ప్యాంగాంగ్ : ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ త్వరలో రష్యాలో పర్యటించే అవకాశం వుందని మీడియా వార్తలు తెలిపాయి. ఈ పర్యటనా సమయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ అయి ఆయుధ ఒప్పందంపై చర్చలు జరుపుతారని భావిస్తున్నారు. గుర్తు తెలియని అమెరికన్, సంకీర్ణ దేశాల అధికారులను ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ ఈ మేరకు సోమవారం వార్తా కథనాన్ని ప్రచురించింది. కిమ్ వచ్చేవారం వ్లాదివొస్తొక్ వెళతారని పేర్కొంది. బహుశా సాయుధ రైల్లో ఆయన ప్రయాణించవచ్చని తెలిపింది.
వ్లాదివొస్తొక్‌లో సెప్టెంబరు 10-13 తేదీల్లో జరగనున్న ఈస్ట్రన్ ఎకనామిక్ ఫోరం సమావేశాలకు ఇరువురు నేతలు హాజరయ్యే అవకాశం వుంది. కాగా ఈ కథనాన్ని ధృవీకరించేందుకు వైట్‌హౌస్ జాతీయ భద్రతా మండలి నిరాకరించింది. అయితే కిమ్ రష్యాలో ఉన్నత స్థాయి చర్చలు జరిపే అవకాశం వుందని తెలిపింది. ముందుగా హెచ్చరించినట్లుగానే రష్యా, ఉత్తర కొరియా మధ్య ఆయుధ చర్చలు క్రియాశీలంగా ముందుకు సాగుతున్నాయని మండలి ప్రతినిధి వాస్టన్ తెలిపారు. ఈ జులైలో రష్యా రక్షణ మంత్రి ప్యాంగాంగ్‌లో పర్యటించిన విషయాన్ని గుర్తు చేశారు.