కేవలం అవార్డుల సినిమా కాదు

Not just an awards movie‘ఒక అమ్మాయి అహింస వాదంతో ఊరిని, చెట్టును ఎలా కాపాడింది? అనేది కథ ఇది. సందేశంతో పాటు కమర్షియాలిటి ఉన్న సినిమా. తప్పకుండా అందరి హృదయాలకు హత్తుకుంటుంది. ఇది కేవలం అవార్డుల సినిమా కాదు. అందరికి నచ్చే వాణిజ్య అంశాలు, భావోద్వేగాలు ఉన్నాయి’ అని దర్శకురాలు పద్మావతి మల్లాది చెప్పారు. దర్శకుడు సుకుమార్‌ తనయురాలు సుకృతి వేణి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గాంధీ తాత చెట్టు’. మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌, గోపీ టాకీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి తబితా సుకుమార్‌ సమర్పకురాలు. నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌, శేష సింధురావు నిర్మాతలు. ఇప్పటికే ఈ చిత్రం పలు అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శింపబడి ఎన్నో అవార్డులు కైవసం చేసుకుంది. ఉత్తమ బాల నటిగా సుకృతి వేణి కూడా పురస్కారం పొందింది. ఈ చిత్రాన్ని ఈనెల 24న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్‌ రిలీజ్‌ చేస్తున్నారు.
ఈ సందర్భంగా దర్శకురాలు పద్మావతి మల్లాది మీడియాతో ముచ్చటించారు.
– ‘మనమంతా’, ‘రాధేశ్యామ్‌’, ‘మహా నటి’, ‘చూసి చూడంగానే’, ‘అమ్ము’, ‘బృంద’ ఇలా సినిమాలకు, వెబ్‌ సీరిస్‌లకు రచయితగా వర్క్‌ చేశాను. నా స్నేహితుడు చెట్టుకు, మనిషికి లవ్‌స్టోరీ రాస్తే బాగుంటుంది అనడంతో నాకు ఆ ఐడియా బాగా నచ్చింది. మొక్కల గురించి తదుపరి తరం వాళ్లకు చెప్పాలనే సంకల్పంతో ఈ కథ రాసుకున్నాను.
– గాంధీ పాత్రకు సుకృతి పర్‌ఫెక్ట్‌గా సెట్‌ అయ్యింది. గాంధీ అనే అమ్మాయి గురించి ఈ కథ. గాంధీ సిద్దాంతాలు ఆ పాత్రలో ఉంటాయి. ఈ సినిమాతో అహింస గురించి చెప్పాను. మనుషుల మధ్య, నేచర్‌ మధ్య అహింస చాలా అవసరం. ఇందులో పాటలు, రీ రికార్డింగ్‌కు చాలా ప్రాధాన్యత ఉంది. ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌కి పంపాలనేది సుకుమార్‌ ఐడియా. ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లో మంచి అప్లాజ్‌ వచ్చింది. ఇప్పుడు ప్రేక్షకుల నుంచి కూడా మంచి స్పందన వస్తుందని అనుకుంటున్నాను.