ఇద్దరు అదనపు ఎస్పీలపై వేటు

Not on two additional SPs– ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో భుజంగరావు, తిరుపతన్న సస్పెండ్‌
– రెండోరోజు కస్టడీలో  వారి విచారణ
– ఎన్నికల సమయంలో టాస్క్‌ఫోర్స్‌ వాహనాల్లోనే బీఆర్‌ఎస్‌ నాయకులకు డబ్బుల చేరవేత
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఇద్దరు అదనపు ఎస్పీలపై ప్రభుత్వం వేటు వేసింది. ఈ కేసులో అరెస్టయిన ఇద్దరు అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను సస్పెండ్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. అంతకముందు, ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మహబూబాబాద్‌ అదనపు ఎస్పీగా ఉన్న భుజంగరావును, ఇంటెలిజెన్స్‌లో అదనపు ఎస్పీ తిరుపతన్నలను పంజాగుట్ట స్పెషల్‌ టీం పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారనీ, వీరిపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర డీజీపీ రవి గుప్తా ప్రభుత్వానికి నివేదికను పంపించారు. ఈ నివేదిక మేరకు ప్రభుత్వం ఈ ఇద్దరు అధికారులను సస్పెండ్‌ చేస్తూ చర్య తీసుకున్నది. ఈ కేసులో ఇప్పటికే ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావును ప్రభుత్వం సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే.
ఐదు రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్న భుజంగరావు, తిరుపతన్నలను శనివారం రెండో రోజు కూడా స్పెషల్‌ టీం అధికారులు సుదీర్ఘంగా విచారించారు. ముఖ్యంగా, వీరు ఎవరెవరి ఫోన్లను ట్యాపింగ్‌ చేశారు? వారి నుంచి ఫోన్‌ ట్యాపింగ్‌ ద్వారా ఎలాంటి సమాచారాన్ని సేకరించారు? ఈ ఫోన్‌ నెంబర్లను ట్యాపింగ్‌ చేయాలని చెప్పిందెవరు? సేకరించిన సమాచారాన్ని ఎవరికి అందజేశారు. అనే కోణంలో ఇద్దరు అధికారులను దర్యాప్తు అధికారులు ప్రశ్నించినట్టు తెలిసింది. కొంత వరకు సమాచారమిచ్చిన వీరు.. మరికొంత సమాచారాన్ని దాటవేసే ప్రయత్నం చేసినట్టు సమాచారం.
ఈ కేసులో అరెస్టయిన రాధాకిషన్‌రావు నగర టాస్క్‌ఫోర్స్‌ ఓఎస్డీగా గత ప్రభుత్వ అధికార పక్షానికి అసెంబ్లీ ఎన్నికలలో సంపూర్ణంగా సహకరించినట్టు దర్యాప్తు అధికారుల దృష్టికి వచ్చింది. కొన్ని కోట్ల రూపాయలను అధికార పక్షానికి చెందిన కొందరు కీలక నాయకుల సూచనల మేరకు టాస్క్‌ఫోర్స్‌కు చెందిన అధికారిక వాహనాలలోనే మూడో కంటికి తెలియకుండా గమ్యస్థానాలకు చేర్చినట్టు దర్యాప్తు అధికారులకు తెలిసింది. హైదరాబాద్‌ చుట్టుపక్కల ప్రాంతాలేగాక వివిధ జిల్లాల్లోని మారుమూల ప్రాంతాలకు కూడా రాధాకిషన్‌రావు ఈ డబ్బులను చేరవేసినట్టు సమాచారం. ఇందుకోసం, టాస్క్‌ఫోర్స్‌లోనే తనకు అనుకూలమైన టీంను తయారు చేసుకొని వారిని ఇదే పనికి ఉపయోగించుకున్నట్టు తెలిసింది.
ఈ విషయంలో మరికొందరు అధికారుల నుంచి దర్యాప్తు అధికారులు సమాచారాన్ని సేకరిస్తున్నట్టు సమాచారం. తాజాగా, భుజంగరావు, తిరుపతన్నలను విచారిస్తున్న అధికారులు.. ఫోన్‌ ట్యాపింగ్‌, తద్వారా కొందరు వ్యాపారుల నుంచి దండుకున్న డబ్బులు, వాటిని వినియోగించుకున్న తీరుకు సంబంధించి మరింత సమాచారాన్ని సేకరిస్తున్నారని తెలిసింది. ఈ నేపథ్యంలోనే శనివారం మరో ఇద్దరు ఎస్‌ఐబీకి చెందిన ఇన్‌స్పెక్టర్లను పిలిచి స్పెషల్‌ టీం అధికారులు విచారిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో ప్రస్తుతం ఇతర విభాగాల్లో పని చేస్తున్న ఇద్దరు ఐజీ స్థాయి అధికారులను కూడా విచారించటానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది.
రాధాకిషన్‌రావును కూడా మరింత లోతుగా విచారించటానికి ఆయనను కస్టడీకి తీసుకోవటానికి అవసరమైన పిటిషన్‌ను సోమవారం నాడు అధికారులు కోర్టులో దాఖలు చేయబోతున్నట్టు తెలిసింది. పోలీసు శాఖలో భాగమైన ఎస్‌ఐబీ.. రాష్ట్ర డీజీపీ పర్యవేక్షణ కిందనే పని చేస్తుందనీ, ఆయనకు తెలియకుండా ఎస్‌ఐబీలో ఒక్క చర్య కూడా సాగదనీ, ఈ నేపథ్యంలో ఎస్‌ఐబీలో చోటు చేసుకున్న అక్రమ ఫోన్‌ ట్యాపింగ్‌కు సంబంధించి అప్పటి డీజీపీని కూడా విచారించాలని ప్రతిపక్షాల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతున్నది.