క్రిస్మస్ అంటేనే మనసంతా నిండుతుంది. క్రైస్తవ సోదరుల ముంగిళ్లు నక్షత్ర కాంతులతో మిరిమిట్లు గొలుపుతుంటాయి. అతిథులతో కళకళలాడుతుంటాయి. ఇలా క్రిస్మస్ వేడుక అంటేనే ఓ సంబరం. మరి ఇలాంటి రోజున చేసుకునే వంటకాలూ కాస్త ప్రత్యేకంగా ఉండాలనే కోరుకుంటారు. నోరూరించే వంటకాలతో పండుగ ఆనందాన్ని రెట్టింపు చేయాలనుకుంటారా..! మరి వీటిని ప్రయత్నించండి…
శాంతా కుకీస్
కావల్సిన పదార్థాలు: మైదా – రెండు కప్పులు, పంచదార – పావుకప్పు, పాలు – పావుపకప్పు, ఫుడ్‌కలర్ – కొద్దిగా, బటర్ – రెండు టేబుల్ స్పూన్లు, చాక్లెట్ చిప్స్ – ఐదు.
తయారీ విధానం: ఓవెన్‌ను ముందుగా 180 డిగ్రీల వరకు వేడి చేసి పెట్టుకోవాలి. బటర్‌ను వేడి చేసి దాంట్లో పంచదార, పాలు, ఆ తర్వాత మైదా వేసి కలపాలి. దీంట్లోంచి కప్పు ముద్దను తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మిగతా దాంట్లో ఎర్రని ఫుడ్ కలర్ కలపాలి. దీంట్లోని పిండిని తీసుకొని అంగుళం, అర అంగుళం మందాన చిన్న చిన్న ముక్కల్లా చేసుకోవాలి. తెల్లని ముద్దలో నుంచి కొంత భాగాన్ని లడ్డూల్లా చుట్టాలి. ఎర్రని భాగాన్ని శాంతా శరీరంలా తయారు చేయాలి. తెల్లని ముద్దతో చేతులు, కాళ్లూ చేయాలి. చాక్లెట్ చిప్స్‌ను కళ్లలా అలంకరించాలి. మూడు చిప్స్‌ను ఒకదాని కింద మరోటి శరీరం మధ్యలో అంటిస్తే అవి బటన్స్‌లా కనిపిస్తాయి. శాంతా సిద్ధం అయిన తర్వాత వీటిని కుకీషీట్ మీద ఉంచి పావుగంట పాటు బేక్ చేయాలి. అంతే శాంతా జుట్టూ, గడ్డంలా తెల్లగా ఉంటుంది.
ప్లమ్ పుడ్డింగ్
కావల్సిన పదార్థాలు: కిస్‌మిస్ – అరకప్పు, చెర్రీలు -అరకప్పు, ఖర్జూర పలుకుల తరుగు, నల్లద్రాక్ష – పావుకప్పు, టూటీఫ్రూటీ – అకరప్పు, కమలాఫులం రసం – కప్పు, జీడిపప్పు, బాదం పలుకులు – ముప్పావుకప్పు చొప్పున, ఎండు ఆప్రికాట్లు – అరకప్పు, బ్రెడ్‌పొడి – కప్పు, మైదా – అరకప్పు, గుడ్లు – రెండు, బేకింగ్‌పౌడర్ – చెంచా, బ్రౌన్‌షుగర్ – కప్పు, చాక్లెట్‌పొడి – రెండు టేబుల్ స్పూన్లు, చల్లని వెన్న – కప్పు, దాల్చిన చెక్కపొడి – చెంచా, జాజికాయపొడి – చెంచా, ఉప్పు – అరచెంచా, వెనిల్లా ఎసెన్స్ – రెండు చెంచాలు.
తయారీ విధానం: ఒక రోజు ముందుగా కమలాపండు రసంలో కిస్‌మిస్, చెర్రీలు, ఖర్జూర తరుగు, నల్లద్రాక్ష, టూటీ ఫ్రూటీ, ఎండు ఆప్రికాట్ ముక్కలు వేసుకుని బాగా కలపాలి. మర్నాడు ఈ మిశ్రమాన్ని మరో గిన్నెలో తీసుకుని అందులో వెన్న తప్ప ఒక్కో పదార్థాన్ని వేసుఉంటూ బాగా కలపాలి. తర్వాత వెన్నను వేసి మరోసారి కలిపి ఈ మిశ్రమాన్ని పుడ్డింగ్ మౌల్డ్‌లో తీసుకుని బిగుతుగా మూత పెట్టాలి. ఇప్పుడు ఈ పాత్రను సిమ్‌లో ఆవిరిమీద నాలుగు గంటలు ఉడికించుకుని తీసుకోవాలి.
డేట్స్ ఆల్మండ్ కేక్
కావల్సిన పదార్థాలు: ఖర్జూర ముక్కలు – కప్పు(నీళ్లతో ముద్దలా చేసుకోవాలి), బాదం పొడి – పావుకప్పు, గోధుమ పిండి – కప్పు, బాదంపాలు – పిండి కలిపేందుకు, ఓట్స్ పొడి – కప్పు, దాల్చిన చెక్కపొడి – అరచెంచా, బేకింగ్ పౌడర్ – చెంచా, యాలకుల పొడి – చెంచా, ఉప్పు – అరచెంచా, వెన్న – అరకప్పు, గుడ్డు – ఒకటి, వెనిల్లా ఎసెన్స్ – అరచెంచా, బాదం పలుకులు – అరకప్పు.
తయారీ విధానం: ఓ గిన్నెలో గోధమపిండి, ఓట్స్‌పొడి, బాదంపొడి, దాల్చినచెక్కపొడి, బేకింగ్ పౌడర్, యాలకులపొడి, ఉప్పు వేసి కలుపుకోవాలి. మరో గిన్నెలో వెన్న, గుడ్డుసొన, వెనిల్లా ఎసెన్స్ వేసుకుని బాగా గిలకొట్టుకోవాలి. ఇందులో గోధుమపిండి మిశ్రమం, ఖర్జూర ముద్ద వేసి బాదంపాలతో కేకు మిశ్రమంలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని వెన్న రాసిన కేకు ట్రేలో తీసుకుని పైన బాదం పలుకుల్ని అలంకరించి 180 డిగ్రీల ఉష్ణోగ్రతలో ముందే వేడిచేసి పెట్టుకున్న ఓవెన్‌లో పెట్టి ఇరవై అయిదు నిమిషాలు బేక్ చేసుకుని తీసుకోవాలి.
మలబార్ చికెన్ బిర్యానీ
కావల్సిన పదార్థాలు: చికెన్ ముక్కలు పెద్దవి – కేజీ, కారం – రెండు చెంచాలు, పసుపు – అరచెంచా, నిమ్మరసం – చెంచా, ఉప్పు – తగినంత.
మసాలా కోసం: ఉల్లిగడ్డలు – రెండు పెద్దవి, టమాటా – ఒకటి, పెరుగు – కప్పు, కొత్తిమీర, పుదీనా తరుగు – కప్పు చొప్పున, గరంమసాలా – ఒకటిన్నర చెంచా, అల్లం వెల్లులి ముద్ద – రెండు టేబుల్‌స్పూన్లు, పచ్చి మిర్చి – నాలుగు, నెయ్యి – అర కప్పు, బాస్మతీ బియ్యం – మూడు కప్పులు (ముందుగా నానబెట్టుకోవాలి), ఎర్రగా వేయించిన ఉల్లిగడ్డ ముక్కలు – కప్పు, నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్‌మిసన పలుకులు – పావుకప్పు చొప్పున, లవంగాలు – నాలుగు, యాలకులు – రెండు, దాల్చినచెక్క – ఒకటి పెద్దది.
తయారీ విధానం: చికెన్ ముక్కలపైన కారం, పసుపు, తగినంత ఉప్పు, నిమ్మరసం వేసి కలిపి ఫ్రిజ్‌లో పెట్టాలి. స్టౌమీద గిన్నె పెట్టి ముప్పావువంతు నెయ్యి వేసి ఉల్లిగడ్డ ముక్కలు, టామాటా తరుగు వేయించుకుని కొద్దిగా ఉప్పు, అల్లంవెల్లుల్లి ముద్ద, పెరుగు వేసి బాగా కలపాలి. రెండు నిమిషాలయ్యాక చికెన్ ముక్కలు, పుదీనా, కొత్తిమీర తరుగు, గరంమసాలా, పచ్చిమిర్చి వేసి కలిపి చికెన్ ఉడికిందనుకున్నాక దింపేయాలి. బియ్యాన్ని కడిగి అందులో లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క, ఆరుకప్పుల నీళ్లు పోసి అన్నాన్ని ముప్పావువంతు ఉడికించుకుని తీసుకోవాలి. ఇప్పుడు ఓ పెద్ద గిన్నె తీసుకుని అడుగున సగం కూర పరికి దానిపైన సగం అన్నం… వేయించిన ఉల్లిగడ్డ ముక్కలు, సగం జీడిపప్పు, కిస్‌మిస్ పలుకులు వేసి పైన మళ్లీ అదే విధంగా చేసుకోవాలి. దీనిపైన మిగిలిన నెయ్యి వేసి మూత పెట్టి ఇరవై నిమిషాలు దమ్ పద్ధతిలో సన్నని మంటపైన ఉంచి దింపేయాలి.