జెమినీ టీవీ యాంకర్‌గా అటు బుల్లితెర ప్రేక్షకులను, ‘నిన్ను చూస్తూ’ సినిమాతో హీరోయిన్‌గా ఇటు వెండితెర ప్రేక్షకులను అలరించిన హేమలత రెడ్డి ఓ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. గ్లామన్ మిసెస్ ఇండియా 2024 అవార్డులో బెస్ట్ టాలెంట్, బెస్ట్ ఫోటోజెనిక్ అవార్డులను దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో నిర్వాహకులు బహూకరించిన గ్లోరీ కిరీటంతో హేమలత రెడ్డి అంతర్జాతీయ షూట్ చేశారు. హేమలత రెడ్డికి ఈ పురస్కారాలు రావడం పట్ల గ్లామన్ డైరెక్టర్ మన్ దువా కూడా తన ఆనందాన్ని పంచుకున్నారు. అలాగే హేమలత రెడ్డితో కలిసి ఆమె బటుకేశవరా ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్లామన్ డైరెక్టర్ మన్ దువా మాట్లాడుతూ, ‘హేమలత రెడ్డి మలేషియాలో గ్లామన్ మిసెస్ ఇండియా 2024గా టైటిల్ పొందారు. ఆమె మన దేశాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్‌ని గర్వపడేలా చేసినందుకు మేం ఎంతో సంతోషంగా ఉన్నాం. ఆడిషన్స్ ఇచ్చిన తర్వాత ఈ పురస్కారాల కోసం సంవత్సరం సుదీర్ఘ ప్రయాణం చేశాం. అందాల పోటీల గ్రూమర్‌లు ఆమెకు బాగా శిక్షణ ఇచ్చి, ఆమెలో విశ్వాసాన్ని పెంచారు. తెలుగు ఇండిస్టీ నటి కావడంతో అన్ని ప్రయత్నాలు, శిక్షణ తర్వాత ఆమె గ్లామన్ మిసెస్ ఇండియా 2024 టైటిల్ విజేతగా నిలిచింది’ అని తెలిపారు.