చిన్న కథ కాదు!

– సిరా

మేం పిల్లలం. లోకమంతా మాదే! ప్రతీ రోజూ మాదే! కానీ ఈ రోజు మా పండుగ. పిల్లల పండుగ. చాచా నెహ్రూ పుట్టినరోజున బాలల దినోత్సవంగా మా కోసం సంబరాలు నిర్వహిస్తారు. మా బడుల్లో ఆటలు ఆడతాం, పాటలు పాడతాం. ఇంకా చాలా చేస్తాం. ఈ ఒక్క రోజూ మాదే రాజ్యం. అలాగే ఈ ఒక్క రోజే మా మాట వింటారు. అందుకే ఈ బాలల దినోత్సవం సందర్భంగా మాకేం కావాలో మా కథల ద్వారా మీకు చెప్తాం. వింటారా ఇవాళయినా?
నేను, నాకొక అన్నయ్య. వాడికీ నాకు రెండేళ్ళు తేడా. చిన్నప్పటి నుండి అన్నయ్య దోస్తులే నాకు కూడా దోస్తులు. అందరం కలిసి క్రికెట్‌ ఆడేవాళ్ళం. అన్నయ్య కన్నా నేను బౌలింగ్‌ బాగా చేస్తున్నానని అందరూ అంటుంటే మురిసిపోయేదాన్ని. అమ్మానాన్న కూడా. అప్పుడు మొదలైంది అసలు ఆట! క్రికెట్లో నాకు కోచింగ్‌ ఇప్పించడానికి అకాడమీలో చేర్చారు. మొదట్లో అక్కడ బాగానే ఉండేది. నేను ఆటను ఎంజారు చేసేదాన్ని. కానీ ఒక ఏడాది తరువాత నా శరీరం ఎందుకో తర్ఫీదును తట్టుకోలేకపోయింది. నేను ఆటను ఎంజారు చేయడం మానేశాను. నేనొక మంచి క్రికెటర్‌ అవ్వాలని అమ్మానాన్న కోరిక. పాపం బోలెడు డబ్బు కూడా ఖర్చుపెడుతున్నారు. ఇంక ఆట మానేద్దామని వాళ్ళకు చెపుదామని వెళ్ళినప్పుడల్లా నా గురించి వాళ్ళు కంటున్న కలలు చెప్తుంటే, మళ్ళీ ఆటకు సిద్ధమవుతున్నాను. అసలు క్రికెట్‌ ఎందుకు ఆడటం మొదలు పెట్టానా అని అప్పుడప్పుడూ అనిపిస్తుంటుంది. ఏదైనా ఒక ఆట సరదాగా ఆడుకోలేమా? దానిలో ప్రావీణ్యత పొంది ఏదైనా సాధించాల్సిందేనా? ఆంక్షలు, ఆశయాలు లేకుండా ఆడుకోకూడదా?
– రుచిత (వయస్సు – 14ఏళ్ళు)
పదవ తరగతి అయిపోతే అంతా నీ ఇష్టం అన్నారు. ఇప్పుడేమో స్నేహితులతో ట్రిప్‌కి వెళతా అంటే అమ్మో అంటున్నారు. అనుమతి లేదంటున్నారు. నా ఆశలపై నీళ్లు చల్లుతున్నారు. నువ్వింకా చిన్నపిల్లవే. బయట ప్రపంచం బాలేదు అంటున్నారు. అడుగడుగునా ప్రమాదాలే అంటున్నారు. అడుగు వేయనిస్తే కదా అసలు ప్రమాదాలు రావడానికి. లోకం బాలేకపోతే శిక్ష నాకా? లోకం బాగయ్యేసరికి నేను ముసలిదాన్ని అయిపోతానేమో! ఇంకేం చూస్తాను లోకం? మీరు చెప్పండి. లోకం ఎప్పుడు బాగుపడుతుంది. మాకు స్వేచ్ఛగా తిరిగే అవకాశం ఎప్పుడు వస్తుంది? దానికి మీరేం చేస్తున్నారు?
– సుజి
నా పేరు రాజేష్‌. కానీ రీల్‌ రాజేష్‌ అన్న పేరు బాగా వైరల్‌. మా పల్లెటూళ్ళో రీల్‌ రాజేష్‌ బాగా పాపులర్‌. ఎందుకంటే మా అమ్మ నేను కలిసి చాలా రీల్స్‌ చేస్తుంటాం. మొదట్లో అందరూ మన ఊరి హీరో అనేవారు. బళ్ళో టీచర్లు కూడా బాగా చేస్తున్నావనేవారు. నేను మూడో క్లాసులో ఉన్నప్పుడు వీడియోలు చేయడం మొదలుపెడితే నాలుగో క్లాసుకి వచ్చేసరికి లక్షమంది ఫాలోవర్లు ఉన్నారు మాకు. డబ్బులు కూడా రావడం మొదలయ్యాయి. మేమేమీ డబ్బున్న వాళ్ళం కాదు. అందువల్ల ఇలా వచ్చిన డబ్బుతో మా సరదాలు తీర్చేవారు అమ్మానాన్న. ఇంకా ఎక్కువ వీడియోలు చేస్తే ఇంకా ఎక్కువ డబ్బు వస్తుందని బడి నుండి రాగానే రోజూ ఇదే పని చేసేవాళ్ళం. ఇప్పుడు నా చదువు తగ్గిపోయిందని టీచర్లు తిడుతున్నారు. నేను రాత్రికి చదువుకునే పడుకుంటా రోజూ. కానీ ఎందుకో నాకు ఏమీ గుర్తుండట్లేదు. ఆటలకి వెళ్లకపోవడంతో స్నేహితులు కూడా నన్ను పట్టించుకోవడం మానేశారు. నేను ఒంటరిగా ఉన్నాననిపిస్తోంది. వీడియోలు చేస్తే ఇలాగే మొద్దులా తయారవుతారని నన్ను చూసి టీచర్లు మాట్లాడుకుంటుంటే విన్నాను. ఇది నిజమేనా? మా అమ్మకు తెలుసో లేదో?
– నాల్గవ తరగతి విద్యార్థి రాజేష్‌
నేను, నాకొక అన్నయ్య. వాడికీ నాకు రెండేళ్ళు తేడా. చిన్నప్పటి నుండి అన్నయ్య దోస్తులే నాకు కూడా దోస్తులు. అందరం కలిసి క్రికెట్‌ ఆడేవాళ్ళం. అన్నయ్య కన్నా నేను బౌలింగ్‌ బాగా చేస్తున్నానని అందరూ అంటుంటే మురిసిపోయేదాన్ని. అమ్మానాన్న కూడా. అప్పుడు మొదలైంది అసలు ఆట! క్రికెట్లో నాకు కోచింగ్‌ ఇప్పించడానికి అకాడమీలో చేర్చారు. మొదట్లో అక్కడ బాగానే ఉండేది. నేను ఆటను ఎంజారు చేసేదాన్ని. కానీ ఒక ఏడాది తరువాత నా శరీరం ఎందుకో తర్ఫీదును తట్టుకోలేకపోయింది. నేను ఆటను ఎంజారు చేయడం మానేశాను. నేనొక మంచి క్రికెటర్‌ అవ్వాలని అమ్మానాన్న కోరిక. పాపం బోలెడు డబ్బు కూడా ఖర్చుపెడుతున్నారు. ఇంక ఆట మానేద్దామని వాళ్ళకు చెపుదామని వెళ్ళినప్పుడల్లా నా గురించి వాళ్ళు కంటున్న కలలు చెప్తుంటే, మళ్ళీ ఆటకు సిద్ధమవుతున్నాను. అసలు క్రికెట్‌ ఎందుకు ఆడటం మొదలు పెట్టానా అని అప్పుడప్పుడూ అనిపిస్తుంటుంది. ఏదైనా ఒక ఆట సరదాగా ఆడుకోలేమా? దానిలో ప్రావీణ్యత పొంది ఏదైనా సాధించాల్సిందేనా? ఆంక్షలు, ఆశయాలు లేకుండా ఆడుకోకూడదా?
– రుచిత (వయస్సు – 14ఏళ్ళు)
హలో! నేను పాపాయిని. మొన్నే రెండో పుట్టినరోజు చేసుకున్నాను. కానీ రోజూ నా బట్టలు అలమరాలో నుండి నేనే సెలెక్ట్‌ చేసుకుంటా. అక్కడే మా అమ్మకు నాకూ పేచీ. మా అమ్మేమో రోజూ కొత్తకొత్తవి తీస్తుంది. నాకేమో అవి గుచ్చుకుంటాయి. అందుకే మెత్తగా ఉండే పాత బట్టలే నాకు ఇష్టం. నాకు చెప్పడం రాదు. అందుకే అరిచి గోల చేస్తా. అమ్మకు విసుగొచ్చి నాకు నచ్చిన పాత బట్టలే వేస్తుందనుకోండి. కానీ గోల చేయక్కర్లేకుండా నేను అడిగిన బట్టలు వేసేస్తే బాగుంటుంది కదా!
నేనొక అంతర్జాతీయ స్కూల్లో చదువుతున్నాను. మీరు నన్ను చాలా గొప్పగా చూస్తున్నారు కదా! కానీ అంత చదువు నా దగ్గర లేదు. అందుకే మా కుటుంబంలో అందరికీ నేనంటే చిన్న చూపు. మామూలు స్కూల్లో చదివే మా కజిన్‌ చదువులో ముందుంటాడు. నీకింత ఖర్చుపెట్టి చదివిస్తున్నాం అని ప్రతీక్షణం నన్ను దెప్పుతూ ఉంటారు. నన్ను మామూలు స్కూల్‌కి పంపమంటే పంపరు. అది మన స్థాయి కాదు అంటారు. నాకు ఆ స్థాయి ఏమిటో అర్ధం కాదు. ఎక్కడ చదివినా నా స్థాయి మాత్రం ఎనభై శాతమే. వంద నాది కాదు. నాకు వద్దు కూడా! ఒకసారి వంద వస్తే సరిపోదుగా మరి. ఎనభై అయితే ఎప్పుడూ తగ్గదు. అందుకే నాకు ఎనభై అంటేనే ఇష్టం. నా చదువు నా ఇష్టం కాదా?
– నవీన్‌, తొమ్మిదో తరగతి

నన్ను క్వశ్చన్‌ బ్యాంకు అంటారు మా బళ్ళో! ఎవరైనా ఏదైనా చెప్తే వెంటనే నాకు బోలెడు ప్రశ్నలు పుట్టేస్తాయి బుర్రలో. క్లాసు మధ్యలో అడిగితే క్లాసుకి అడ్డు అంటారు. అయ్యాక అడుగుదామంటే టీచర్‌ దొరకరు. ఇంటి దగ్గర అడిగితే ఇదొక ప్రశ్నలా ఉందా అంటారు. ఈ మధ్య అయితే నేను నోరు విప్పితేనే మూసేయమంటున్నారు. నా ప్రశ్నలు వినే ఆసక్తి లేదు. సందేహాలు తీర్చే సమయం కూడా లేదు ఎవరి దగ్గరా? గూగుల్‌ మాత్రం ఎన్ని అడిగినా ఓపికగా సమాధానం చెప్తుంది. కానీ గూగుల్‌ మనిషి కాదు కదా! నా మాటలు వినే మనుషులు నాకు కావాలి. నా ప్రశ్నలు వినాలి. నాతో చర్చించాలి. నన్ను ప్రశ్నలు అడగాలి. ఇవి చాలా పెద్ద కోరికలేమో నాకు తెలియదు. మీకు తెలుసా??
– పన్నెండేళ్ళ పావని
ఈ పిల్లల్ని కదిపితే ఇన్ని విషయాలు బయటకు వచ్చాయి. బాల్యం మళ్ళీ తిరిగి రానిదని, అపురూపమైనదని చెప్పే మనం వీళ్ళ సవాళ్ళకు సమాధానాలు చెప్పగలమా? వాళ్ళ సమస్యలకు పరిష్కారాలు చూపగలమా? ఆ దిశగా తల్లిదండ్రులు, బంధువులు, ఉపాధ్యాయులు, విద్యాసంస్థలు, ప్రభుత్వాలు, ప్రజలు ఎంత వరకు పని చేస్తున్నారు? వాళ్ళ కతలు, వెతలు వినడానికి మనం ఎంత సమయం వెచ్చిస్తున్నాం? వాళ్ళను సంతోషంగా ఉంచడానికి మనం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయా? వాళ్ళు కోరిన స్వేచ్ఛస్వతంత్రాలు నిర్భయంగా ఇవ్వగలుగుతోందా మన సమాజం? వాళ్ళ సమస్యలను పంచుకునే స్వేచ్ఛను, సవాళ్ళను సమర్ధవంతంగా ఎదురుకునే ధైర్యాన్ని అందించాల్సిన బాధ్యత ఎవరిది? ఈ ఒక్క రోజూ మాత్రమే కాకుండా ప్రతిరోజూ ఆ దిశగా పని చేయాల్సిన అవసరం చాలా చాలా ఉంది. చిన్న కథ కాదు కదా మరి!