ఈ నెలలో సాధారణ వర్షపాతం

న్యూఢిల్లీ : పసిఫిక్‌ మహా సముద్రంలో ఎల్‌నినో వృద్ధి చెందుతోందని, ఆ కారణంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నదని ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తీపి కబురు చెప్పింది. ఈ నెలలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. జూన్‌ నెల మొదటి అర్థభాగంలో వర్షపాతం తక్కువగా నమోదైనప్పటికీ ద్వితీయార్థంలో పరిస్థితి మెరుగుపడింది. దీర్ఘకాలిక సగటులో 94-106శాతం మధ్యలో వర్షపాతం నమోదైతే దానిని సాధారణ వర్షపాతంగా పరిగణిస్తారు. ఈ నెలలో దీర్ఘకాల సగటులో 100-106శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నదని ఐఎండీ అంచనా వేసింది. అందరూ భావిస్తున్నట్టు ఎల్‌నినో ప్రభావం వర్షపాతంపై పడే అవకాశం లేదు. రుతుపవనాల సీజన్‌ తొలి అర్థభాగంలో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నదని ఐఎండీ అంచనాలను బట్టి అర్థమవుతోంది. ఖరీఫ్‌ పంటలు విత్తుకోవడం ఆలస్యమవుతుందని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వాస్తవానికి గత రెండు వారాలుగా కురుస్తున్న వర్షాలకు రైతులు దేశంలోని చాలా ప్రాంతాలలో ఇప్పటికే ఖరీఫ్‌ పంటలు వేసుకున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది ఎక్కువ విస్తీర్ణంలో ఖరీఫ్‌ పంటలు వేసుకున్నారని ప్రభుత్వ గణాంకాలు తెలిపాయి. రాబోయే రెండు వారాలలో వ్యవసాయ పనులు మరింత ఊపందుకుంటాయని అంచనా. జూన్‌లో వర్షపాతం లోటు 8శాతంగా ఉంటుందని గతంలో ఐఎండీ అంచనా వేయగా నెలాఖరుకు అది 10శాతానికి చేరింది. కేరళ, కర్నాటక, బీహార్‌, మహారాష్ట్ర తెలంగాణలో వర్షపాతం లోటు అధికంగా ఉంది. తెలంగాణలో జూన్‌లో సాధారణం కంటే 50శాతం తక్కువగా వర్షపాతం నమోదైంది. దేశంలోని వాయవ్య ప్రాంతంలో మాత్రం అధిక వర్షాలు కురిశాయి.