ఇంటికో ఉద్యోగం కాదు.. ఊరికో ఉద్యోగం లేదు

– మాయ మాటలు మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కేసీఆర్
– మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
తెలంగాణ రాష్ట్రం వస్తే ఇంటికి ఉద్యోగం ఇస్తామన్న కేసీఆర్ ఊరుకో ఉద్యోగం కూడా ఇవ్వలేదని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి విమర్శించారు. బుధవారం హుస్నాబాద్ మండలం గాంధీనగర్ గ్రామంలో కార్యక్రమంలో భాగంగా ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణలో దగా పడ్డ రైతన్న నిరసన వ్యక్తం చేస్తే బీఆర్ ఎస్ ప్రభుత్వం బేడీలు వేసిందన్నారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో రైతుకు అన్యాయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించిందన్నారు. ప్రస్తుతం తెలంగాణ లో అధికారం లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కనీసం అర్హులైన వారికి రేషన్ కార్డులు, పించన్లు అందించడం లో విఫలం అయిందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అని మాయ మాటలు చెప్పి తెలంగాణ ప్రజలను మభ్య పెట్టీ కేసీఆర్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిందన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నీ అధికారం లోకి తీసుకువచ్చి తెలంగాణ ప్రజల ఆకాంక్షను నేరవేర్చిన సోనియా గాంధీ ఋణం తీర్చు కోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యులు కేడం లింగ మూర్తి, మండల అధ్యక్షులు బంక చందు, అక్కన్న పేట్ మండల అధ్యక్షులు జంగపల్లి అయిలయ్య, గుడాట్ పల్లి సర్పంచ్ బద్దం రాజి రెడ్డి, బార్ కౌన్సిల్ సభ్యులు చిత్తారి రవి తదితరులు పాల్గొన్నారు.