– సిరీస్‌కు దూరమైన కోహ్లి
– చివరి 3 టెస్టులకు జట్టు ఎంపిక
నవతెలంగాణ-ముంబయి : భారత మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌పై వేటు పడింది. ఇంగ్లాండ్‌తో తొలి రెండు టెస్టుల్లో విఫలమైన శ్రేయస్ అయ్యర్‌ను చివరి మూడు టెస్టులకు సెలక్షన్ కమిటీ దూరం పెట్టింది. హైదరాబాద్, విశాఖ టెస్టులకు దూరంగా ఉన్న విరాట్ కోహ్లి.. వ్యక్తిగత కారణాలతో సిరీస్‌లో చివరి మూడు టెస్టులకు అందుబాటులో ఉండటం లేదు. రవీంద్ర జడేజా, కెఎల్ రాహుల్ ఫిట్‌నెస్‌పై బీసీసీఐ వైద్య బృందం నివేదిక అందించిన అనంతరం సమావేశమైన సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం ఉదయం జట్టును ప్రకటించింది. 17 మందితో కూడిన జట్టులో జడేజా, రాహుల్ చోటు దక్కించుకున్నా.. మ్యాచ్ ఫిట్‌నెస్ ఆధారంగా తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇక తొలి రెండు టెస్టుల్లో వరుసగా 35, 13, 27, 29 పరుగులే చేసిన శ్రేయస్ అయ్యర్ మిడిల్ ఆర్డర్‌లో విఫలమయ్యాడు. విరాట్ కోహ్లి లేని వేళ అయ్యర్ వైఫల్యం జట్టుపై ప్రతికూల ప్రభావం చూపించింది. సెలక్షన్ కమిటీ అయ్యర్‌పై వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది. 13 ఏండ్ల టెస్టు క్రికెట్ కెరీర్‌లో విరాట్ కోహ్లి తొలిసారి ఓ సిరీస్ మొత్తానికి దూరంగా ఉన్నాడు. బెంగాల్ పేసర్ ఆకాశ్ దీప్ తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. సర్ఫరాజ్ ఖాన్, రజత్ పటీదార్ సహా ద్రువ్ జురెల్, వాసింగ్టన్ సుందర్‌లు జట్టులో చోటు నిలుపుకున్నారు. భారత్, ఇంగ్లాండ్ మూడో టెస్టు ఫిబ్రవరి 15 నుంచి రాజ్‌కోట్‌లో జరుగనుండగా.. రాంచి, ధర్మశాలలో చివరి రెండు టెస్టులు షెడ్యూల్ చేశారు. జశ్‌ప్రీత్ బుమ్రా విశ్రాంతి తీసుకుంటాడనే వార్తలొచ్చినా.. పేస్ దళపతి చివరి మూడు టెస్టులకు అందుబాటులో ఉండనున్నాడు. ఐదు మ్యాచుల టెస్టు సిరీస్ ప్రస్తుతం 1-1తో సమవుజ్జీల సమరంగా నిలిచిన సంగతి తెలిసిందే.
భారత టెస్టు జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), జశ్‌ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, కెఎల్ రాహుల్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, కె.ఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, ఆకాశ్ దీప్.