కేరళలో అమలుచేయం..

కేరళలో అమలుచేయం..–  కేరళ సీఎం విజయన్‌
తిరువనంతపురం: వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలుకు కేంద్ర ప్రభుత్వం నిబంధనల్ని నోటిఫై చేయడంపై రాజకీయ పార్టీల నేతలు స్పందిస్తున్నారు. కేంద్రం చర్యపై ప్రతిపక్ష నేతలు మండిపడుతుండగా.. అధికార పార్టీకి చెందినవారు ప్రశంసిస్తున్నారు. సీఏఏను దేశంలో మతపరమైన విభజన సృష్టించే చట్టమని కేరళ సీఎం పినరయి విజయన్‌ అభివర్ణించారు. దక్షిణాది రాష్ట్రం కేరళలో దీన్ని అమలుచేయబోమని స్పష్టం చేశారు. ముస్లిం మైనారిటీలను ద్వితీయశ్రేణి పౌరులుగా పరిగణించే ఈ పౌరసత్వ సవరణ చట్టాన్ని కేరళలో అమలు చేయమని ఇప్పటికే తమ ప్రభుత్వం పదేపదే చెప్పిందని గుర్తు చేశారు. ఆ మాటపై నిలబడి ఉంటామని స్పష్టంచేశారు. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ యావత్‌ కేరళ ఏకతాటిపై నిలబడాలని కోరారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం దేశానికి వ్యతిరేకమైనది..
ప్రజల దృష్టి మళ్లించటానికే..కేజ్రీవాల్‌
దీనిపై ప్రజలు లోక్‌సభ ఎన్నికల్లో స్పందిస్తారని ఆప్‌ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. వివాదాస్పదమైన ఎన్నికల బాండ్ల అంశం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని కేంద్ర మాజీ మంత్రి, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (శరద్‌చంద్ర పవార్‌) పార్టీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ అన్నారు. సీఏఏ అమలు రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజరు సింగ్‌ అన్నారు. అధికార బీజేపీ ప్రతి అంశాన్నీ హిందువులు, ముస్లింల మధ్య విభజనగా తీసుకొస్తుందని ఆరోపించారు.
సీఏఏ అమలు చరిత్రాత్మకం.. యోగి ఆదిత్యనాథ్‌
సీఏఏ అమలుపై కేంద్రం నిర్ణయాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ స్వాగతించారు. మానవతతో ప్రధాని మోడీ, హౌంమంత్రి అమిత్‌ షా ఈ నిర్ణయం తీసుకున్నందుకు యోగి కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో సీఏఏ అమలు చరిత్రాత్మకని పేర్కొంటూ ట్వీట్‌ చేశారు. మోడీ గ్యారంటీ అంటే అర్థం ప్రతి హామీనీ కచ్చితంగా సాకారం చేయడమేనని చౌహాన్‌ పేర్కొన్నారు.
ఆ ప్రశ్నకు బీజేపీ సమాధానం చెప్పాలి: అఖిలేశ్‌
జీవనోపాధి కోసం మన పౌరులే విదేశీబాట పడుతుంటే ఇతరుల కోసం పౌరసత్వ చట్టం తీసుకురావడం వల్ల ఏం వస్తుందని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ ప్రశ్నించారు. బీజేపీ రాజకీయ నాటకాలు ఇప్పుడు ప్రజలకు అర్థమవుతున్నాయన్నారు. గత పదేండ్లలో దేశంలో లక్షలమంది భారత పౌరసత్వాన్ని ఎందుకు వదులుకున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ‘ఎక్స్‌’ వేదికగా డిమాండ్‌ చేశారు. ఎన్నికల బాండ్ల అంశంపై రేపేం జరుగుతుందో గానీ.. ‘కేర్‌ ఫండ్‌’ ఖాతా వివరాలు కూడా చెప్పాల్సి ఉంటుంది అని అఖిలేశ్‌ పేర్కొన్నారు.
న్యాయపోరాటం చేస్తాం.. ఏఏఎస్‌యూ
కేంద్రం నిర్ణయంపై అసోంలోని పలు ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కేంద్రం తీసుకున్న ఈ చర్యలపై న్యాయపోరాటం చేస్తామని ఆల్‌ అస్సాం స్టూడెంట్స్‌ యూనియన్‌ (ఏఏఎస్‌యూ) పేర్కొంది. 1979లో అక్రమ వలసదారులను గుర్తించి వారిని బహిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఏఏఎస్‌యూ ఆరేండ్లపాటు ఆందోళన చేపట్టింది. మరోవైపు, సీఏఏ నోటిఫికేషన్‌ దురదృష్టకరమని కాంగ్రెస్‌ నేత, అసోం అసెంబ్లీలో ప్రతిపక్ష నేత దేబబ్రత సైకియా అన్నారు. అక్రమంగా ఉన్న విదేశీయులంతా అసోంను విడిచి వెళ్లాల్సిందేనని 2016 నుంచి ప్రధాని మోడీ, బీజేపీ చెబుతూనే రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసేలా ఇప్పుడు సీఏఏ అమలుచేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇందుకు అసోం ప్రజలకు ప్రధాని మోడీ, బీజేపీ జవాబు చెప్పాలని డిమాండ్‌ చేశారు.
ఎన్నికల బాండ్ల అంశంపై దష్టి మళ్లించేందుకే..
ఎన్నికల బాండ్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి, ఎన్నికల వేళ మతపరమైన సమీకరణాల్ని ప్రోత్సహించే వ్యూహంలో భాగంగానే బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం సీఏఏ అమలుపై ఈ నిర్ణయం తీసుకుందని జార్ఖండ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాజేశ్‌ ఠాకూర్‌ విమర్శించారు. ‘ఎలక్టోరల్‌ బాండ్లకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాలతో బీజేపీ తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ఏ దారీ కనబడలేదు. అందుకే ఆ సమస్య నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం కోసం సీఏఏ నిబంధనలు విడుదల చేసింది’ అన్నారు.