నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ ముందు విచారణకు తాను హాజరు కావటం లేదంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కు సమాచారం పంపినట్టు తెలిసింది. లిక్కర్ స్కామ్ కేసును విచారిస్తున్న ఈడీ ఈ కేసుకు సంబంధించి మంగళవారం తమ ఎదుట హాజరుకావాలని సోమవారం కవితకు నోటీసులు అందాయి. అయితే, తనను తన నివాసంలోనే విచారించాలంటూ సుప్రీంకోర్టులో తాను వేసిన పిటిషన్ విచారణలో ఉన్నందున తాను హాజరు కావటం లేదంటూ ఆమె ఈడీకి పంపిన సమాచారంలో ఉన్నట్టు తెలిసింది. వందల కోట్ల రూపాయల ఢిల్లీ లిక్కర్ స్కాంలో సౌత్ జోన్‌కు సంబంధించి సిండికేట్‌కు సంబంధించిన గ్రూప్ తరఫున ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి దాదాపు వంద కోట్ల రూపాయలను అందజేసినవారిలో కవిత కూడా ఉన్నట్టు ఈడీ ఆరోపిస్తున్నది. అంతేగాక, ఈ స్కామ్‌కు సంబంధించి కవిత తాను వాడిన సెల్‌ఫోన్లను కూడా ధ్వంసం చేశారని ఈడీ చెప్తున్నది. తాను ఆ విధంగా ఎలాంటి ధ్వంసానికీ పాల్పడలేదనీ, ఈడీ కోరిన సెల్‌ఫోన్లను తాను వారికి అందజేసినట్టు కవిత చెప్తూ వస్తున్నారు. కాగా, గత మార్చి నెలలో కవితను ఈడీ విచారించగా అటు తర్వాత కూడా ఢిల్లీకి వచ్చి విచారణకు హాజరు కావాలని ఈడీ పంపిన మరో నోటీసుకు తనను తన నివాసంలోనే విచారించాలంటూ కవిత సుప్రీంకోర్టుకు వెళ్లారు.