాడిలో వైమానిక రక్షణ వ్యవస్థలో పనిచేస్తున్న నలుగురు ఇరాన్ సైనికులతో పాటు ఓ పౌరుడు మరణించినట్లు ప్రకటించింది. మృతుల వివరాలను వెల్లడించలేదు. ఇరాన్ రాజధాని టెహరాన్‌కు నైరుతి, పశ్చిమప్రాంతాల్లోని వైమానిక, సైనిక స్థావరాలపై శనివారం తెల్లవారుజామున ఇజ్రాయిల్ వైమానిక దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే.