– ఏపీలో ఒక ఐజీ ముగ్గురు ఐఏఎస్‌లు ఐదుగురు ఎస్‌పీలపై
– తక్షణమే బాధ్యతల నుండి వైదొలగాలి శ్రీ ముగ్గురు సభ్యుల ప్యానెల్ లిస్ట్ పంపాలని ఆదేశం
అమరావతి : కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ప్రక్రియలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకుగానూ పలువురు ఉన్నతాధికారులపై బదిలీ వేటు వేసింది. తమ తరువాత స్థాయి అధికారులకు తక్షణమే బాధ్యతలను అప్పగించి వీరు విధుల నుండి తప్పుకోవాలని ఆదేశించింది. ఎన్నికల విధులకు వీరందరిని దూరంగా ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం జారీ చేసిన ఈ ఆదేశాలు కలకలం రేపాయి. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తరువాత ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నతాధికారులపై ఇసి చర్యలు తీసుకోవడం ఇదే మొదటిసారి. సిఇసి చర్యలు తీసుకున్న వారిలో గుంటూరు రేంజ్ ఐజి పాలరాజు కూడా ఉన్నారు. ఎస్‌పిలు పరమేశ్వరరెడ్డి (ఒంగోలు), వై.రవి శంకర్‌రెడ్డి (పల్నాడు), పి.జాఘవా (చిత్తూరు), ఎస్‌పి కెకె అన్బురాజన్ (అనంతపురం) కె.తిరుమలేశ్వర్ (నెల్లూరు) వేటు పడిన వారి జాబితాలో ఉన్నారు. ప్రధాని సభలో భద్రతా వైఫల్యానికి సంబంధించి కూడా వీరిలో కొందరిపై ఇసి చర్యలు తీసుకుంది. మొత్తంమీద ఆరుగురు ఐపిఎస్ అధికారులపై ఇసి వేటు వేసింది. ఓటర్ల జాబితా రూపకల్పనలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకుగానూ జిల్లా ఎన్నికల అధికారులుగా ఉన్న ముగ్గురు కలెక్టర్లపై కూడా ఎన్నికల కమిషన్ వేటు వేసింది. కృష్జా జిల్లా కలెక్టర్ రాజబాబు, అనంతపురం జిల్లా కలెక్టర్ గౌతమి, తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ఈ జాబితాలో ఉన్నారు. ఈ చర్యలను తక్షణమే తీసుకోవాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇసి అత్యవసర నోటీసు పంపింది.
వీరి స్థానాలో ప్రత్యామ్నాయ అధికారుల నియమాకం కోసం ముగ్గురు పేర్లతో మంగళవారం నాడే ప్యానల్ లిస్ట్‌ను పంపాలని రాష్ట్ర ప్రభు త్వాన్ని ఆదేశించింది . వేటుకు గురైన అధికారులను ఎన్నికల తో సంబంధం లేని పోస్టుల్లోకి బదిలీ చేయాలని రాష్ట్ర సిఇఓకు ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలను సిఎస్, డిజిపికి సిఇఓ పంపారు.
వేటు ఎందుకు…?
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో కొన్ని అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. వీటిని ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకుంది. సంబంధిత ఎస్‌పిలను సిఇఓ ముఖేష్‌కుమార్ నేరుగా పిలిపించి వివరణ తీసుకున్నారు.
ప్రధాన మంత్రి సభలో సెక్యూరిటీ లోపాలపై గుంటూరు రేంజ్ ఐజి జి.పాలరాజు పల్నాడు ఎస్‌పి రవిశంకర్‌రెడ్డిలపై ఇసి వేటు వేసింది. ఓటర్ల జాబితాలో నిర్లక్ష్యంపై అనంతపురం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమి, జిల్లా ఎస్‌పి అన్బురాజన్ అధికారపార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులు రావడంతో పాటు, ఉరవకొండ నియోజకవర్గంలో ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినా పట్టించుకోలేదంటూ ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశారు. ప్రకాశం జిల్లాలో జరిగిన ఒక రాజకీయ హత్యకు సంబంధించి అక్కడి ఎస్‌పిపై చర్య తీసుకున్నట్లు సమాచారం.నెల్లూరు, చిత్తూరు ఎస్‌పిలు కూడా విధి నిర్వహణలోనిర్లక్ష్యంగానూ, ఏకపక్షంగానూ ్యవహరించినట్లు ఇసికి ఫిర్యాదులు అందాయి.
1,000 మందిపై చర్యలు : ముఖేష్‌కుమార్ మీనా
ఎన్నికలనిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ రాష్ట్రంలో ఇప్పటివరకు వెయ్యి మందిపై చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా తెలిపారు. తనన కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ చర్యలు తీసుకున్న వారిలో 556 మంది వాలంటీర్లు ఉన్నారని తెలిపారు. ఎన్నికల నియమావళికి భిన్నంగా ఒక పార్టీకి ప్రచారం చేస్తున్నందుకుగానూ వీరిపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రేషన్ షాపులు నిర్వహణ తదితర ప్రభుత్వ అనుబంధ కార్యక్రమాల్లో ఉన్న మరో 61 మంది రాజకీయ ప్రచారాలు, ప్రదర్శనల్లో పాల్గొన్నట్లు తేలడంతో వారిపై కూడా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ పద్దతుల్లో ఉద్యోగాలు చేస్తున్న 140 మందిని విధుల నుండి తొలగించినట్లు తెలిపారు. 96 మంది రెగ్యులర్ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేశామని, వీరిలో కొందరిని సస్పెండ్ చేసినట్లు సిఇఓ తెలిపారు. ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరు ఖచ్చితంగా పాటించాలని ఆయన కోరారు.