అస్మదీయులపై వేటు

– అంతర్మథనంలో అధికార పార్టీ
– రిపీట్‌ అవుతున్న దుబ్బాక సీన్‌…
– ఈసీ నిష్పాక్షికమేనా?
కేంద్ర ఎన్నికల సంఘం 20 మంది ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులపై కొరడా ఝళిపించి, వారిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఆదేశించింది. వారంతా అధికార బీఆర్‌ఎస్‌ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇవే కాకుండా త్వరలో మరి కొందరు అధికారులపై కూడా ఇదే తరహా వేటు పడుతుందనే ప్రచారం ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. మరి బదిలీ అయిన వారి స్థానాల్లో నియమితులయ్యే కొత్త అధికారులు నిష్పక్షపాతంగా ప్రజల పక్షాన నిలుస్తారా…లేక మరో పార్టీకి అనుకూలురుగా నిలుస్తారా అనే దానిపై ప్రజల్లో చర్చ ప్రారంభమైంది.
ఎస్‌ఎస్‌ఆర్‌ శాస్త్రి
నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వ కార్యనిర్వాహక వ్యవస్థ రాజకీయ ప్రాపకం కోసం వెంపర్లాడితే ఫలితాలు ఇలాగే ఉంటాయనే చర్చ రాష్ట్ర ప్రజలు, రాజకీయవర్గాల్లో తీవ్రంగా జరుగుతుంది. పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ పార్టీకి అనుకూలంగా అనేక మంది ఐఏఎస్‌, ఐపీఎస్‌ ఆఫీసర్లు పనిచేశారనేది నిర్వివాదాంశం. అయితే ప్రభుత్వంతో కలిసి పనిచేయడం అని సదరు అధికారులు సమర్థించుకొనే ప్రయత్నం చేసినా, ప్రతిపక్షాలు, ప్రజలకు మాత్రం ఆ అధికారులు అధికారపార్టీకి కొమ్ముకాస్తున్నారనే విషయం స్పష్టంగానే తెలిసిపోతుంది. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం 20 మంది అధికారులపై వేటు వేసింది. వీరిలో పది మంది సూపరిటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఎస్పీ) కేడర్‌ అధికారులు ఉన్నారు. వీరిలో సూర్యాపేట ఎస్పీగా పనిచేస్తున్న రజినీర ప్రసాద్‌ మినహా మిగిలిన 9 మందీ డైరెక్ట్‌ ఐపీఎస్‌లు కాకపోవడం గమనార్హం. వీరంతా పదోన్నతుల ద్వారా నాన్‌ కేడర్‌ ఐపీఎస్‌లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఇక డైరెక్ట్‌ ఐపీఎస్‌లుగా ఉన్న ముగ్గురు పోలీస్‌ కమిషనర్లు సీవీ ఆనంద్‌, ఏవీ రంగనాథ్‌, వీ సత్యనారాయణ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే చర్చ ప్రజల్లో, ప్రతిపక్షాల్లో జరుగుతున్న విషయం తెలిసిందే. అలాగే ఐఏఎస్‌ అధికారులై ఉండి రాగద్వేషాలు, భావోద్వేగాలకు అతీతంగా ప్రజల పక్షాన పనిచేయాల్సిన జిల్లా కలెక్టర్లు కూడా రాజకీయ ప్రాపకం కోసం అధికారపార్టీ కనుసన్నల్లోనే పనిచేశారనే ఆరోపణలతో వారిపై కూడా సీఈసీ వేటు వేసింది. ఓటర్ల జాబితాల రూపకల్పనలో వారు ఉదాసీనంగా వ్యవహరించడమే కాకుండా, అనేక అంశాల్లో వారు అధికారపార్టీకి అనుకూలంగా పనిచేశారనేది సీఈసీ అభిప్రాయంగా ఉంది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పలువురు ఐఏఎస్‌ అధికారులు అధికారపార్టీకి అనుకూలంగా పనిచేసి, వివిధ ఆరోపణలు ఎదుర్కొని, ఆ తర్వాత జైలు పాలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎలక్షన్‌ కమిషన్‌ ఆగ్రహానికి గురైన అధికారులందరినీ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యేవరకు విధులకు దూరంగా ఉంచాలని స్పష్టంగా చెప్పేసింది. వీరి స్థానంలో ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున కొత్త అధికారుల పేర్లను గురువారం సాయంత్రానికల్లా సూచించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఆదేశించింది. పనిలో పనిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) శాంతికుమారిని కూడా సీఈసీ అభిశంసించినట్టు సమాచారం. ఆబ్కారీ, వాణిజ్యపన్నుల శాఖను కూడా సీఎస్‌ నిర్వహిస్తున్నారనీ, వాటికి తక్షణం ముఖ్య కార్యదర్శుల్ని నియమించాలని అదేశించింది. పోలీసుల తనిఖీల్లో భారీగా పట్టుబడే మద్యం, నగదు విషయాల్లో పారదర్శకత కోసమే సీఈసీ ఈ నియామకాలను ఆదేశించింది. అయితే నేరుగా సీఎస్‌ అధికారపార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారనే ఫిర్యాదులు ఏమీ రాకున్నా, అమెపై కూడా సీఈసీ పూర్తి విశ్వాసం ప్రకటించలేదని ప్రతిపక్షాలు చెప్తున్నాయి. ఎన్నికలు జరిగే ప్రతిసారీ ఇలాంటి బదిలీలు సర్వ సాధారణమే! దుబ్బాక, హుజూరాబాద్‌ ఉప ఎన్నికల టైంలో కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఇదే తరహాలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను బదిలీ చేసింది. అయితే ఈ బదిలీలు నిష్పక్షపాతంగా జరుగుతున్నాయా లేక కేంద్రంలోని బీజేపీకి అనుకూలంగా చేస్తున్నారా అనే అనుమానాలను కాంగ్రెస్‌పార్టీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి. ఉత్తర తెలంగాణలో కనీసం మూడు స్థానాలు, దక్షిణ తెలంగాణలో ఆరు స్థానాలు గెలవాలనేది బీజేపీ రాజకీయ వ్యూహంగా ఉన్నదనీ, దానికోసం కొత్తగా నియమితులయ్యే అధికారులు పనిచేయరనే గ్యారెంటీ ఏమీ లేదని కాంగ్రెస్‌పార్టీకి చెందిన ఓ సీనియర్‌ నాయకుడు వ్యాఖ్యానించారు. దీనితో సీఈసీ నిష్పాక్షికతపై కూడా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు ప్రభుత్వ యంత్రాంగంపై కోటి ఆశలు పెట్టుకున్న అధికారపార్టీ బీఆర్‌ఎస్‌కు ఈ బదిలీల వ్యవహారం మింగుడుపడటం కష్టమే. తమ మాట చెల్లుబాటు కాకుండా పోతుందేమో అనే సందేహం ఆపార్టీ నేతల్లో కనిపిస్తోంది. బీఆర్‌ఎస్‌ అధిష్టానం కూడా దీనిపై సీరియస్‌గానే కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఒక్కో పోస్టుకు ముగ్గురి పేర్లు పంపాలనే సీఈసీ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు దృష్టికి తీసుకెళ్లారనే ప్రచారం జరుగుతున్నది. ఆ మేరకు ఆయన కొన్ని పేర్లు సూచించారనీ, ఆ జాబితానే ఆమె సీఈసీకి పంపుతున్నారనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో నడుస్తోంది.