కంటికి రెప్పలా కాదు..

కంటికి రెప్పలా కాదు..– కంట్లో పెట్టుకొని చూసే హీనుడు ‘కడియం’
– పసిపిల్లల నోటి బుక్క లాక్కున్న రాబంధు
– ఖల్‌ నాయక్‌ నిజాయితేమిటో ప్రజలకు వివరిస్తా : మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య
నవతెలంగాణ-స్టేషన్‌ఘనపూర్‌
కార్యకర్తలను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన వాడే కంట్లో పెట్టుకుని చూసుకునే వాడని, తనకు కాకుండా పక్కన వారికి మర్యాద దక్కితే ఓర్వకుండా, పగ పెంచుకొని అనేక రకాలుగా బాధపెట్టే వాడని, నీచుడు, దుర్మార్గుడని కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఘాటు విమర్శలు చేశారు. వరంగల్‌ పార్లమెంటు బీఆర్‌ఎస్‌ అభ్యర్థి డాక్టర్‌ మారేపల్లి సుధీర్‌ కుమార్‌ గెలుపు కోసం జనగామ జిల్లా స్టేషన్‌ఘనపూర్‌లో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కడియంపై రాజయ్య తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. బెదిరించడం, భయభ్రాంతులకు గురి చేయడంలో కడియం శ్రీహరిని మించిన వారు లేరని ఆరోపించారు. ఎంపీ, ఉపముఖ్యమంత్రి, రెండుసార్లు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే పదవి కూడా లాక్కున్నారని అన్నారు. కడియంను మేధావి అనుకునేవారికి చెంపలేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. 1994 నుంచి 2004 వరకు నియోజకవర్గంలో ఓ గ్రామ సర్పంచ్‌ జన్మభూమికి సహకరించకపోతే జాఫర్‌ ఘడ్‌ గుట్టల్లో కొట్టించిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. 1999లో ఖల్‌ నాయక్‌ అని కడియంపై పుస్తకం వచ్చిందని, 1994లో టీచర్స్‌ కాలనీలో ఉన్న కడియం ఇల్లు చూస్తే.. గచ్చు నేల, కిటికీలకు గోనె సంచులు, తెగిపోయిన చెప్పులతో, మాసిన గడ్డం వేసుకొని పేకాట ఆడుతూ పట్టుబడి పోలీస్‌ స్టేషన్‌లో కూర్చున్న చరిత్ర కడియం శ్రీహరిదని అన్నారు. కడియం ఒక్కసారైనా మాదిగ, బైండ్ల గురించి మాట్లాడారా? అలా మాట్లాడారని నిరూపిస్తే తాను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండనని సవాల్‌ విసిరారు. దళిత ద్రోహిగా, ఆనాడే దళిత దొరగా కడియంను పిలిచేవారని గుర్తు చేశారు. దేవనూరులో భూములు, ఆర్మీచర్‌ ప్లాంట్‌, పెట్రోల్‌ బంక్‌ ఎక్కడివని ప్రశ్నించారు. పార్టీకి, నియోజకవర్గానికి కడియం చేసిందేమీ లేదని, పైగా అవినీతిలో పూర్తిగా కూరుకుపోయారని తెలిపారు. ఇంతచేసినా తన బిడ్డకు కేసీఆర్‌ టికెట్‌ ఇచ్చారని, అయినా పార్టీ మారడానికి సిగ్గుండాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో డైపర్‌ పెట్టుకుని తిరిగిన నువ్వు.. ఇప్పుడు ఏం పెట్టుకొని తిరుగుతావో చూస్తానని అన్నారు. అందరితో ఆత్మీయత పంచుకునేందుకు గడపగడపకు వస్తానని, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సుధీర్‌ను గెలిపించుకునే వరకు.. తగ్గేదేలేదంటూ సవాల్‌ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.