– అంపైర్ విమర్శల ఫలితం
దుబాయ్ : శ్రీలంక క్రికెట్ టీ20 కెప్టెన్ వానిందు హసరంగపై ఐసీసీ క్రమశిక్షణ కొరఢా ఝులిపించింది. అఫ్గనిస్థాన్‌తో మ్యాచ్‌లో అంపైర్ నిర్ణయంపై వానిందు హసరంగ బహిరంగ విమర్శలు చేశాడు. శ్రీలంక బ్యాటర్ కామిందు మెండిస్‌కు అఫ్గాన్ బౌలర్ వఫదార్ సంధించిన ఓ బంతి.. నడుము కంటే ఎక్కువ ఎత్తులో దూసుకెళ్లింది. ఐసీసీ నిబంధనల ప్రకారం ఆ బంతిని నో బాల్‌గా ప్రకటించాలి. కానీ ఫీల్డ్ అంపైర్ లిండన్ హన్నిబాల్ నో బాల్‌గా ఇవ్వలేదు. చివరి మూడు బంతుల్లో శ్రీలంకకు 11 పరుగులు అవసరం కాగా 3 పరుగుల తేడాతో ఆ జట్టు ఓటమి చెందింది. మ్యాచ్ అనంతరం హసరంగ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘ఇటువంటిది అంతర్జాతీయ మ్యాచ్‌లో జరుగకూడదు. ఆ బాల్ నడుముకు కాస్త అటు ఇటుగా వెళ్తే సమస్య లేదు. కానీ ఆ బంతి కొంచెం ఎత్తులో వెళ్తే ఏకంగా తలకే తగిలేలా దూసుకెళ్లింది. అది కూడా చూడలేకపోతే.. అంతర్జాతీయ మ్యాచ్‌కు అంపైర్‌గా చేసేందుకు పనికి రానట్టే. మరేదైన పని చూసుకోవాలి అంపైర్’ అని హసరంగ విమర్శించాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం మ్యాచ్ అధికారులను వ్యక్తిగతంగా దూషించిన కారణంగా హసరంగపై మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత, రెండు మ్యాచుల నిషేధం విధించారు.