బాలాసోర్ విషాదం నుండి పూర్తిగా తేరుకోకముందే బెంగాల్‌లో కాంచనజంగ ప్రమాదం కలవరపెట్టింది. రైలుపెట్టెలు అగ్గిపెట్టెల్లా చెల్లా చెదురయ్యాయి. ఈ ప్రమాదంలో 15 మంది చనిపోగా 60 మంది గాయపడ్డారు. ఈ వరుస ప్రమాదాలు ఎందరో తల్లులకు కడుపుకోత మిగిల్చాయి! ఇక కాళ్ళూ, చేతులు కోల్పోయి జీవచ్ఛవాల్లా మారినవారెందరో? ప్రజలను గమ్యస్థానాలకు చేర్చాల్సిన రైళ్లు శ్మశానాలను తలపిస్తున్నాయి. ఈ భయానక దృశ్యాలు మనసును విచలితం చేస్తున్నాయి. రైలు ప్రయాణమంటేనే వెన్నులో వణుకు పుట్టేలా చేస్తున్నాయి. మోడీ పాలనలో రైల్వే శాఖ భద్రత విషయంలో పూర్తిగా వైఫల్యం చెందినదనేది వాస్తవం.
2016లో ఇండోర్-రాజేంద్రనగర్ ఎక్స్‌ప్రెస్… పుఖ్‌రాయన్ దగ్గర పట్టాలు తప్పింది. 14 బోగీలు చెల్లాచెదురయ్యాయి.ఈ ప్రమాదంలో 152 మంది చనిపోగా 250 మందికి పైగా గాయపడ్డారు. 2017లో విజయనగరంలోని కూనేరు వద్ద హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 41 మంది చనిపోగా, 69 మంది గాయపడ్డారు. గతేడాది ఒడిశా, బాలాసోర్‌లో కోరమండల్ ఎక్స్‌ప్రెస్, ఓ గూడ్స్ రైలుని ఢకొీట్టడంతో ఏకంగా 15 బోగీలు చెల్లాచెదురయ్యాయి. అదే సమయంలో హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ అటుగా వస్తూ పక్కకు పడిన బోగీలను ఢకొీట్టింది. దాని కొన్ని బోగీలు కూడా పక్కకు పడ్డాయి. ఇలా మూడు రైళ్ల ప్రమాదంలో 290 మంది చనిపోగా, 1200 మంది గాయపడ్డారు. ఇలా ఎంతో మంది ప్రజల ప్రాణాలు ప్రమాదాల్లో ముగిసిపోయాయి.
ఇలా వరుసగా జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ ఆడిటర్ అయిన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) రైలు భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ట్రాక్‌ల పునరుద్ధరణకు నిధులు కేటాయింపు తగ్గిందనీ, కేటాయించిన నిధులను కూడా పూర్తిగా వినియోగించడం లేదని తేల్చి చెప్పింది. కాగ్ విశ్లేషణ ప్రకారం 2017-2021 మధ్య దేశంలో మొత్తం 2017 ప్రమాదాలు జరిగాయి. అందులో పట్టాలు తప్పినవి 1392. అంటే పట్టాలు తప్పి ఢ కొనటం వంటి రైల్వే ప్రమాదాలే అధికం. అయితే ఈ ప్రమాదాలకు కారణం మానవ తప్పిదమని తప్పించుకోవడం సర్వ సాధారణంగా మారిపోయింది. రైల్వే శాఖ పట్ల కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని 2022లో కాగ్ తన నివేదికలో నొక్కి వక్కాణించింది.
రైలు ప్రమాదాల్లో వందల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా కేంద్రం మాత్రం చోద్యం చూస్తోంది. కంచన్‌జంగ ప్రమాదానికి కూడా సిగల్ వ్యవస్థ సరిగా పని చేయకపోవడం, అత్యాధునిక కవచ్ రక్షణ వ్యవస్థ ఆ మార్గంలో లేకపోవడమే ప్రధాన కారణాలని తెలుస్తోంది. ఒకపక్క రైళ్లలో అత్యంత ఆధునిక సౌకర్యాలు కల్పిస్తామంటూ మోడీ వందేభారత్ రైళ్లను ఆర్భాటంగా ప్రారంభించారు. వీటిని తన మానస పుత్రికలుగా కూడా చెప్పుకున్నారు. మరోపక్క రైలు మార్గాల్లో భద్రత ఏర్పాట్లలో మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నారు. త్వరలో దేశానికి బుల్లెట్ రైళ్లను కూడా ప్రవేశపెడతామని గొప్పగా చెప్పారు. భద్రత కరువైన మన రైల్వే ట్రాక్‌లపై బుల్లెట్ రైళ్లను ఎలా నడుపుతారో ఆయనకే తెలియాలి?
ప్రమాదాలు జరిగిన ప్రతీసారీ ‘మరో సారి ఇలాంటివి జరగకుండా చూస్తాం, ప్రజల రక్షణే మా ప్రధమ కర్తవ్యం’ అంటూ సర్వసాధారణంగా చెప్పేస్తున్నారు. కానీ జరుగుతున్న ప్రమాదాల నుండి గుణపాఠం మాత్రం నేర్వడం లేదు. రైల్వేలో కనీస అవసరాలకు ప్రధాన్యం ఇవ్వడం లేదు. ప్రస్తుతం రైల్వే శాఖలో మూడు లక్షల 60వేల పోస్టులు ఖాళీగా పడున్నాయి. ఉన్న ఉద్యోగులపై పని భారం పెరిగిపోయింది. నైట్ షిఫ్టులతో విశ్రాంతి లేకుండా పని చేస్తున్నారు. రైల్వేలో పని చేస్తున్న సుమారు 8 లక్షల మంది కాంట్రాక్ట్ కార్మికులు కనీస వేతనాలు, సురక్షిత పని పరిస్థితులు, చట్టబద్ద హక్కులు కోల్పోయారు. ప్రశ్నిస్తే సస్పెషన్లు, బదిలీలు, శిక్షలు. ఇన్ని సమస్యల మధ్య మన రైల్వే సిబ్బంది పని చేస్తున్నారు. గతంలో రైల్వే అభివృద్ధికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించే వారు. ఇప్పుడు ఆ పద్ధతీ నిర్వీర్యమైపోయింది. వీటన్నింటి ఫలితంగా ప్రజల భద్రత మరింత ప్రమాదంలో పడింది.
ఒక ట్రాక్‌పైకి రెండు రైళ్లు వచ్చినప్పుడు ప్రమాదాలు నివారించేందుకు ఏర్పాటు చేసిన కవచ్ రక్షణ వ్యవస్థ ఈ మార్గంలో ఉండి ఉంటే ప్రమాదం తప్పేదని నిపుణులు అంటున్నారు. ఇలాంటి అత్యాధునిక సాంకేతిక వ్యవస్థ మన దగ్గర చాలా చోట్ల అందుబాటులో లేదు. పదే పదే డిజిటల్ ఇండియా, వికసిత్ భారత్ అంటూ గొప్పగా చెప్పుకునే మోడీ రైల్వేలో అత్యాధునిక రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయడంలో ఇన్నేండ్లు నిర్లక్ష్యంగా ఎందుకున్నట్టో! ఏది ఏమైనా మోడీ హయాంలో కార్పొరేట్లకు తప్ప సామాన్యుల ప్రాణాలకు గ్యారెంటీ లేదనేది వాస్తవం. ప్రజల ప్రాణాలకు గ్యారెంటీ ఇవ్వని పాలకుడిని ప్రజలు ఎన్నటికీ క్షమించరన్నది పచ్చి నిజం. ఇప్పటికైనా కేంద్రం తన నిర్లక్ష్య వైఖరిని విడనాడి రైల్వే భద్రతా వ్యవస్థకై పటిష్ట చర్యలు చేపట్టాలి. ప్రజల ప్రాణాలను కాపాడాలి.